Revanth Reddy
x

పాత అప్పులు తీర్చటానికి కొత్త అప్పులు

రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం ప్రకారం రు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది.


తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తున్నదిదే. కేసీయార్ హయాంలో అందినకాడికి ఎక్కడెక్కడో అప్పులు చేసిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకనే తెలంగాణా రాష్ట్రం ఏర్పడేనాటికి ఆర్ధికంగా బలోపేతంగా ఉన్న రాష్ట్రం పదవిలో నుండి కేసీయార్ దిగిపోయేనాటికి అప్పులకుప్పగా మారిపోయింది. దేశంలోనే తెలంగాణా అత్యంత ధనిక రాష్ట్రమని కేసీయారే స్వయంగా ఎన్నోసార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది పోయిన ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం ప్రకారం రు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. అత్యంత ధనికరాష్ట్రానికి రు. 7 లక్షల కోట్లు అప్పులు ఎందుకున్నట్లు ?

ఎందుకంటే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులతో పాటు సంక్షేమపథకాల అమలుపేరుతో ఎక్కడెక్కడో అప్పులు చేసింది. డబ్బులు అవసరమై అధిక వడ్దీలకు అంగీకరించి అవకాశమున్న జాతీయ, ప్రైవేటు బ్యాంకులు, నాబార్డ్, ఆర్ధికసంస్ధల దగ్గర అప్పులు చేసింది. దాంతో అసలు, వడ్డీలంతా కలిసి లక్షల కోట్ల రూపాయలు అప్పు పెరిగిపోయింది. ఇపుడా అప్పులు తీరేమార్గం ఏమిటి ? లక్షల కోట్ల రూపాయల అప్పును తగ్గించటంతో పాటు కొత్త అప్పులు చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఇచ్చిన హామీల అమలుకు ఖజానాలో డబ్బులు లేవు. అందుకనే అప్పులుచేయక తప్పదు. అందుకనే అప్పులిచ్చే బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు ఏమున్నాయనే విషయమై రేవంత్ ప్రభుత్వం వెతుకులాట మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే అనేకమందితో ప్రభుత్వం తరపున చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి కోడ్ ఎత్తేసిన తర్వాత టాప్ ప్రాయరిటీలో బ్యాంకులు, ఆర్ధికసంస్ధలతో భేటీలు అయ్యేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు, వడ్డీలే కలిపి సుమారు రు. 90 వేల కోట్లు, మిషన్ భగీరథ కోసం చేసిన అప్పు, వడ్డీ కలిపి సుమారు 25 వేల కోట్ల రూపాయలుందట. ఇదే పద్దతిలో సంక్షేమపథకాలకు, ఇతరత్రా అభివృవృద్ధి పధకాల పేరుతో చాలాచోట్ల ప్రభుత్వం అప్పులు చేసింది. జాతీయబ్యాంకులు, నాబార్డ్ తో పాటు అనేక ఆర్ధికసంస్ధల దగ్గర అప్పులుచేసింది. ఆ అప్పులకు 7, 8 శాతం వడ్డీ కడుతోంది. అప్పులకోసం అధికవడ్డీలకు కేసీయార్ ప్రభుత్వం లక్షల కోట్లరూపాయలు అప్పులుచేసింది. ఈ విషయాలన్నింటినీ రేవంత్ ప్రభుత్వం రివ్యుచేసింది. అందుకనే తక్కువ వడ్డీకి అప్పులిచ్చే బ్యాంకులు, ఆర్ధికసంస్ధలతో చర్చలు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేటప్పటికి చాలా బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు ప్రభుత్వానికి అప్పులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి.

ఎక్కడైతే తక్కువ వడ్డీకి అప్పులు దొరుకుతుందో అక్కడే వీలైనంత అప్పుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ఏమిటంటే 3,4 శాతం వడ్డీకి అప్పులిచ్చేట్లుగా జాతీయ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఆర్ధికసంస్ధలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. మ్యాగ్జిమమ్ 3 శాతం వడ్డీకే అప్పు తీసుకుని అధికవడ్డీకి తెచ్చిన అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచన. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వంపై వేలకోట్ల ఆర్ధికభారం తగ్గుతుంది. గతంలో కేసీయార్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏడాదికి సుమారు 20 వేల కోట్ల రూపాయలు వడ్డీలే కడుతున్నది ప్రభుత్వం. వడ్డీ భారాన్ని తగ్గిచుకోవాలన్నది ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. అందుకనే తక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని పాత అప్పులు వీలైనంత తీర్చేయాలని డిసైడ్ అయ్యింది.

ఇదే విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘అధికవడ్డీకి అప్పులు చేయటం వల్లే ప్రభుత్వంపై ఆర్ధికభారం బాగా ఎక్కువైపోయింద’న్నారు. ఇపుడా భారాన్ని తగ్గించుకోవటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ‘ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత జాతీయ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఇతర ఆర్ధికసంస్ధలతో చర్చలు మొదలవుతాయ’న్నారు. ‘తక్కువ వడ్డీకి ఎవరైతే అప్పులిస్తారో వాళ్ళదగ్గర అప్పు తీసుకుని, ఆర్ధిక క్రమశిక్షణ పాటించటం ద్వారా పాత అప్పులభారాన్ని తగ్గించుకుంటామ’ని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

Read More
Next Story