ఏపీలో మళ్ళీ మొదలైన పథకాల పేర్ల మార్పు: ఐదేళ్ళకొకసారి తప్పదా?
x

ఏపీలో మళ్ళీ మొదలైన పథకాల పేర్ల మార్పు: ఐదేళ్ళకొకసారి తప్పదా?

ఏపీలో పథకాల పేర్ల మార్పు ప్రహసనం మొదలయింది. ప్రజాసంఘాలు దీనిపై మండిపడుతున్నాయి.


ఏపీ ప్రజలకు ప్రతి ఐదేళ్ళకూ ఈ పథకాల పేర్ల మార్పు తతంగం తప్పేటట్లులేదు. కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ కూటమి, వృద్ధులకు పింఛన్లు అందజేసే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. ఇంకో రెండు పథకాల పేర్లను కూడా మార్చేసింది.

2019 కు ముందు వృద్ధాప్య పింఛన్ పథకం పేరు ఎన్టీఆర్ భరోసాగానే ఉండేది. 2019 ఎన్నికల్లో గద్దెనెక్కిన జగన్, ఈ పథకం పేరును వైఎస్ఆర్ పింఛన్ కానుకగా మార్చారు. ఇది ఒక్కటే కాదు, ఎన్టీఆర్ వైద్యసేవలను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు. అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మొదట రాజీవ్ గాంధి పేరు పెట్టారు. చంద్రబాబు మొదలుపెట్టిన అన్న క్యాంటిన్లకు జగన్ రాజన్న క్యాంటిన్లుగా పేరు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే పథకాన్ని వైఎస్ఆర్ చేయూత పథకంగా మార్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో వీటన్నింటి పథకాల పేర్లు మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి.

జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన మరో రెండు ముఖ్యమైన పథకాలకు కూడా పేర్లు మార్చారు. జగనన్న విద్యాకానుక పేరును స్టూడెంట్ కిట్‌గా మార్చారు. ఈ మేరకు ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా విడుదలయ్యాయి. ఈ పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్లకు రెండు జతల స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, డిక్షనరీ, స్కూల్ బ్యాగ్ ఇస్తారు. ఇక పేద విద్యార్థులకోసం జగన్ ప్రవేశపెట్టిన మరో పథకం జగనన్న గోరుముద్ద పేరును కూడా కూటమి ప్రభుత్వం పేరు మార్చింది. పీఎమ్ పోషణ్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే విద్యాదీవెన, వైఎస్ఆర్ చేయూత పథకాల పేర్లు కూడా మారనున్నాయి.

ఈ పథకాలకు గతంలో గాంధీ, నెహ్రూ, ఇందిర వంటి పేర్లు మాత్రమే ఉండేవి. 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఈ పేర్లలో తనదైన ముద్రను వేశారు. తెలుగుభాషపై తన అభిమానాన్ని చాటుకుంటూ పలు పథకాలకు ఆయన గ్రాంథిక భాషలో పేర్లు పెట్టేవారు. ఆర్టీసీ బస్టాండ్‌లకు ప్రయాణ ప్రాంగణము అని, ప్రభుత్వ సారాయి దుకాణాలకు వారుణి వాహిని అని… ఇలా సాగిపోయేవి ఆయన పథకాల పేర్లు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తనపై ఉన్న వెన్నుపోటు ముద్రను పోగొట్టుకోవటంకోసం అనేక పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ఎన్టీఆర్ పేరు ఉన్న చాలా పథకాలకు పేర్లు మార్చి రాజీవ్ గాంధి, ఇందిరాగాంధి, నెహ్రూ పేర్లు పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరో అడుగు ముందుకేసి కొన్ని పథకాలకు చంద్రన్న పేరుతో తన పేరే పెట్టుకున్నారు.

జగన్ ఈ పేర్ల తతంగాన్ని పీక్స్‌కు చేర్చారు. తన పేరుతో, తన తండ్రి పేరుతో దాదాపు 20 చిన్నా, పెద్దా పథకాలు పెట్టారు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పేర్లతో.

పథకాల మార్పులో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్‌గా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును చెప్పవచ్చు. ఆ విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. అయినా దానిని జగన్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మార్చే పేర్లలో ఇదే మొదటి స్థానంలో ఉండబోతోంది. త్వరలో ఆ విశ్వవిద్యాలయం పేరు మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారబోతోంది.

ఈ పేర్ల మార్పిడిపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఐదేళ్ళకొకసారి ఈ మార్చుడు ఏమిటి అని దుయ్యబడుతున్నారు. అసలు బ్రతికిఉన్న నేతల పేర్లను పథకాలకు పెట్టగూడదని, ఆ పేర్లను తీసివేసి అమరులైన మహనీయుల పేర్లను పెట్టాలని జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు.

Read More
Next Story