రాయలసీమ ‘సుగంధాలు’, అమృతాలు’ మాయం?
x
Image source:Sharukh Hussain Facebook

రాయలసీమ ‘సుగంధాలు’, అమృతాలు’ మాయం?

అక్రమిస్తున్న జి-9 అరటి పంట, రుచి, షెల్ఫ్ లైఫ్, ఎక్స్ పోర్ట్ మార్కెట్ ప్రత్యేక ఆకర్షణ


ఆంధ్రప్రదేశ్‌లో అరటి సాగుకు అనువైన ప్రాంతం రాయలసీమ. ఈ ప్రాంతంలో అరటి సాగు ఒక ఎంతో ముఖ్యమైనది. సాంప్రదాయక వెరైటీలు అయిన సుగంధాలు, అమృతాలు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. అయితే నాలుగైదేళ్లుగా రోబస్టా గ్రాండ్ నైన్ (జి-9) వెరైటీ రైతులను బాగా ఆకర్షిస్తోంది. ఇది అధిక దిగుబడి, మంచి మార్కెట్ విలువతో రైతులకు లాభదాయకంగా మారుతోంది.

జి-9 వెరైటీ మూలాలు

గ్రాండ్ నైన్ (Grande Naine), ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి పరిచయం చేయబడింది. ఇది హోండురాస్ లేదా ఇతర ప్రాంతాల్లో సెలెక్షన్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది అధిక దిగుబడి ఇచ్చే వెరైటీగా ప్రసిద్ధి చెందింది. మొక్కలు 6.5 నుంచి 7.5 అడుగుల ఎత్తు పెరుగుతాయి. 11-12 నెలల్లో పండ్లు కోతకు వస్తాయి. అధిక దిగుబడి, వేగవంతమైన పెరుగుదల, రుచికరమైన పండ్లు, వ్యాధి నిరోధకత (పనామా వ్యాధికి మంచి రెసిస్టెన్స్). అంతే కాకుండా ఇది డిప్రెషన్, అనీమియా, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. సాంప్రదాయిక వెరైటీల కంటే ఎక్కువ లాభాలు, మంచి ఎగుమతి విలువ ఉన్నందున రైతులు దీనిపై ఎక్కవ దృష్టి పెట్టి పంకిస్తున్నారు.


ప్రస్తుత సాగు విస్తీర్ణం

రాయలసీమలో జి-9 అరటి సాగు వేగంగా విస్తరిస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధానంగా సాగు చేస్తున్నారు. 2025లో తాడిపత్రి (అనంతపురం), కడప ప్రాంతాల్లో సుమారు 35,000 హెక్టార్లలో గ్రీన్ అరటి (జి-9) సాగు చేపట్టారు. నంద్యాల జిల్లా పీపుల్లి మండలంలో 2,450 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అరటి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. 2022-23లో 5.68 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. దేశంలో ఇది అత్యధికం. 2016లోనే 17,000 ఎకరాలు టిష్యూ కల్చర్ అరటి సాగు కిందకు వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పెరిగింది. హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ సబ్సిడీలు అందిస్తోంది. దీంతో రైతులు ఈ వెరైటీకి మారుతున్నారు.

స్థానిక వెరైటీలపై ప్రభావం

‘‘జి-9 అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత, ఎక్కువ రోజులు నిల్వ (12-14 రోజులు) ఉండటం వల్ల రైతులకు ఉపయోగంగా ఉంటుంది. వ్యాపారులు కూడా కొనుగోలుకు త్వరగా ముందుకొస్తారు’’ అని హార్టీకల్చర్ ప్రిన్స్ పల్ సైంటిస్ట్ డాక్టర్ కిశోర్ కుమార్ తెలిపారు. స్థానిక వెరైటీలు అయిన అమృతాలు, సుగంధాలు క్రమంగా తగ్గుతున్నాయి. సాంప్రదాయక అరటి షెల్ఫ్ లైఫ్ 6-7 రోజులు మాత్రమే ఉంటాయి. దీంతో ఎగుమతికి అనుకూలం కాదు. రైతులు జి-9కు మారడం వల్ల స్థానిక రకాలు తగ్గినా ఈ వెరైటీతో మంచి లాభాలు గడిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధ్యయనాలు పూర్తయ్యాయి అని కిశోర్ కుమార్ చెప్పారు.

"Banana Tissue Culture in India – A Success Story" అనే నివేదిక ప్రకారం 2019లో APAARI (Asia-Pacific Association of Agricultural Research Institutions) నుంచి డాక్టర్ వి.కె. బరన్వాల్ (VK Baranwal), రీతికా కపూర్ (Reetika Kapoor), శివ్ కాంత్ శుక్లా (Shiv Kant Shukla) విశ్లేషణ ప్రకారం జి-9 వంటి వెరైటీలు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడటానికి కారణం వాటి ఫ్రూట్ లక్షణాలు, వ్యాధి రెసిస్టెన్స్. ఇది స్థానిక జాతులను విస్మరించేలా చేస్తున్నా, రైతుల ఆదాయాన్ని పెంచుతోంది.


