విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బుధవారం నోటీసులు అందుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, గురువారం విచారణకు హాజరయ్యారు. న్యాయవాది పొన్నవోలును పోలీసులు అడ్డుకున్నారు.
ఈ ఏడాది మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలారు. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తర్వాత రెండో సీఎంగా చలామణి అయ్యారు. తన మాటతో ప్రభుత్వాన్ని శాసించారు. అటు అధికారులు, ఇటు నాయకులు ఆయన అపాయింట్‌మెంట్ కోసం క్యూలు కట్టేవారు. ఆయన గదిలో నుంచి బయటకు వచ్చారంటే పోలీసులు సలాం కొట్టేవారు. కానీ పరిస్థితులు ఇప్పుడు తారు మారయ్యాయి. అంతటి రాజ్యాధికారాన్ని అనుభవించిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు కష్టాలొచ్చిపడ్డాయి. సెల్యూట్ కొట్టిన పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. విచారణ పేరుతో ఇంట్లో నుంచి బటయకు లాగారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను చేర్చారు. 120వ నిందితుడిగా సజ్జలను చేర్చారు. విచారణకు హాజరు కావాలని ఆయనకు బుధవారం నోటీసులు జారీ చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మంగళగిరి పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సజ్జల వెంట మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌లతో కలిసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. విచారణ అధికారి వద్దకు సజ్జలతో పాటు తనను కూడా వెళ్లేందుకు అనుమతించాలని పొన్నవోలు పోలీసులను కోరారు. దీనిని పోలీసులు తిరస్కరించారు. వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, పొన్నవోలుకు వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్దమంటూ పొన్నవోలు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలంటే కోర్టు అనుమతులు అప్పనిసరి అని పోలీసులు చెప్పారు. విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో సజ్జల ఒక్కరే విచారణకు పోలీసు స్టేషన్‌లోకి వెళ్లారు. మంగళగిరి డీఎస్సీ మురళీకృష్ణ, రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సజ్జల విచారణ చేస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డికి న్యాయస్థానం ఈ నెల 24 వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే అక్టోబరు 10న లుక్ అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని పొన్నవోలు ప్రశ్నించారు. దాడి జరిగిన రోజు సజ్జల మంగళగిరికి 500 కిమీ దూరంలో ఉన్నట్లు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించినట్లు చెప్పారు. పోలీసులకు విచారించే అధికారం ఉన్నట్టుగానే నిందితులకు కూడా హక్కులు ఉంటాయన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును రకరకాలుగా తిప్పుతున్నారని, దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని పొన్నవోలు అన్నారు. అయితే ఇదే కేసులో ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్, నందిగాం సురేష్‌లను పోలీసులు విచారించారు.
Next Story