వేగం పుంజుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ కేసు.. దర్యాప్తులో ఆసక్తికర అంశాలు
x

వేగం పుంజుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ కేసు.. దర్యాప్తులో ఆసక్తికర అంశాలు

ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కేసు విచారణ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఏం జరగబోతోంది? ఎంత మందని అరెస్టు చేస్తారు? అనేది చర్చగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌లో కేసులు కలకలం రేపుతున్నాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కేసు వేగం పుంజుకుంది. పోలీసుల దర్యాప్తులో ఆకస్తికకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాడు కస్టడీలోకి తీసుకున్న రఘురామకృష్ణంరాజును పోలీసులు చిత్ర హింసలు పెట్టడం, చితకబాదుతూ ఆ దృశ్యాలను వీడియో కాల్‌ చేసి నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌కు చూపించినట్లు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో తేల్చారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఇప్పటికే గుంటూరు పోలీసులు సేకరించారు. తప్పుడు నివేదికను నాడు గుంటూరు జీజీహెచ్‌ అధికారులు ఇచ్చారని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిర్థారించారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు కేసు త్వరలో ఒక కొలిక్కి రావచ్చనే చర్చ సాగుతోంది.

గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి నరసాపురం ఎంపీ గెలిచిన రఘురామకృష్ణంరాజు తనపైన, తమ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నరనే అనేక కారణాలతో ఆయనపై గత జగన్‌ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఆ నేరం కింద 14 మే 2021న ఆయనను అరెస్ట్‌ చేసి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. తర్వాత ఆయన టీడీపీలో చేరడం, ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ నుంచి పోటీ గెలవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచక జరిగి పోయాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాడంతో తనపై పెట్టిన కేసును రఘురామకృష్ణంరాజు సీరియస్‌గా తీసుకున్నారు. నాడు తనపై అన్యాయంగా కేసు పెట్టి అరెస్టు చేసి చిత్రహింసలు గురిచేశారని ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో మాజీ సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నాటి సీఐడీ చీఫ్‌గా పని చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేసిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీ సీతారామాంజనేయులు, నాడు రఘురామకృష్ణంరాజు కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయపాల్, నాడు మెడికల్‌ రిపోర్టు రూపొంది ప్రభుత్వానికి అందజేసిన నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతిని నిందితులుగా పేర్కొంటూ రఘురామకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరందరిపైన హత్యాయత్నం కేసులు నమోదు చేసి సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీ సతీశ్‌కుమార్‌ను కోరారు. అధికార పక్ష ఎమ్మెల్యే కావడంతో దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసులు చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టడీలో రఘురామకృష్ణంరాజును చిత్రహింసలకు గురిచేయడం నిజమేనని అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది వాగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎలా కొట్టారు, చిత్ర హింసలు ఎలా పెట్టారనే విషయాలను కూడా దర్యాప్తు చేపట్టిన బృందానికి చెప్పినట్లు తెలిసింది. నాడు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రఘురామరాజును కొడుతూ వీడియో కాల్‌లో అప్పటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌కు దృశ్యాలను చూపించామని చెప్పినట్లు సమాచారం. మరో ట్విస్ట్‌ ఏంటంటే ఈ కేసులో కొంత మంది పోలీసులు అప్రూవర్లుగా మారే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే రఘురామను అరెస్ట్‌ చేసిన రోజు రాత్రి ముఖానికి ముసుగేసుకున్న నలుగురు వ్యక్తులు సునీల్‌కుమార్‌ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూలంలో ఇచ్చారు. దాని ప్రకారం గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఆ రోజు రాత్రి పీవీ సునీల్‌కుమార్‌ ఉన్నారా? లేదా? అనేది ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీంతో పాటుగా నాడు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయ్‌పాల్‌ కోసం గాలిస్తున్నారు. విజయ్‌పాల్‌ దొరికితే అసలు విషయాలన్నీ వెలుగు చూస్తాయని భావిస్తున్న పోలీసులకు, ఆ విషయాలేమీ బయటకు పొక్కకూడదనే ఉద్దేశంతోనే అప్పటి పోలీసులే ఆయనను దాచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
చిత్రహింసల అనంతరం రఘురామకు పరీక్షలు నిర్వహించిన గుంటూరు వైద్యులు, ఆయనపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు నివేదికలు ఇచ్చారని, ఆ విధంగా వారిని ఒత్తిడికి నాటి ప్రభుత్వం గురిచేనట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజు బాడీపై రక్తపు గాయాలున్నాయని హైదరాబాద్‌లోని సైనిక ఆసుపత్రి అప్పట్లో నివేదిక ఇచ్చింది. తాజాగా విచారణలో అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలు ఉండడం నిజమేనని కొందరు వైద్యులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పడంతో ఈ కేసు తాజాగా సంచలనంగా మారింది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎంత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి, సీనియర్‌ ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌ను అరెస్టు చేస్తారా అనే అంశాలు సర్వత్రా చర్చగా మారాయి.
Read More
Next Story