నేపాల్‌ టు వైజాగ్ తెలుగు పౌరుల సేఫ్‌ ల్యాండింగ్‌!
x
బాధితులకు ఫుడ్‌ ప్యాకెట్లు అందిస్తున్న దృశ్యం

నేపాల్‌ టు వైజాగ్ తెలుగు పౌరుల సేఫ్‌ ల్యాండింగ్‌!

నేపాల్‌లో నెలకొన్న అల్లర్లతో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు పౌరులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా విమానంలో విశాఖపట్నం తీసుకొచ్చింది.


అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్‌లో చిక్కుకున్న వారిలో పలువురు భారతీయులతో పాటు తెలుగు రాష్ట్రాల వారూ ఉన్నారు. అక్కడి ఆందోళనకారులు తెలుగు వారు బస చేసిన హోటళ్లు, ఇతర భవనాలను తగులబెట్టారు. భారత్‌లోకి చేరుకునే మార్గాలనూ నిరసనకారులు దిగ్బంధనం చేశారు. దాడులకూ తెగబడుతున్నారు. దీంతో వారంతా ప్రాణభయంతో. నాలుగైదు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలా నేపాల్‌లో చిక్కుకుపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 144 మంది ఉన్నారు. వీరంతా ఖాట్మండు , హేటౌడా, పోఖరా, సిమికోట్‌ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. తమను ఎలాగైనా స్వస్థలాలకు చేరవేయాలని అప్పట్నుంచి వేడుకుంటున్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. నేపాల్‌ నుంచి వీరిని తీసుకురావడం కోసం మంత్రి లోకేష్‌ నేతృత్వంలోని ముగ్గురు మంత్రుల కమిటీని నియమించింది. ఐఏఎస్‌ అధికారులు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతోనూ, ఇతర అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరిపారు. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు హెల్స్‌లైన్‌ సెంటరును ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులతో నిరంతరం చర్చిస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం నేపాల్‌ రాజధాని ఖాట్మండు నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానం ద్వారా వీరిని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు వీరందరిని ఎక్కించుకుని ఆ ప్రత్యేక విమానం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.


నేపాల్‌ నుంచి వచ్చే తెలుగు వారి కోసం ఎయిర్‌పోర్టులో వేచి చూస్తున్న ప్రజాప్రతినిధులు

స్వాగతం పలికి.. యోగ క్షేమాలడిగి..
విశాఖ విమానాశ్రయం రన్‌వే నుంచి లాంజిలోకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులకు విశాఖకు చెందిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. వారికి ఎదురేగి వెళ్లి యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను, అక్కడ ఎదురైనా ఇబ్బందులను బాధిత పౌరులు వీరికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతోనే త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నేపాల్‌ బాధితులకు ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసిన ఆహార పొట్లాల (స్నాక్స్‌)ను ప్రజాప్రతినిధులు అందజేశారు. విమానాశ్రయంలో నేపాల్‌ బాధితులకు స్వాగతం పలికిన వారిలో విశాఖ ఎంపీ శ్రీభరత్, విప్‌ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు, బేబీ నాయన, ఎన్‌ ఈశ్వరరావు, కోళ్ల లలితకుమారి, అదిత గజపతిరాజు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ తదితరులున్నారు.

ఎయిర్‌పోర్టులో నేపాల్‌ బాధితుల యోగక్షేమాలు తెలుసుకుంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

వివరాలు సేకరిస్తున్న అధికారులు..
నేపాల్‌ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు వారిని అధికారులు జిల్లాల వారీగా కూర్చోబెట్టి వివరాలు సేకరించారు. విశాఖ చేరుకున్న 144 మందిలో 104 మంది విశాఖలో దిగారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మరో 40 మందిని తిరుపతి విమానాశ్రయానికి పంపుతున్నారు. విశాఖలో దిగిన వారు తమ స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్న తెలుగు వారు

బస్సుల్లో మరికొందరు..
కాగా నేపాల్‌ నుంచి విమానంలో వచ్చిన వారు కాకుండా మరికొందరు తెలుగు వారు అక్కడ ఉన్నారు. వారిని రోడ్డు మార్గం ద్వారా బస్సుల్లో తీసుకొస్తున్నారు. ఇలా బస్సుల్లో 22 మంది బీహార్‌ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశించారు. అటు నేపాల్‌ సిమికోట్‌ నుంచి ప్రత్యేక విమానం ద్వారా నేపాల్‌ గంజ్‌కు తరలించారు. అక్కడ నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తీసుకొచ్చారు. లక్నో నుంచి వీరిని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకురానున్నారు.
Read More
Next Story