చంద్రబాబుకు హైటెక్ సిటి లాగే రేవంత్ కు ఫోర్త్ సిటీనా ?
x

చంద్రబాబుకు హైటెక్ సిటి లాగే రేవంత్ కు ఫోర్త్ సిటీనా ?

పరిశ్రమలకు అవసరమైన మానవవనరుల అభివృద్ధి మొత్తాన్ని ఫోర్త్ సిటీలోనే తాయరుచేయాలన్నది రేవంత్ ఆలోచన.


పరిశ్రమల స్ధాపన, పెట్టుబడుల ఆకర్షణలో తన ముద్రను చూపించాలని రేవంత్ రెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు. అభివృద్ధిని కాంక్షించే ఏ ముఖ్యమంత్రయినా ఇలాగే ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే సమావేశం ఏదైనా, తాను ఎక్కడ పర్యటించినా రేవంత్ ఒక విషయాన్ని పదేపదే చెబుతున్నారు. అదేమిటంటే ఫోర్త్ సిటి..ఫోర్త్ సిటి అని. ప్రపంచ అవసరాలను తీర్చటంకోసం హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీ రూపంలో ఫోర్త్ సిటీని డెవలప్ చేయబోతున్నట్లు రేవంత్ చాలా గట్టిగా చెబుతున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే ఢిల్లీలో ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లీ యూన్ తో రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో యాంగ్ లీ యూన్ కి రేవంత్ ఫోర్త్ సిటీ గురించే వివరించారు.

రేవంత్ ప్రజెంటేషన్ విన్న యూన్ కూడా తొందరలోనే హైదరాబాద్ వస్తానని హామీ ఇచ్చారు. తాను హైదరాబాద్ వచ్చేకన్నా ముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, ఇండియా ప్రతినిధి వీ లీ బృందం హైదరాబాద్ వచ్చి అన్నీ విషయాలను పరిశీలిస్తుందన్నారు. అంటే వీళ్ళిచ్చే రిపోర్టు ఆధారంగానే హైదరాబాద్ వచ్చే విషయం డిసైడ్ అవుతుందని ఛైర్మన్ యాంగ్ లీ యూన్ చెప్పకనే చెప్పేశారు. నిజంగానే ఫాక్స్ కాన్ గనుక హైదరాబాద్ లో యూనిట్ ఏర్పాటుచేస్తే రేవంత్ రొట్టె విరిగి నేతిలో పడినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఫాక్స్ కాన్ యూనిట్ ఏర్పాటు కోసం దేశంలో చాలా రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. వీళ్ళ పెట్టుబడి రు. 60, 70 వేల కోట్లపై మాటనే చెప్పాలి. అలాగే ఉద్యోగ, ఉపాధి కూడా తక్కువలో తక్కువ 3 లక్షలమందికి దొరుకుతుంది. కాబట్టే ఫాక్స్ కాన్ ను ఆకర్షించేందుకు దేశంలోని చాలా రాష్ట్రాలు పోటీపడుతున్నాయి.

అలాంటి కంపెనీ ఛైర్మన్ తో రేవంత్ చాలాసేపు భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీతో పాటు రాష్ట్రానికి జరిగే ఉపయోగాలను వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ (హైటెక్ సిటి ఏరియా)కు ధీటుగా ఫోర్త్ సిటీని డెవలప్ చేయబోతున్నట్లు రేవంత్ చెప్పారు. అందుకనే తాము కొత్తగా డెవలప్ చేయబోయే ఏరియాను ఫ్యూచర్ సిటీ అలియాస్ ఫోర్త్ సిటీ అని రేవంత్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. రేవంత్ అనుకున్నది అనుకున్నట్లు ఫోర్త్ సిటీ డెవలప్ అయితే బహుశా సైబరాబాద్ లేదా హైటెక్ సిటీకి డిమాండ్ తగ్గిపోవటం ఖాయం. ఎందుకంటే రేవంత్ చెబుతున్న ఫోర్త్ సిటీలోనే విద్య, వైద్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటిని ఫోర్త్ సిటీలోనే ఏర్పాటు చేస్తారు. పై రంగాల్లోనే కాకుండా స్టార్టప్ కంపెనీలను కూడా ఫోర్త్ సిటీలోనే ఏర్పాటు చేయించేందుకు రేవంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.




