ఓటుకు నోటు కేసులో రేవంత్ కు ఊరట
కేసు విచారణకు సంబందించి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటీషన్ ను సుప్రింకోర్టులోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాధ్ ధర్మాసనం కొట్టేసింది.
ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. కేసు విచారణకు సంబందించి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటీషన్ ను సుప్రింకోర్టులోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాధ్ ధర్మాసనం కొట్టేసింది. విషయం ఏమిటంటే ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి నిందితుడు అన్న విషయం తెలిసిందే. ఈ కేసు గడచిన తొమ్మిదేళ్ళుగా కోర్టు విచారణలో ఉంది. అప్పట్లో కేసులో ప్రధాన నిందితుడు అయిన రేవంత్ ఇపుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కేసును దర్యాప్తుచేసింది ఏసీబీ. ఈ పాయింట్లను ఆధారం చేసుకునే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు.
పిటీషన్లో ఆయన ఏమన్నారంటే నిందితుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశంలేదన్నారు. దర్యాప్తు సంస్ధ ఏసీబీ ప్రత్యక్షంగా రేవంత్ నాయకత్వంలోనే ఉందన్నారు. హోంశాఖ మంత్రిగా రేవంత్ బాద్యతలు చూస్తున్నారు కాబట్టి దర్యాప్తు సక్రమంగా జరుగుతుందన్న నమ్మకంలేదన్నారు. అందుకనే కేసు విచారణను వేరే రాష్ట్రంలోకి మార్చాలని కోరారు. తెలంగాణా హైకోర్టు విచారణ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల హైకోర్టులో విచారణ జరగాలని జగదీష్ తన పిటీషన్లో కోరారు. కేసును విచారణ జరిపిన సుప్రింకోర్టు జగదీష్ వేసిన పిటీషన్ను కొట్టేసింది.
కేసు విచారణలో కాని దర్యాప్తును ప్రభావితం చేస్తారని కూడా రేవంత్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేవలం అనుమానంతో మాత్రమే కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీచేయాలని అడగటంలో అర్ధంలేదని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. హోంశాఖను నిందితుడు నిర్వహిస్తున్నంత మాత్రాన కేసు దర్యాప్తులో రేవంత్ జోక్యం చేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని కోర్టు చెప్పింది. కేసు దర్యాప్తు సగం పూర్తియిన నేపధ్యంలో ఇతర రాష్ట్రాల హైకోర్టుకు బదిలీచేసినా పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పింది. కేసు విచారణ కోర్టులో జరుగుతున్నపుడు దర్యాప్తు సంస్ధను నిందితుడు ఏ విధంగా ప్రభావితం చేయగలరని పిటీషనర్ ను సుప్రింకోర్టు సూటిగా ప్రశ్నించింది. సుప్రింకోర్టు అడిగిన ప్రశ్నలకు పిటీషనర్ లాయర్ సమాధానాలు చెప్పలేకపోవటంతో కేసును కొట్టేసింది. అలాగే కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని రేవంత్ కు కేసు వివరాలను రేవంత్ కు రిపోర్టు చేయవద్దని ఏసీబీని ద్విసభ్య ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది.