బీజేపీని మూసీబస్తీల్లో పడుకోబెట్టిన రేవంత్
x

బీజేపీని మూసీబస్తీల్లో పడుకోబెట్టిన రేవంత్

శనివారం రాత్రి మూసీనది పరివాహక ప్రాంతంలోని 20 ప్రాంతాల్లో 20 మంది కీలకనేతలు భోజనాలు చేయటమే కాకుండా రాత్రంతా బస్తీల్లోనే గడిపారు.


మొత్తానికి బీజేపీని రేవంత్ రెడ్డి మూసీనది పరివాహక ప్రాంతంలో పడుకోబెట్టారు. బీజేపీని అంటే బీజేపీ(BJP) నేతలని ఇక్కడ అర్ధంచేసుకోవాలి. విషయం ఏమిటంటే శనివారం రాత్రి మూసీనది పరివాహక ప్రాంతంలోని 20 ప్రాంతాల్లో 20 మంది కీలకనేతలు భోజనాలు చేయటమే కాకుండా రాత్రంతా బస్తీల్లోనే గడిపారు. శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 9 గంటలవరకు బస్తీల్లో వివిధ ప్రాంతాల్లోని కొందరిళ్ళల్లో భోజనాలు చేయటమే కాకుండా నిద్రకూడా పోయారు. కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి(KishanReddy)తో పాటు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(Konda Visweswar Reddy), మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eetala Rajendar), రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(Lakshman) తో పాటు మరికొందరు సీనియర్ నేతలు, మద్దతుదారులు మూసీనది బస్తీల్లో స్ధానికులతో కలిసి భోజనాలు చేసి నిద్రకూడా పోయారు. ఇదంతా ఎందుకు చేయాల్సొచ్చిందంటే రేవంత్ రెడ్డి(Revanthreddy) కారణంగానే అని చెప్పాలి.



మూసీనది(Musi river sleep) పునరుజ్జీవన ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం టేకప్ చేసిన విషయం తెలిసిందే. మురికికూపంగా మారిపోయిన మూసీనది పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్న లక్షలాదిమంది ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందిపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. నదిలోని నీరంతా విషపూరితమైపోయిందన్నారు. ఇక్కడి నీటితో పండించే పంటలంతా విషపూరితాలే కాబట్టి నదిని మళ్ళీ మంచినీటి నదిగా మార్చటమే తన ధ్యేయంగా రేవంత్ చెప్పారు. అందుకనే నదికి రెండువైపులా ఉన్న వేలాది నిర్మాణాలు, ఆక్రమణలను కూల్చేయాలని డిసైడ్ అయ్యారు. నివాసాలు కూల్చటమనే పాయింట్ దగ్గరే రేవంత్ కు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ప్రక్షాళనకు తాము వ్యతిరేకంకాదని ఒకవైపు చెబుతునే ఇళ్ళను కూల్చకుండా పునరుజ్జీవన ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.



ఈ నేపధ్యంలోనే మూసీనది పరివాహక ప్రాంతంలో ఈమధ్యనే పాదయాత్రచేసిన రేవంత్ తర్వాత జరిగిన సభలో మాట్లాడుతు మూసీబస్తీల్లో ఒక్కరోజు ఉంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని ఛాలెంజ్ విసిరారు. తర్వాత ఒక్కరోజును మూడునెలలుగా రేవంత్ మార్చారు. రేవంత్ సవాలుగా బీఆర్ఎస్ నేతలు స్పందించలేదుకాని బీజేపీ నేతలు మాత్రం తర్వాత స్పందించారు. తాము మూసీబస్తీల్లో ఒక రోజు రాత్రి నిద్రించటానికి సిద్ధమని కిషన్ రెడ్డి రెండురోజుల క్రితం ప్రకటించారు. ప్రకటించినట్లుగానే శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు 20 మంది నేతలు 20 బస్తీల్లో సుమారు 19 గంటలపాటు గడిపారు. ఎప్పుడూలేని విధంగా కేంద్రమంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు తమ బస్తీల్లో తమతో పాటు భోజనాలు చేసి, నిద్రించేందుకు రావటంతో ఆ ప్రాంతాలన్నీ సందదిగా మారిపోయాయి. కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలోని తులసీనగర్ లంకలోని శంకరమ్మ ఇంట్లో భోజనంచేసి నిద్రించారు. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజేంద్రనగర్లోని హైదర్ షా కోట ప్రాంతం బస్తీలో గడిపారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బస్తీలో పడుకున్నారు.



ఎప్పుడైతే బీజేపీ నేతలు బస్తీనిద్రకు రెడీ అయ్యారో వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఒక్కరోజు నిద్రిస్తే మూసీ బస్తీల్లోని పరిస్ధితులు ఏమితెలుస్తుంది అని అడుగుతున్నారు. కనీసం మూడునెలలు పడుకుంటేకాని బీజేపీ నేతలకు బస్తీల్లోని వాతావరణం అర్ధంకాదంటున్నారు. అయితే మంత్రులు, కాంగ్రెస్ నేతల ఎదురుదాడిని బీజేపీ నేతలు పట్టించుకోవటంలేదు.


ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ ఛాలెంజ్ చేశాడు కాబట్టే ఇపుడు బీజేపీ నేతలు మూసీబస్తీల్లో భోజనాలుచేసి నిద్రించారు. లేకపోతే వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఈ ప్రాంతాల్లో భోజనాలు చేసి నిద్రించేవాళ్ళే కారని అందరికీ తెలుసు. ఎందుకంటే కిషన్, కొండా, లక్ష్మణ్, ఈటలతో పాటు చాలామంది నేతలు దశాబ్దాలుగా హైదరాబాదులోనే ఉంటున్నారు. అయితే వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా మూసీనది బస్తీల్లోని ఏ ఒక్క ప్రాంతంలో కూడా భోజనంచేసి, నిద్రించిన దాఖలాలు లేవు. మొదటిసారి రేవంత్ ఛాలెంజ్ పుణ్యమాని కిషన్ తో పాటు ఎంపీలు, సీనియర్ నేతలు మూసీబస్తీల్లో భోజనాలు చేయటమే కాకుండా నిద్రించేశారు. మామూలుగా అయితే మూసీనది పరివాహక ప్రాంతాల్లో ఒట్లకోసం వెళ్ళే నేతలు ఒక్కసారిగా తమ ప్రాంతాల్లో భోజనాలుచేసి నిద్రించటాన్ని బస్తీజనాలు మాత్రం ఫుల్లుగానే ఎంజాయ్ చేశారు.

Read More
Next Story