ఏపీలో ఆర్టీసి బస్సు అపహరణ
x

ఏపీలో ఆర్టీసి బస్సు అపహరణ

అధికారులు షాక్‌ తిన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సును, నిందితుడిని స్వాధీనం చేసుకున్నారు.


కార్లు..లారీలు..బైక్‌లు చోరీలకు గురి కావడం చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఓ ఆర్టీసీ బస్సే అపహరణకు గురైంది. దీంతో ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారులు ఖంగు తిన్నారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం చోరీకి గురైంది. నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి నిరంతరం తునికి తిప్పే బస్సును విధులు పూర్తి అయ్యాక సిబ్బంది ఆదివారం రాత్రి డిపోలో పార్క్‌ చేశారు. అయితే సోమవారం తెల్లవారు జామున సుమారు 4:30 గంటల సమయంలో ఆ బస్సును తీసేందుకు పార్క్‌ చేసిన ప్రదేశానికి వేరే డ్రైవర్‌ వెళ్లి చూడగా అక్కడ బస్సు కనిపించ లేదు. దీంతో ఒక్క సారిగా షాక్‌కు గురైన ఆ డ్రైవర్‌ డిపో ఉన్నతాధికారులకు విషయం చెప్పాడు. వెంటనే డిపో మేనేజర్‌ ఆ బస్సు యజమానికి అపహరణకు గురైన సమాచారం అందించారు. అందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రెండు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. బస్సు ఆచూకీని కనిపెట్టారు. నర్సీపట్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి వెళ్లే మార్గంలో బస్సు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బస్సును చోరీ చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ కేసు గురించి నర్సీపట్నం సీఐ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం బస్సు చోరీకి గురైనట్లు ఫిర్యాదు వచ్చింది. గీతంరాజు అనే వ్యక్తి ఏపీఎస్‌ఆర్‌టీసీకి ఐదు అద్దె బస్సులను నడుపుతున్నారు. వీటిల్లో నర్సీపట్నం నుంచి తుని రూట్లో తిరిగే బస్సు చోరీకి గురైంది. ఆదివారం రాత్రి 10:45 గంటలకు డ్రైవర్‌ డిపోలో పార్క్‌ చేశాడు బస్సును క్లీన్‌ చేయాలని క్లీనర్‌కు చెప్పి డ్రైవర్‌ వెళ్లి పోయాడు. రాత్రి 1 గంట సమయంలో బస్సును క్లీనర్‌ క్లీన్‌ చేశాడు. అయితే తాళం బస్సుకే వదిలేసి క్లీనర్‌ వెళ్లి పోయాడు. ఉదయం వేరే డ్రైవర్‌ వచ్చి చూస్తే బస్సు కనిపించ లేదు. ఈ ఫిర్యాదును పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. టీమ్‌లు ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టమన్నారు. ఆ మేరకు మూడు టీమ్‌లు ఫామ్‌ చేశాం. సీసీ కేమెరాలను పరిశీలించేందుకు ఒక టీమ్‌ను, రెండు రూట్‌ల్లో చెక్‌ చేసేందుకు రెండు టీమ్‌లు ఏర్పాటు చేశాం. చింతపల్లి లిమిట్స్‌లో ఈ బస్సు ఉన్నట్లు సమాచారం అందింది. అదే విషయాన్ని ఎస్పీకి చెప్పాను. చింతలూరు ఎస్‌ఐతో కాంటాక్ట్‌ చేయమన్నారు. వారు రెస్పాండ్‌ అయ్యారు. ఇద్దరు పోలీసులను పంపించారు. అందరు కలిసి బస్సును, నిందితుడుని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కలిగి ఉన్నాడు. గతంలో బస్సులను నడిపిన అనుభవం కూడా ఉంది. విచారణ అనంతరం నిందితుడి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Read More
Next Story