
ప్రజల చేతుల్లో రోడ్ల సమాచారం
‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను త్వరలో అందుబాటులోకి తీసుకొని రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకాల పురోగతిని సమీక్షించారు. పల్లెల్లో స్వచ్ఛమైన తాగునీరు, గుంతలు లేని రోడ్లు అందుబాటులో ఉంచడమే ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
త్వరలో ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్రామీణ రోడ్ల సమాచారం ప్రజల చేతిలో పెట్టనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్త రోడ్ల వివరాలు, పరిస్థితి, కొత్త నిర్మాణాలు ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేలా ఈ వ్యవస్థ రూపొందనుంది. అడవి తల్లి బాటను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని ఈ సిస్టమ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. 48 గంటల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.
సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0ను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. రూ.2,123 కోట్లతో 4,007 కిలోమీటర్ల రోడ్లు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం జరగనుంది. ఆర్థిక శాఖతో సమన్వయం చేసి నిధులు విడుదల చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అడవి తల్లి బాట పనుల్లో ఆలస్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రూ.1,158 కోట్ల నిధులతో 761 గిరిజన గ్రామాలకు 662 రోడ్లు నిర్మించాలని గుర్తు చేశారు. అటవీ శాఖ సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించాలని, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లా కలెక్టర్లు నిరంతర సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. నవంబర్ మూడో వారం నుంచి ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి సారిస్తామని, 17వ తేదీ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతానని తెలిపారు. నీటి నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు.
స్వమిత్వ పథకంలో మార్చి నాటికి కోటి మందికి యాజమాన్య హక్కు పత్రాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇప్పటికే 613 గ్రామాల్లో సర్వే పూర్తై 5.18 లక్షల మందికి పత్రాలు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరుకు మరో 45.66 లక్షల మందికి, డిసెంబర్ నుంచి మూడో విడత ప్రారంభించి మిగిలిన గ్రామాల సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ రీ సర్వేల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు రాజముద్రతో కూడిన కార్డులు ఇచ్చి ఆస్తులు అమ్మకం, ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, సర్వే విభాగం కార్యదర్శి కూర్మనాథ్, చీఫ్ ఇంజినీర్లు బాలూ నాయక్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

