రేవంత్ మాట నిలబెట్టుకున్నారా ?
x

రేవంత్ మాట నిలబెట్టుకున్నారా ?

రైతులకు రు. 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలుకు రేవంత్ గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టారు.


ఎన్నికల సమయంలో గెలుపుకోసం చాలాపార్టీలు, అభ్యర్ధులు చాలా హామీలను ఇచ్చేస్తారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీని నిలుపుకునేది తక్కువమంది మాత్రమే. ఇపుడు విషయం ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కీలకమైన రైతు రుణమాఫీ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలుపుకున్నది. రైతులకు రు. 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలుకు రేవంత్ గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టారు.

రైతు రుణమాఫీని మూడు విడతలుగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో లక్ష రూపాయల రుణాలు, రెండో దశలో లక్షనుండి లక్షన్నర రూపాయల రుణాలు, మూడో దశలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయబోతున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు దశల్లోను కలిపి సుమారు 60 లక్షల మంది రైతులకు రు. 41 వేల కోట్ల రుణాలు మాఫీ కాబోతున్నాయి. ఇందులో భాగంగానే మొదటిదశలో 11.50 లక్షల మంది రైతులకు రు. 7 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. గురువారం రేవంత్ సచివాలయంలో బటన్ నొక్కగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రెండో విడత మాఫీ నిధులను ఈనెలాఖరులోగా జమచేయాలని, మూడో విడత రుణమాఫీని ఆగష్టు మొదటివారంలో అంటే 2 లేదా 3వ తేదీన జమచేయబోతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి.

మొత్తంమీద సిక్స్ గ్యారెంటీస్ లో కీలకమైన రైతురుణమాఫీ అమలు ప్రారంభమైంది. ఈ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే అవకాశంలేదని బీఆర్ఎస్ కీలకనేతలు కేటీయార్, హరీష్ అనుకున్నారు. అందుకనే రుణమాఫీ హామీ అమలుపై ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేట్లుగా పదేపదే ఆరోపణలు చేయటమే కాకుండా ఛాలెంజులు కూడా చేశారు. నిజానికి ఎన్నికల సమయంలో రేవంత్ అండ్ కో ఇచ్చిన హామీ అయితే సిక్స్ గ్యారెంటీస్ అమలును అధికారంలోకి వచ్చిన నలరోజుల్లోనే అమలుచేస్తామని. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ కు అర్ధమైంది ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల లోటుబడ్జెట్లో ఉందని. అందుకే ముందు ఎక్కువ ఆర్ధికభారంలేని ఆరోగ్యశ్రీ పరిధిని ర. 10 లక్షలకు పెంచటం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేశారు.

తర్వాత కొంత సమయం తీసుకుని ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా అమల్లోకి తెచ్చారు. మిగిలింది రైతురుణమాణీతో పాటు మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్ పథకాలు మాత్రమే. ఈ రెండింటిలో కూడా రైతు రుణమాఫీ అన్నది చాలా కీలకమైంది. ఎందుకంటే కావాల్సిన మొత్తం చాలా పెద్దది రు.41 వేల కోట్లు, పైగా లబ్దిదారుల సంఖ్య లక్షల్లో అంటే సుమారు 60 లక్షలు. అందుకనే పంద్రాగష్టును డెడ్ లైనుగా పెట్టుకుని అనేక కసరత్తులు చేసి. మార్గదర్శకాలను రెడీ చేయటంతో అనర్హులను ఏరేశారు. ఎప్పుడైతే అనర్హుల ఏరివేత మొదలైందో అప్పుడే మాఫీ చేయాల్సిన మొత్తం కూడా 41 వేల కోట్ల రూపాయల నుండి రు. 31 వేల కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో రుణమాఫీకి అవసరమైన నిధులను అప్పుగా ఇవ్వటానికి ఆర్ధికసంస్ధలు ముందుకు రావటంతో రుణమాఫీ ప్రక్రియకు రేవంత్ శ్రీకారం చుట్టారు.

నూరుశాతం రుణమాఫీ అయినట్లేనా ?

నూరుశాతం రుణమాఫీ చేయటం ఏ ప్రభుత్వానికీ సాధ్యంకాదు. మొదటిదశ రుణమాఫీలో నిజమైన అర్హులకు పథకం వర్తించలేదని జిల్లాల నుండి సమాచారం అందుతోంది. రుణమాఫీ అందుకోవటానికి తమకు అన్నీ అర్హతలు ఉన్నా ఎందుకు మాఫీ కాలేదని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఖమ్మంలో లక్ష రూపాయల లోపు రుణాల మాపీకి అన్నీ అర్హతలున్న రైతులు 1,43,327 మంది ఉన్నారు. అయితే 37,625 మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ అయినట్లు సమాచారం. అర్హతలున్న రైతులకు మాఫీ అవ్వాల్సిన రు.526 కోట్లకు బదులు మాఫీ అయ్యింది కేవలం 121 కోట్ల రూపాయలు మాత్రమే. మహబూబ్ నగర్ జిల్లాలోని బడేపల్లి సహకార బ్యాంకు పరిధిలో రుణమాఫీకి 756 మంది రైతులకు అర్హతలుంటే మాఫీ అయ్యింది 388 మంది రైతులకు మాత్రమే. భువనగిరి, నల్గొండ లాంటి అనేక జిల్లాల్లో అర్హతలు గల రైతులందరికీ రుణాలు మాఫీ కాలేదని సమాచారం అందుతున్నది. మరి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read More
Next Story