
అమరావతిలో గ్రామాలకు రోడ్ల ముప్పు!
అమరావతిలో గ్రామాలు రోడ్ల వల్ల చిద్రమయ్యే అవకాశం ఉంది. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం 11 గ్రామల్లో నుంచి రోడ్లు వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూ సమీకరణ సమయంలో గ్రామాలకు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం రోడ్ల నిర్మాణాల వల్ల గ్రామాలు చిద్రమవుతున్నాయి. ఇటీవల మందడం గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు (68) రోడ్ల అలైన్‌మెంట్ సమావేశంలో తన ఇంటి స్థలం కోల్పోతున్న ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందడం ఈ సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ ఘటన తర్వాత వైఎస్సార్ సీపీ వంటి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అమరావతిలోని గ్రామాలకు ఢోకా లేదని చెప్పిన పాలకులు ఆ గ్రామాల్లో నుంచి రోడ్లు వేయించడం ఏమిటనేది తీవ్ర చర్చకు దారి తీసింది.
రోడ్డు నిర్మాణంలో తొలగించే మందడం పంచాయతీ ఆఫీస్, గ్రామ సచివాలయ భవనాలు
మాస్టర్ ప్లాన్ ప్రకారం 11 గ్రామాలు ఎఫెక్ట్
అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని ప్రాంతం 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 25 గ్రామాలు (24 రెవెన్యూ గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీ భాగం, 4 హామ్లెట్లు) ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ ద్వారా 34,568 ఎకరాల భూమి సేకరించారు. అయితే రోడ్లు, ట్రంక్ ఇన్‌ఫ్రా, ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ వంటి పనుల వల్ల గ్రామాల మధ్యలో లేదా పక్కల నుంచి రోడ్లు వెళ్లడం ద్వారా గ్రామాలు చిద్రమవుతున్నాయి. సీఆర్‌డీఏ అధికారిక డాక్యుమెంట్ల ప్రకారం ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా వర్క్స్‌లో అబ్బరాజుపాలెం, డొండపాడు, పిచ్చుకులపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, ఐనవోలు, అనంతవరం వంటి 11 గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. మొత్తం 29 గ్రామాలలో 20 గ్రామాలు రోడ్ల వల్ల ప్రభావితమవుతాయని అనధికారికంగా అధికారులు చెబుతున్నారు. వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ ప్రకారం 10 ప్రాధాన్యతా రోడ్ల నిర్మాణానికి ప్రైవేట్ భూమి అవసరమవుతుంది. దీంతో వివిధ గ్రామాల్లో పలు కుటుంబాలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది.
స్పష్టత ఇవ్వని సీఆర్డీఏ
ఇళ్లు ప్రభావితమయ్యే అంశంపై స్పష్టత లేదు. మందడం గ్రామంలో రోడ్డు నిర్మాణం వల్ల 147 ఇళ్లు తొలగించాల్సి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా వర్క్స్ ర్యాప్‌లో ఇళ్ల ప్రస్తావన లేదని, కేవలం 0.58 ఎకరాల ఖాళీ భూములు, ఒక కొష్టం మాత్రమే ప్రభావితమవుతాయని తెలుస్తోంది. అయితే ట్రంక్, ఫ్లడ్, ఏజీసీ వర్క్స్‌లో మరిన్ని ఇళ్లు ప్రభావితమవుతాయనేది స్పష్టం. ప్రభుత్వం ఈ వివరాలను బహిరంగంగా వెల్లడించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రామారావు మృతి ఘటన ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేసింది. ఆయన తన భూమి పూలింగ్‌లో ఇచ్చి, ఇంటిని కూడా కోల్పోతున్నానని సమావేశంలో వ్యక్తం చేస్తూ కుప్పకూలారు. ఇది ప్రభుత్వ అలసత్వాన్ని బయటపెడుతోందని సీపీఎం విమర్శించింది.
మందడంలో ఈ రోడ్డు నుంచే 8 లైన్ల రహదారి
రీసెటిల్‌మెంట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఎక్కడ?
బాధితులకు ప్రత్యామ్నాయాల విషయంలో రీసెటిల్‌మెంట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ (ఆర్‌పీఎఫ్) 2025లో ఆమోదించబడింది. ఇందులో ల్యాండ్ ఫర్ ల్యాండ్ (సమాన విలువతో భూమి మార్పిడి, 500 చదరపు గజాల వరకు), డబుల్ స్ట్రక్చర్ వాల్యూ (డిప్రిసియేషన్ లేకుండా), నిర్మాణ గ్రాంట్ (కనీసం రూ.1.5 లక్షలు), రీలోకేషన్ గ్రాంట్ (రూ.72,217), సబ్‌సిస్టెన్స్ అలవెన్స్ (నెలకు రూ.4,333, 12 నెలలు), లైవ్‌లిహుడ్ గ్రాంట్ (రూ.5,000/నెల, 10 సంవత్సరాలు) వంటివి ఉన్నాయి. ల్యాండ్‌లెస్ కుటుంబాలకు పెన్షన్ రూ.5,000/నెల, 15 సంవత్సరాలు. అయితే బాధితులు కోరిన ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వలేమని సీఆర్‌డీఏ కమిషనర్ ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఇది హామీలకు విరుద్ధంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యం
మొత్తంగా అమరావతి అభివృద్ధి ప్రక్రియలో రోడ్లు కీలకమే అయినప్పటికీ గ్రామాలు, ఇళ్లు ప్రభావితమవుతున్న విధానం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల మద్దతుతో పనులు వేగవంతమవుతున్నాయి. కానీ బాధితుల ఆందోళనలు పరిష్కరించకపోతే ఇది మరిన్ని వివాదాలకు దారితీయవచ్చు. పారదర్శకత, సమర్థవంతమైన గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అవసరం. లేకపోతే రాజధాని కలలు రైతుల కన్నీళ్లలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
రామారావు కుటుంబానికి రూ. 50 లక్షల సాయం అందించాలి: సీపీఎం
రాజధాని గ్రామాల నుంచి రోడ్లు వేయకుండా పక్క నుంచి వేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యలు సీహెచ్ బాబూరావు సీఆర్డీఏ వారికి సూచించారు. మృతుడు రామారావు అంత్యక్రియల్లో బాబూరావు, అమరావతి ప్రాంత సీపీఎం కార్యదర్శి ఎం రవి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామారావు కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారంగా చెల్లించాలని సీఎం కు విన్నవించారు. ప్లాట్లు వాగులు, లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల రైతులకు సీఆర్డీఏ అన్యాయం చేస్తోందని వారు ఆరోపించారు. సోమవారం అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా నిర్వహించి సమస్యల వినతిపత్రాన్ని అధికారులకు అందించారు.

