Revanth and Davos|మెఘాతో రేవంత్ ప్రభుత్వం దావోస్ లో ఒప్పందమా ?
విచిత్రం ఏమిటంటే దావోస్ వేదికగా హైదరాబాద్(Hyderabad) లోని ‘మెఘాకంపెనీ’(Megha company) రేవంత్ ప్రభుత్వంతో ఒప్పందంచేసుకుంది.
దావోస్ సదస్సులో విచిత్రమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలను, పెట్టుబడిదారులను తెలంగాణకు ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి(Revanth) బృందం దావోస్(Davos) కు వెళ్ళింది. పెట్టుబడులు పెట్టడానికి, కంపెనీల విస్తరణకు తెలంగాణ ఏవిధంగా లాభదాయకమో రేవంత్ బృందం విదేశీ పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు వివరిస్తోంది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే దావోస్ వేదికగా హైదరాబాద్(Hyderabad) లోని ‘మెఘాకంపెనీ’(Megha company) రేవంత్ ప్రభుత్వంతో ఒప్పందంచేసుకుంది. విచిత్రం ఏమిటంటే మెఘా కంపెనీ కార్పొరేట్ ఆఫీసు, ఛైర్మన్ కృష్ణారెడ్డి ఉండేది హైదరాబాదులోనే. ముఖ్యమంత్రి రేవంత్ ఉండేది కూడా హైదరాబాదులోనే. కాని ఒప్పందం జరిగింది మాత్రం దావోస్ సదస్సులో.
రేవంత్, కృష్ణారెడ్డి తరచూ ఏదోసందర్భంలో కలుస్తునే ఉంటారు. కాబట్టి పెట్టుబడులు పెడతానని ప్రతిపాదించేందుకు హైదరాబాదులోనే కృష్ణారెడ్డికి బోలెడన్ని అవకాశాలున్నాయి. లేకపోతే రేవంత్ కూడా మెఘా కంపెనీని పిలిపించి పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించవచ్చు. పై రెండు మార్గాల్లో ఏది జరిగినా పెట్టుబడులు వచ్చేది తెలంగాణకే, అభివృద్ధి జరిగేది కూడా తెలంగాణానే. విచిత్రంఏమిటంటే పైరెండుమార్గాలను వదిలిపెట్టి ఎక్కడో స్విట్జర్లాండు(Switzerland)లోని దావోస్ సదస్సులో ఇద్దరు భేటీ అయి ఒప్పందం చేసుకోవటమే. 11 వేల కోట్లరూపాయల పెట్టుబడికి మేఘాసంస్ధ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆపీసు చాలా గొప్పగా చెప్పుకున్నాయి. విదేశీకంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులు లేకపోతే కనీసం దేశంలోని ఇతరరాష్ట్రాల్లోని ప్రముఖకంపెనీలు తెలంగాణ(Telangana)లో పెట్టుబడులుపెట్టడానికి ఒప్పందంచేసుకుంటే గొప్పగా చెప్పుకోవటంలో అర్ధముంది.
తెలంగాణలోని ఎంపికచేసిన ప్రాంతాల్లో బ్యాటరీ ఇంధన సామర్ధ్యం స్టోరేజ్ సిస్టమ్ లను రు. 3 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మెఘా చెప్పింది. అనంతగిరిలో ప్రపంచస్ధాయి లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్స్ ఏర్పాటుకు వెయ్యి కోట్లరూపాయలతో ఏర్పాటు చేయబోతోంది. అలాగే 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు కూడా నిర్మించబోతోంది. వివిధ దశల్లో ఏర్పాటవ్వబోతున్న యూనిట్లలో సుమారు 4వేలమందికి ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు కల్పించబోతున్నట్లు ఎంవోయూలో మెఘా యాజమాన్యం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీపాలసీ-2025లో లక్ష్యసాధనలో తాము కూడా భాగస్వాములవబోతున్నట్లు ఛైర్మన్ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టువల్ల ఇంధన నిల్వ, గ్రిడ్ స్ధిరత్వం, పీక్ లోడ్ నిర్వహణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పర్యాటకరంగం అభివృద్ధిలో భాగంగానే అనంతగిరి కొండల్లో ప్రపంచస్ధాయి వెల్ నెస్ రిసార్ట్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
అలాగే స్కైరూట్ అనే కంపెనీతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో ఒప్పందంచేసుకున్నది. అంతరిక్ష సాంకేతిక రంగానికి సంబంధించి స్కైరూట్ కంపెనీ పరిశోధనలు చేస్తుంటుంది. ఈ కంపెనీ కూడా హైదరాబాదుకు సంబంధించిందే. రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ను రు. 500 కోట్లతో కొత్తయూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో కంపెనీ సీఈవో పవన్ కుమార్ చందన ఎంవోయు కుదుర్చుకున్నారు. నిజానికి ఈ రెండు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటానికి రేవంత్ బృందం హైదరాబాద్ నుండి స్విట్జర్లాండులోని దావోస్ కు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ముందే చెప్పుకున్నట్లు విదేశీకంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటేనే దావోస్ పర్యటన సక్సెస్ అయినట్లు. లేకపోతే దావోస్ లో వేలకోట్లరూపాయల ఒప్పందాలు జరిగాయని చెప్పుకోవటానికి మాత్రమే పర్యటనలు పనికొస్తాయి.