రేవంత్ కీలక నిర్ణయం
x

రేవంత్ కీలక నిర్ణయం

ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలుజరుగుతున్నాయన్న విషయాన్ని రేవంత్ డైరెక్టుగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు


అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా రేవంత్ రెడ్డి తొందరలోనే జిల్లాల్లో పర్యటించాలనే కీలకనిర్ణయం తీసుకున్నారు. మార్చిలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత జిల్లాల్లో పర్యటించబోతున్నారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలుజరుగుతున్నాయన్న విషయాన్ని రేవంత్ డైరెక్టుగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. జిల్లాలస్ధాయిలో పరిపాలన పెద్దగా జోరందుకోవటంలేదన్న అసంతృప్తి రేవంత్(Revanth) లో బలంగా ఉంది. ఇందులో భాగంగానే చాలామంది కలెక్టర్లు పీల్డు విజిట్లకు వెళ్ళటంలేదని బహిరంగంగా కామెంట్ చేసింది. నాలుగుగోడల మధ్య కూర్చుని ఫైళ్ళపై సంతకాలు పెట్టడానికి మాత్రమే చాలామంది కలెక్టర్లు అలవాటు పడిపోయినట్లు రేవంత్ తన అసంతృప్తిని వ్యక్తంచేశారు.

కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేస్తేకాని సమస్యలు బయటపడవని, తరచూ జనాలను కలిసినపుడే అసలైన సమస్యలు, వాటి పరిష్కారాలు కలెక్టర్ల దృష్టికి వస్తాయన్నది రేవంత్ అభిప్రాయం. కలెక్టర్లు కచ్చితంగ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే అని రేవంత్ ఆదేశించారు. నిజానికి కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశించిన రేవంత్ తాను ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. జిల్లాల్లో పర్యటించాలని చాలాకాలం క్రితమే అనుకున్నా పరిస్ధితులు అనుకూలించటంలేదు. అందుకనే తొందరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోగానే జిల్లాల్లో పర్యటించాల(Districts visits)ని డిసైడ్ అయ్యారు. తాను జిల్లాల్లో తిరిగినపుడు తనతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలే కాకుండి కలెక్టర్లు కూడా తిరగాల్సుంటుంది. అప్పుడు అధికారయంత్రాంగమంతా తప్పకుండా ఫీల్డులోనే తిరుగుతారనటంలో సందేహంలేదు.

జిల్లాల పర్యటనలోనే వివిధశాఖల జిల్లాల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని కూడా అనుకున్నారు. అప్పుడే పథకాలు, కార్యక్రమాల అమలులోని లోపాలు బయటపడతాయన్నది రేవంత్ ఆలోచన. పథకాల లబ్దిదారులుతోనే కాకుండా పథకాలు అందనివారితో కూడా ముఖాముఖి మాట్లాడినపుడే పథకాల అమలులో వాస్తవ లోపాలు బయటపడతాయి. ప్రతిజిల్లాలోను రెండురోజులు పర్యటించాలన్నది రేవంత్ ఆలోచన. మొదటిరోజు జిల్లాస్ధాయి అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష చేయాలని అనుకుంటున్నారు. రెండోరోజు పార్టీలోని ప్రజాప్రతినిధులతో సమావేశం ఉండబోతోంది. పనిలోపనిగా ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలని అనుకున్నారు.

ఇప్పటివరకు ఏదైనా పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవానికి మాత్రమే రేవంత్ జిల్లాల్లో తిరుగుతున్నారు. బడ్జెట్ సమవేశాల తర్వాత ప్రత్యేకించి జిల్లాల్లో పర్యటించటమే లక్ష్యంగా పర్యటనలను రూపొందించుకుంటున్నారు. తన రెండురోజుల పర్యటనలో అవకాశముంటే ఏదైనా ఒక గ్రామంలో గ్రామసభ లేదా ఆకస్మిక పర్యటన చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. మార్చినెల 1వ తేదీనుండి 5వ తేదీవరకు ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. ఐదురోజుల సమావేశాలు ఎందుకంటే కులగణన రిపోర్టు, రెండోది ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంకోసం. కులగణన రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో బీసీలకు స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని అసెంబ్లీలో తీర్మానంచేసి పార్లమెంటుకు పంపాలని రేవంత్ అనుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) నిర్వహించి కులగణన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేయబోతున్నారు. ఇక రెండోది ఎస్సీవర్గీకరణకు చట్టబద్దత కల్పించాలంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తీర్మానాన్ని గవర్నర్ కు పంపి ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే చట్టంగా మారుతుంది. అందుకనే ఈ రెండు కీలకమైన అంశాల కోసమే ప్రత్యేక సమవేశాలు ఏర్పాటుచేయబోతున్నారు.

ప్రత్యేక సమవేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మూడోవారంలో బడ్జెట్ సమావేశాలు పదిరోజులు లేదా 15 రోజులు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాతే జిల్లాల పర్యటనకు రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆలోగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళు, కొత్తరేషన్ కార్డుల పంపిణీ, రైతుభరోసా కార్యక్రమాలను పూర్తిచేయాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల పర్యటనలో హిడెన్ అజెండా కూడా ఉంది. అదేమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించటం. పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను పక్కాగా అమలుచేయటం ద్వారా స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీకి గట్టిపునాది వేయాలన్నది రేవంత్ హిడెన్ అజెండా. తొందరలోనే జరగబోయే స్ధానికఎన్నికల్లో(Local body elections) బీఆర్ఎస్(BRS) ను దెబ్బకొట్టకపోతే పార్టీతో పాటు వ్యక్తిగతంగా రేవంత్ కు కూడా నష్టమే.

ఎలాగంటే దెబ్బతిన్న పార్టీ ఇమేజి, కేసీఆర్ ఇమేజీని స్ధానికసంస్ధల ఎన్నికల్లో తిరిగి పెంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) గట్టిపట్టుదలతో ఉన్నారు. అందుకనే స్ధానికఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ ఆఫీసులో తరచూ జిల్లాల నేతలు, క్యాడర్ తో కేటీఆర్ సమవేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు టైంటేబుల్ వేసుకున్నట్లుగా కేటీఆర్, హరీష్ రావు(Harish Rao), కవిత(Kavitha)లు రేవంత్ ప్రభుత్వంపై ఏదో ఒక అంశంపై ఆరోపణలు చేస్తు తరచూ మీడియాలో ఉండటం ఇందులో భాగమే. రేవంత్ ప్రభుత్వ ఇమేజీని దెబ్బతీయటం ద్వారా బీఆర్ఎస్ ను పుంజుకునేలా చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ విషయం గ్రహించలేనంత అమాయకుడు కాదు రేవంత్. అందుకనే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా ఎంతవీలైతే అంత బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకనే ముందుగా జిల్లాల పర్యటనలు పెట్టకున్నది. మరి రేవంత్ వ్యూహం ఎంతవరకు వర్కవటవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story