చంద్రబాబును ఇరికించేసిన రేవంత్
x

చంద్రబాబును ఇరికించేసిన రేవంత్

ఒకేరకమైన వర్షాలు, వరద పరిస్ధితులు రెండుజిల్లాల్లోను నమోదైనా, కనిపించినా కృష్ణా జిల్లాలో జరిగిన నష్టం ఎంత ? ఖమ్మంలో జరిగిన నష్టమెంతో గ్రహించాలని చెప్పారు.


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడును రేవంత్ రెడ్డి ఇరికించేశారు. విషయం ఏమిటంటే భారీవర్షాల కారణంగా తెలుగురాష్ట్రాల జనాలు బాగా ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లోని జనాలు ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని జనాలు మాత్రం అల్లాడిపోతున్నారు. దాంతో ప్రథాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు పదేపదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూరంటు నానా గోలగోల చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యంవల్లే జనాలు ఇబ్బందులు పడుతున్నారని, జరిగిన ప్రాణనష్టానికి కారణం రేవంతే అని పదేపదే ఆరోపిస్తున్నారు. వరద హెచ్చరికలను కూడా ప్రభుత్వం జనాలకు తెలియజేయకపోవటం వల్లే భారీ నష్టాలు జరిగినట్లు ట్విట్టర్లో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. ఈ ఆరోపణల్లో భాగంగానే ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ తదితరుల విషయంలో పెద్ద గొడవ జరుగుతోంది.

సీన్ కట్ చేస్తే ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లోని జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ముఖ్యంగా కృష్ణాజిల్లా మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలోని జనాల జీవితం అస్తవ్యస్ధంగా తయారైంది. బుడమేరు వాగు విపరీతంగా పొంగి నగరంలోని చాలా ప్రాంతాలను ముంచేసింది. బుడమేరుకు రెండువైపులా విపరీతమైన ఆక్రమణలు జరగటంతో వరదనీరు నగరంలోకి వచ్చేసింది. దాంతో రాత్రికి రాత్రి ఫ్లాష్ ఫ్లడ్ దెబ్బకు దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోవటంతో పాటు వేలాదిమంది నిరాశ్రయులైపోయారు. విజయవాడ నగరంలోని చాలా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళు వరదదెబ్బకు కొట్టుకుపోవటంతో సర్వస్వం కోల్పోయి జనాలు రోడ్డునపడ్డారు. ముందస్తు హెచ్చరికలు చేయకుండానే, అప్రమత్తం చేయకుండానే బుడమేరు గేట్లు ఎత్తేసిన ఫలితమే తమ ప్రాంతాలన్నీ ముణిగిపోయాయని జనాలు ప్రభుత్వంపై మండిపోతున్నారు.

ఇక్కడే రేవంత్ తెలంగాణా, ఏపీ ప్రభుత్వాల మధ్య తేడాను మీడియాతో ప్రస్తావించారు. వరద హెచ్చరికలను తెలంగాణా ప్రభుత్వం జనాలకు చేయలేదని, అందుకనే భారీ నష్టాలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. భారీవర్షాల సూచనను, హెచ్చరికలను జనాలకు ఎప్పటికప్పుడు అందిస్తునే ఉన్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న ముందస్తుజాగ్రత్త చర్యల కారణంగానే నష్టం చాలావరకు తగ్గిందన్నారు. ఈ సందర్భంగానే ఖమ్మం, కృష్ణాజిల్లాల మధ్య పోలికను ప్రస్తావించారు. ఖమ్మం, కృష్ణాజిల్లా మధ్య చాలా దగ్గరిపోలికలున్నాయని చెప్పారు. ఖమ్మం, కృష్ణా జిల్లాలను అందరు కవలపిల్లలుగా అభివర్ణిస్తారన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు.

ఒకేరకమైన వర్షాలు, వరద పరిస్ధితులు రెండుజిల్లాల్లోను నమోదైనా, కనిపించినా కృష్ణా జిల్లాలో జరిగిన నష్టం ఎంత ? ఖమ్మంలో జరిగిన నష్టమెంతో జనాలు గ్రహించాలని చెప్పారు. రెండు జిల్లాల్లోను జరిగిన అన్నీ నష్టాలను జనాలు అంచనాలు వేయాలన్నారు. నష్టం జరగటం బాధాకరమే అయినా తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో పాటు జనాలను అప్రమత్తం చేయటంతో నష్టం చాలావరకు తగ్గిందన్నారు. తన ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పటంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని రేవంత్ జనాల ముందు దోషిగా నిలబెట్టేశారు. ముందస్తుగా జనాలకు హెచ్చరికలు చేయలేదని, బుడమేరు గేట్లను సడెన్ గా ఎత్తేయటంతోనే వరదనీరంతా నగరాన్ని ముంచెత్తేసిందనే ఆరోపణలకు రేవంత్ పోలిక దన్నుగా నిలుస్తోంది.

చంద్రబాబుకు ఎంతో సన్నిహితుడైన రేవంత్ ఏపీ ప్రభుత్వం పనితీరును, తెలంగాణా ప్రభుత్వం పనితీరును భేరీజు వేయాలని జనాలకు విజ్ఞప్తి చేసి చంద్రబాబు పనితీరును ఎండగట్టినట్లయిపోయింది. తనను తాను రక్షించుకోవటానికో లేకపోతే బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టడానికో అసంకల్పితంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని దోషిగా రేవంత్ చిత్రీకరించారు

Read More
Next Story