రుషికొండ ప్యాలెస్‌.. ఆతిథ్య అనకొండలకేనా?
x
విశాఖ రుషికొండ ప్యాలెస్‌

రుషికొండ ప్యాలెస్‌.. ఆతిథ్య అనకొండలకేనా?

విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను ప్రైవేటు ఆతిథ్య రంగానికి కట్టబెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


అంతా అనుకున్నట్టే అవుతోంది. విశాఖపట్నంలోని ప్రఖ్యాత రుషికొండ ప్యాలెస్‌ను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడానికే ప్రభుత్వం తెగ తహతహ లాడుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రాజప్రాసాదాన్ని తలదన్నేలా నిర్మించిన ఈ భవంతుల సముదాయాన్ని ఏం చేయాలన్న దానిపై కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల నుంచీ ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. ఇప్పుడు అతిథ్య రంగంలోని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.


ప్యాలెస్‌ లోపల మిరుమిట్లు గొలిపే సోయగాలు

ఇదీ రుషికొండ ప్యాలెస్‌ కథ..
విశాఖ సాగరతీరంలోని రుషికొండపై ఉన్న పర్యాటకశాఖ (పున్నమి రిసార్ట్స్‌) భవనాలను తొలగించి మునుపటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.453 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన ప్యాలెస్‌ను నిర్మించింది. రెండోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దానిని క్యాంపు ఆఫీసుగా చేసుకుని పాలన సాగించాలన్న ఉద్దేశంతో నిర్మించినట్టు ప్రచారం ఉంది. అయితే వైఎస్సార్‌సీపీ ఓటమి పాలవ్వడంతో ఆ ఆశలు నెరవేరలేదు. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం పూర్తయ్యేదాకా అటువైపు ఎవ్వరినీ కన్నెత్తి చూడనీయలేదు. దీంతో దాని లోపల ఎలాంటి నిర్మాణాలు జరిగాయో బయట ప్రపంచానికి తెలియనీయలేదు. 2024లో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టాక ఈ రుషికొండ భవంతిలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. వారే కాదు.. ప్యాలెస్‌లోని అత్యద్భుత కట్టడాలు, ఫర్నిచరు, వసతులను మీడియా, సోషల్‌ మీడియా ద్వారా చూసిన వారు నివ్వెరపోయారు.

రుషికొండ ప్యాలెస్‌లో సెల్ఫీ దిగుతున్న పవన్‌ కల్యాణ్‌

మంత్రుల కమిటీ చర్చలు.. సమావేశాలు..
రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలన్న దానిపై నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిలున్నారు. రుషికొండపై ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. రెండు నెలల క్రితం అమరావతిలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ అభిప్రాయ సేకరణ జరిపింది. దీనికి దేశంలో ఆతిథ్య రంగంలో ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో పాటు విదేశీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రుషికొండ ప్యాలెస్‌ను కైవసం చేసుకోవడానికి పలు రకాల ప్రతిపాదనలతో ముందుకొచ్చారు.
ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికే మొగ్గు..
రుషికొండ ప్యాలెస్‌ను ప్రీమియం టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆతిథ్యరంగంలో పేరొందిన తాజ్‌ గ్రూప్, లీలా ప్యాలెస్, అట్మాస్ఫియర్‌ కోర్, ఫెమా గ్రూపులతో చర్చలు జరపాలని యోచిస్తోంది. ఈ ప్యాలెస్‌ను హాస్పిటాలిటీ రంగానికి ఇస్తే ప్రజల సందర్శన అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వీలుంటుందని చెబుతోంది. దీనిపై బుధవారం అమరావతిలో జరిగిన మంత్రుల కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ్‌ ఏమన్నారంటే.. ‘ప్రస్తుతం ఉన్న భవనాలు హోటళ్లకు పూర్తిగా అనుకూలంగా లేవని, అవసరమైతే వాటిపై మరో రెండు ఫ్లోర్‌లు వేసుకుంటే బ్యూటిఫుల్‌ హోటళ్లు నిర్మించవచ్చు. రుషికొండ ప్యాలెస్‌ కోసం ముందుకొచ్చిన నాలుగు సంస్థలను షార్ట్‌లిస్ట్‌ చేశాం. వాటిలో రోజుకు రూ. 50 వేల నుంచి లక్ష వరకు అద్దె వసూలు చేసే తాజ్‌ గ్రూప్, లీలా ప్యాలెస్, అట్మాస్మి ్ఫయర్‌ కోర్, ఫెమా ఉన్నాయి. చివరి రెండు బ్లాకులను ఆర్ట్‌ గ్యాలరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజావసరాలకు వినియోగించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది.. దీనిపై నేడో, రేపో తుది నిర్ణయం తీసుకుని 29న జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో ఆమోదానికి పంపుతాం’ అని తెలిపారు. దీనిని బట్టి రుషికొండ ప్యాలెస్‌ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
మరిన్ని నిర్మాణాలు ఎందుకు?
ఇప్పటికే రుషికొండ ప్యాలెస్‌కు జగన్‌ ప్రభుత్వం రూ.453 కోట్లు ప్రజా ధనాన్ని వృధా చేసిందని సీఎం, డిప్యూటీ సీఎం సహా కూటమి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా మరో రెండు అంతస్తులు నిర్మించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. దీనికి ఎన్ని వందల కోట్లు వెచ్చిస్తారో స్పష్టం చేయలేదు. అదనంగా మరో రెండంతస్తుల నిర్మాణం ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాధునిక హంగులతో అలరారుతున్న ఈ ప్యాలెస్‌కు ఇంకేమీ ఖర్చు చేయకుండానే వినియోగంలోకి తీసుకురావాలని సూచిస్తున్నారు.

ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అభ్యంతరం..
రుషికొండ ప్యాలెస్‌ వినియోగంపై ప్రభుత్వం నిర్ణయాలను బీజేపీకి చెందిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూు. ‘రుషికొండ భవనాల వినియోగంపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోకుండా ముందుకెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. తమతో పాటు ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నాకే తదుపరి చర్యలు తీసుకోవాలి. ఈ ప్యాలెస్‌ను కేవలం ఆదాయ వనరుల కోణంలోనే చూస్తే మున్ముందు అనేక సమస్యలొస్తాయి. దీనిని ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేయాలి. హోటళ్లకు కేటాయించడమంటే రుషికొండను సామాన్యులకు దూరం చేయడమే. స్టార్‌ హోటళ్లకు వెళ్లి భోజనం చేస్తే సామాన్యుల జేబులు ఖాళీ అవుతాయి. అందుకే ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌ అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టం చేశారు.
Read More
Next Story