అందుకనే చేవెళ్ళ-ఇబ్రహింపట్నం నియోజకవర్గాల్లోని ముచ్చర్ల ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాలను సేకరించబోతోంది ప్రభుత్వం. దీనికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా మొదలైపోయింది. పరిశ్రమలకు అవసరమైన మానవవనరుల అభివృద్ధి మొత్తాన్ని ఫోర్త్ సిటీలోనే తాయరుచేయాలన్నది రేవంత్ ఆలోచన. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల ఏర్పాటు క్రెడిట్ ను ఇప్పటి పాలకులు ఎవరూ తమ ఖాతాలో వేసుకునేందుకు లేదు. ఎందుకంటే జంటనగరాలకు 400 ఏళ్ళ చరిత్రుంది. అందుకనే మూడోసిటిగా హైటెక్ సిటి తయారైంది. దీనికి పునాది నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే పడినా చంద్రబాబునాయుడు హైజాక్ చేసేశారు.

గడచిన పాతికేళ్ళుగా హైటెక్ సిటీ అంటే అందరికీ చంద్రబాబు పేరుమాత్రమే గుర్తుకొస్తుంది. అంతలా తనను తాను చంద్రబాబు ప్రమోట్ చేసుకున్నారు. ఇపుడు అదే పద్దతిలో తన హయాంలో ఫోర్త్ సిటీ అనేదాన్ని బాగా డెవలప్ చేసి హెటెక్ సిటీకి ధీటుగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దాన్ని మించిపోయేలా ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలన్నది రేవంత్ పట్టుదల. అందుకనే అమెరికా, దక్షిణకొరియా పర్యటనలో కూడా పారిశ్రామికవేత్తలతో జరిగిన భేటీలో రేవంత్ పదేపదే ఫోర్త్ సిటి లేదా ఫ్యూచర్ సిటీ అనే ప్రస్తావించారు. అదే పద్దతిలో ఇపుడు ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లీ యూన్ తో కూడా ఫోర్త్ సిటీ అని చెప్పి యూన్ తో కూడా ఫోర్త్ సిటీ విజన్ అద్భుతమని చెప్పించారు.

ఫోర్త్ సిటీ రూపకల్పనలో, పారిశ్రామిక అనుకూల విధానాలు తనకు బాగా నచ్చినట్లు యూన్ రేవంత్ తో చెప్పారు. ఫోర్త్ సిటీ ఏర్పాటు గురించే యూన్ కూడా రేవంత్ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కాబట్టి యూన్ గనుక తమ కంపెనీని ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయితే రేవంత్ నక్కతోకను తొక్కినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఫాక్స్ కాన్ యూనిట్ ఏర్పాటైతే ఇప్పటివరకు ఉన్న కంపెనీలన్నీ ఒక ఎత్తు, ఒక్క ఫాక్స్ కాన్ మరో ఎత్తుగా ఉంటుంది. ఫాక్స్ కాన్ యూనిట్ ఏర్పాటును చూపించి ప్రపంచంలోని అనేక కంపెనీలను రేవంత్ ఫోర్త్ సిటీలోకి తీసుకురావచ్చు. ఇపుడు మాటల్లో మాత్రమే వినబడుతున్న ఫోర్త్ సిటీ కార్యరూపందాలిస్తే ఆ ప్రాంతమంతా మరో అద్భుతం అవుతుందనటంలో సందేహంలేదు. మరి ఆ ఫోర్త్ సిటీ మాటలకు, కాగితాలకు మాత్రమే పరిమితమవుతుందా ? లేకపోతే నిజంగానే కళ్ళకు కనబడుతుందా అన్నది రేవంత్ చిత్తశుద్దిపైనే ఆధారపడుంది.

Read More
Next Story