
సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనంచేసిన రేవంత్
కాసేపు మాట్లాడిన తర్వాత బూరం కుటుంబసభ్యులతో కలిసి రేవంత్, మంత్రులు, చీఫ్ సెక్రటరీ సహపంక్తి భోజనంచేశారు
రేవంత్ రెడ్డి మధ్యాహ్నం భోజనంచేశాడు. రేవంత్ భోజనంచేయటంలో విశేషం ఏముంది ? విశేషం ఏమిటంటే సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో రేవంత్ భోజనం చేయటమే. ప్రభుత్వం ఈమధ్యనే రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీచేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఇస్తున్న దొడ్డుబియ్యం స్ధానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం(Bhadrachalam Temple)లో జరిగిన సీతారాముల కల్యాణంలో రేవంత్(Revanth) పాల్గొన్నారు. కల్యాణం అయిపోయిన తర్వాత భద్రాచలంకు ఆనుకునే ఉండే సారపాకలో పర్యటించారు.
సారపాకలోని సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti), కొండా సురేఖ, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తదితరులతో కలిసి బూరం కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వకార్యక్రమాలు అమలవుతున్న విధానాన్ని, రేషన్ ద్వారా అందుతున్న సరుకుల్లోని నాణ్యతను తెలుసుకున్నారు. సన్నబియ్యం క్వాలిటి ఎలాగుందని అడిగారు. కాసేపు మాట్లాడిన తర్వాత బూరం కుటుంబసభ్యులతో కలిసి రేవంత్, మంత్రులు, చీఫ్ సెక్రటరీ సహపంక్తి భోజనంచేశారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, రు. 500 గ్యాస్ సిలిండర్ పథకం, మహిళలకు ఉచిత బస్సు పథకం ఎలాగుందని అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సుప్రయాణం(Free Bus) తమకు చాలా సౌకర్యంగా ఉందని బూరం భార్య తులసమ్మ చెప్పారు. గతంలో ఇచ్చిన దొడ్డుబియ్యాన్ని తాము తినలేకపోయేవారమని ఇపుడు సన్నబియ్యం చాలా బాగుంటున్నట్లు బూరదంపతులు చెప్పారు. భోజనంచేసిన తర్వాత బూర దంపతులకు రేవంత్ కొత్తబట్టలు పెట్టారు.