సీఎం చంద్రబాబుకు రోజా ఘాటైన కౌంటర్‌
x

సీఎం చంద్రబాబుకు రోజా ఘాటైన కౌంటర్‌

ఎన్నికల తర్వాత ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు ఒకొక్కరుగా సీఎం చంద్రబాబుపైన, ఆయన ప్రభుత్వంపైన విమర్శలు ప్రారంభించారు.


విశాఖపట్నం రుషి కొండపై గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలకు, గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలకు మధ్య వివాదాస్పద అంశంగా మారిపోయింది. అయితే రుషి కొండపై భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు, ఎవరి కోసం నిర్మిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారనే అంశాలను గత ప్రభుత్వం గోప్యంగా ఉంచడం వల్ల తాజాగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటిని వెలుగులోకి తెచ్చింది. వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి తన కోసం జగన్‌మోహన్‌రెడ్డి రాజభవనాలను ఏర్పాటు చేసుకున్నారని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుండగా, రాష్ట్రపతి, దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వ మంత్రుల వంటి వీవీఐపీలు వచ్చినప్పుడు వారి కోసం ప్రత్యేకంగా నిర్మించామని, అంతర్జాయ ప్రమాణాలతో వీటిని అందుబాటులోకి తెచ్చామని గత ప్రభుత్వ తాలూకు మాజీ మంత్రులు చెబుతున్నారు.

ఇదే అంశంపై ఇది వరకు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించగా మరో వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, ఆయన ప్రభుత్వ పెద్దలకు ఘాటుగానే కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో సొంతిల్లు కట్టుకున్నారని, ఆ సమయంలో హయత్‌ హోటల్‌లో ఉంటున్నట్లు లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా ఈ రోజు విమర్శలు చేసేదని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి విమర్శలు చేశారు. అంతేకాకుండా లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్, హైదరాబాద్‌లోని పాత సచివాలయం ఎల్‌ బ్లాక్, హెచ్‌ బ్లాక్‌లలో రూ. 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈ రోజు విమర్శలు చేసేదని ఘాటుగానే విమర్శలు గుప్పించారు.
రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా? అని రోజా ప్రశ్నించారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషి కొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వ లేకపోవడం సమంజసమేనా? 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషి కొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా? 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మిణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖ విఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికి తలమానికగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా? ప్రపంచ పర్యాటకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్‌ డాక్యుమెంట్లలో పొందుపరచిన మాట వాస్తవం కాదా? హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోను అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా? ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? లేదా ? తమ వైఎస్‌ జగన్‌ అన్నపైన, తమపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైఎస్‌ఆర్‌సీపీ వెన్ను చూపేది లేదు.. వెనకడుగు వేసేది లేదు.. జై జగన్‌ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా తన ట్విటర్‌ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుకు, ఆయన ప్రభుత్వంపైన ఘాటైన కౌంటర్లు ఇచ్చారు. ఆర్కే రోజా చేసిన ఈ విమర్శలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఇవి చర్చనీయాంశంగా మారాయి.
Read More
Next Story