రేవంత్ చేతిలోనే హైడ్రా భవిష్యత్తు ?
x

రేవంత్ చేతిలోనే హైడ్రా భవిష్యత్తు ?

హైడ్రా ఏర్పాడిన దగ్గర నుండి తీసుకున్న చర్యలను, తీసుకోవాల్సిన చర్యలతో హైడ్రా ఒక నివేదికను రెడీ చేసి రేవంత్ కు అందించినట్లు సమాచారం.


హైడ్రా యాక్షన్ ప్లాన్ పై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇపుడు రేవంత్ రెడ్డి మీదపడింది. హైడ్రా ఏర్పాడిన దగ్గర నుండి తీసుకున్న చర్యలను, తీసుకోవాల్సిన చర్యలతో హైడ్రా ఒక నివేదికను రెడీ చేసి రేవంత్ కు అందించినట్లు సమాచారం. హైడ్రా ఆధ్వర్యంలో పురపాలక శాఖ, ఇరిగేషన్, రెవిన్యు, పంచాయితీరాజ్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటి ) ఉన్నతాధికారులు సంయుక్తంగా సర్వేలు జరిపారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు ఎన్ని ? వాటి ప్రస్తుత పరిస్ధితిపై పై శాఖల అధికారులు 15 రోజులు విస్తృతంగా సర్వే చేశారు. ఆ నివేదిక ప్రకారం చాలా చెరువులకు అసలు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) నిర్ణయించలేదు. ఎఫ్టీఎల్లే నిర్ణయించలేదంటే బఫర్ జోన్ కూడా నిర్ణయం కాలేదనే అర్ధం. బఫర్ జోన్ నిర్ణయమయ్యేది ఎఫ్టీఎల్ పైనే అని అందరికీ తెలిసిందే.

ఒకపుడు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 375 చెరువులు కళకళాడుతుండేవి. అలాంటివి ఇపుడు దాదాపు అన్నీ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చెరువులు అయితే మ్యాపుల్లో తప్ప క్షేత్రస్ధాయిలో కనబడటంలేదని రిపోర్టులో హైడ్రా చెప్పింది. చెరువుల ఆక్రమణలు, జంట జలాశయాలు హిమాయత్ సాగర్, గండిపేట చెరువల కాల్వలను కూడా అక్రమార్కులు ఆక్రమించేసి పెద్ద పెద్ద భవనాలను నిర్మించేశారని రిపోర్టులో చెప్పింది హైడ్రా. ముఖ్యంగా గడచిన 20 ఏళ్ళల్లోనే చెరువులు, కాల్వలు, కుంటల ఆక్రమణ పెరిగిపోయినట్లు రిపోర్టు స్పష్టంచేసింది.

ఇపుడు హైడ్రా ముందున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఆక్రమణలను తొలగిస్తుంటే జనాలు శాపనార్ధాలు పెడుతున్నారు. పైగా తొలగిస్తున్న ఆక్రమణల్లో 95 శాతం దిగువ, మధ్య, ఎగువ మధ్యతరగతి జనాల ఇళ్ళే ఉంటున్నాయి. వీళ్ళ ఇళ్ళకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయితీల అనుమతులన్నీ ఉన్నాయి. ఈ అనుమతలను బేస్ చేసుకుని బ్యాంకులు అప్పులు కూడా ఇచ్చాయి. మామూలుగా బిల్డర్లు, రియల్టర్లే తమ నిర్మాణాలు తొందరగా అమ్ముడుపోయేందుకు బ్యాంకులతో టైఅప్ పెట్టుకుని కస్టమర్లకు అప్పులిప్పిస్తున్నారు. ఇపుడు ఏమైందంటే చెరువులు, కాల్వలు, కుంటల ఆక్రమణల పేరుతో హైడ్రా ఇళ్ళను కూల్చేస్తోంది. ఆక్రమణల పేరుతో కూలిపోతున్న ఇళ్ళకు బ్యాంకులో అప్పులే తీరలేదు.

అక్రమణ నిర్మాణాలు చేసిన బిల్డర్లు, రియల్టర్లు బాగానే ఉన్నారు. అప్పులిచ్చిన బ్యాంకులు గూబపగలగొట్టి అప్పులను వసూలు చేసుకుంటాయి. అనుమతులు ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు. ఏ పాపం తెలీకుండా ఇళ్ళుకొనుకున్న ఓనర్లు ఇపుడు రోడ్డుమీద పడుతున్నారు. దాంతో అందరు కలిసి హైడ్రాను శాపనార్ధాలు పెడుతున్నారు. ఆక్రమణలను తొలగించాల్సిందే అని జనాలు ఒకవైపు, ఏ పాపం తెలీకుండా కొనుగోలు చేసిన తమ ఇళ్ళని కూల్చద్దంటు ఓనర్లు మరోవైపు నానా గోలచేస్తున్నారు. దాంతో ఏ నిర్మాణాలు కూల్చాలి ? వేటిని వదిలేయాలో అర్ధంకాక హైడ్రా ప్రభుత్వాన్ని క్లారిటి కోరింది. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని తమకు గైడ్ లైన్సు ఇస్తే దాని ప్రకారమే ముందుకెళతామని రేవంత్ ను హైడ్రా తన రిపోర్టులో కోరింది.

ఎఫ్టీఎల్ నిర్ణయించకపోవటం ఇరిగేషన్, పంచాయితీరాజ్ శాఖల తప్పు. ఈ శాఖలు ఎందుకని ఎఫ్టీఎల్ నిర్ణయించలేదంటే అందుకు రాజకీయ ఒత్తిళ్ళు, బల్డర్లు, రియల్టర్ల ఒత్తిళ్ళు చాలా పనిచేసుంటాయి. అధికారులు, రాజకీయనేతలు, బిల్డర్లు, రియల్టర్లు చేసిన పనికి అప్పులు చేసి ఇళ్ళుకొనుక్కున్న మధ్య, ఎగువమధ్యతరగతి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే చాలా చెరువులకు దగ్గర్లోనే పేదలకు ప్రభుత్వాలే పట్టాలిచ్చాయి. పట్టాల్లో కట్టుకున్న ఇళ్ళని కూడా ఇపుడు హైడ్రా కూల్చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువలకు కేవలం 50 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ నిర్ణయమైందని హైడ్రా తన రిపోర్టులో చెప్పింది.

క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులు, సమస్యలను హెలైట్ చేస్తు తమ యాక్షన్ ప్లాన్ తయారుచేయాలంటే అందుకు తగ్గట్లే మార్గదర్శనం చేయాలని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ తన రిపోర్టులో రేవంత్ ను కోరారు. ఇదే విషయమై రేవంత్ ఉన్నతస్ధాయి సమావేశం ఏర్పాటుచేసి తగిన నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు భావిస్తున్నాయి. చివరకు రేవంత్ ఏమి నిర్ణయం తీసుకుంటారో, హైడ్రాకు ఏమి గైడ్ లైన్స్ ఇస్తారనే విషయంలో ఆసక్తి పెరిగిపోతోంది.

Read More
Next Story