ఎగుమతుల వివరాలు

రాయలసీమలో జి-9 అరటి ప్రధానంగా ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్ మొదలైన మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అవుతోంది. 2025లో ఆంధ్రప్రదేశ్ 1.5 లక్షల టన్నుల గ్రీన్ అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. 2024-25లో 1 లక్ష మెట్రిక్ టన్నుల టార్గెట్ రీచ్ అయ్యారు. అనంతపురం నుంచి 2024లో 680 మెట్రిక్ టన్నుల మొదటి షిప్‌మెంట్ మిడిల్ ఈస్ట్‌కు వెళ్లింది. 2022-23లో 48,000 మెట్రిక్ టన్నులు (140 కోట్ల రూపాయలు), 2023-24 చివరికి 300 కోట్ల రూపాయలు దాటింది. దీర్ఘకాలిక రవాణా సామర్థ్యం వల్ల జి-9 ఎగుమతికి అనువైనది. Xలో పోస్టుల ప్రకారం, అనంతపురం నుంచి స్పెషల్ ట్రైన్‌తో 680 MT ఎగుమతి చేశారు.


అధికారుల అభిప్రాయాలు

హార్టికల్చర్ అధికారులు జి-9ను రైతులకు లాభదాయకంగా పేర్కొంటున్నారు. "జి-9 వెరైటీ రైతులకు డివిడెండ్స్ ఇస్తోంది" అని హార్టికల్చర్ అధికారి పి వెంకటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోంది. ఎగుమతులకు మద్దతు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తోంది. అయితే వాతావరణ మార్పులు, వ్యాధులు (బ్లాక్ సిగటోకా) ఎగుమతులను ప్రభావితం చేయవచ్చు అని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

ముందుగానే వ్యాపారులతో...

"G-9 అరటి సాగు చాలా లాభదాయకం. హెక్టారుకు 60-70 టన్నుల దిగుబడి వస్తుంది. సాంప్రదాయక అరటి (20 టన్నులు) కంటే మూడు రెట్లు ఎక్కువ. మేము కంపెనీలతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటాం. ధరలు ఫిక్స్ చేస్తాం. హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ సబ్సిడీలు (ప్లాంటింగ్ మెటీరియల్, ఫెర్టిలైజర్స్) ఇస్తుంది. పంటను గ్రేడ్ చేసి, ఎయిర్‌టైట్ ప్యాకింగ్‌తో తాడిపత్రి, అనంతపురం కోల్డ్ స్టోరేజ్‌లకు పంపుతాం (-13-15°Cలో). ఇది మా ఆదాయాన్ని స్థిరపరుస్తుంది. నంద్యాల జిల్లా పీపుల్లి మండల కేంద్రానికి చెందిన మద్దిలేటి అనే రైతు తెలిపారు. G-9 సాగు రాయలసీమ డ్రై ల్యాండ్‌లకు అనుకూలమని, ఎగుమతులకు సహాయపడుతుందని చెప్పారు. ఎకరానికి రూ.1-1.5 లక్షల వరకు లాభం వస్తుందన్నారు.

అరటికి రాయలసీమ ఎందుకు అనువైనది

రాయలసీమ ప్రాంతం పండ్ల తోటలకు, ముఖ్యంగా అరటి పంటకు ఎందుకు అనుకూలంగా ఉందో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ మహానంది ప్రిన్స్ పల్ సైంటిస్ట్ డాక్టర్ కిశోర్ కుమార్ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ కు తెలిపారు “ రాయలసీమ నేలలో నీరు భూమిలో ఎక్కువ సమయం నిల్వ ఉండదు. నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా తడి మాత్రం ఉండటం అనేది పండ్లతోటలకు అనువుగా ఉంటుంది. ఇలాంటి నేలలో పంట నాణ్యత ఎక్కువ ఉండటంతో పాటు పండు రుచిగా ఉంటుంది,” అని డాక్టర్ కిశోర్ కుమార్ తెలిపారు.

జి-9 రకం చాలా కాలంగా రాయలసీమలో సాగు అవుతోందని, మంచి వెరైటీగా రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నదని చెబుతూ గోదావరి జిల్లాల్లో ఇదే వెరైటీ సాగవుతున్నా అరటి కాయలో నీరు ఎక్కువ చేరి తక్కువ రోజుల్లో పాడవటమే కాకుండా చప్పగా ఉంటుంది. అందుకే రాయలసీమలో పండుతున్న పంటకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది,” అని ఆయన చెప్పారు.

Read More
Next Story