
పెన్షన్లు తొలగించడం దారుణం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో దీని మీద గురువారం చర్చ జరిగింది.
సామాజిక భద్రతా పెన్షన్‌ల తొలగింపు వ్యవహారం గురువారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో దుమారం రేపింది. ప్రశ్నోత్తరాల సమయంలో దీని మీద చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం కావాలనే పెన్షన్‌లను తొలగిసోదని ప్రతిపక్షం ఆరోపించగా, గత ప్రభుత్వం హయాంలోనే తొలగింపులు ఎక్కువుగా చేశారని అధికార పక్షం ప్రతిపక్షాన్ని నిలువరించే ప్రయత్నం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024, జూన్ నాటికి, నేటి వరకు సామాజిక భద్రతా పెన్షన్‌ల లబ్ధిదారుల వివరాలు చెప్పాలని ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రాజగొల్ల రమేష్ యాదవ్, డాక్టర మొండితోక అరుణ్‌కుమార్‌లు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు. జూన్ 2024 నుంచి తొలగించిన సామాజిక భద్రతా పెన్షన్‌ల సంఖ్య ఎంత? అందుకు గల కారణాలు ఏమి? జూన్ 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న కొత్త దరఖాస్తుల సంఖ్య ఎంత? అంటూ ప్రశ్నించారు. వీటికి ఎంఎస్‌ఎంఇ, సెర్ప్ శాఖ మంత్రి సమాధానాలు చెప్పాలని ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు.
కూటమి ప్రభుత్వం అనేక రకాల కారణాలతో పెన్షన్లను తొలగించడం బాధాకరమని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కూటమికి ఓటు వేయలేదని కారణంతో పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పెన్షన్లు తొలగించారని, రకరకాల కారణాలు చెప్పి దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ పేదలకు పెన్షన్లు ఇస్తే.. కూటమి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికి మరీ వారికి పెన్షన్లు తొలగిస్తున్నారని ఇది దారుణమని అన్నారు. లక్షలు, కోట్లు దోచుకుంటున్న వారిని వదిలేసి పేదల మీద కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపించడం దారుణమని తోట త్రిమూర్తులు అన్నారు.
మరో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. రెండు లక్షల పెన్షన్లు తొలిగించి రికార్డుల్లో 14,965 మాత్రమే తొలగించామని ప్రభుత్వం చెబుతోందని, కేవలం కూటమికి ఓటు వేయలేదనే కారణంతో పెన్షన్లు తొలగిస్తున్నట్లు ఆరోపించారు.
ఇదే అంశం మీద మరో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏ ప్రాతిపదిక మీద పెన్షన్లు కూటమి ప్రభుత్వం పెన్షన్లు తొలగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఆరు అంశాల మీద పెన్షన్లు వెరిఫై చేసేవారని, కానీ కూటమి ప్రభుత్వం 13 అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలన చేస్తున్నారని, పెన్షన్ల తొలగింపులో దివ్యాంగులకు 15 రోజుల్లో సదరన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఇబ్బందులు పెడుతున్నారని, సదరన్ సర్టిఫికేషన్ స్లాట్ దొరకడానికే నెల రోజులు సమయం పడుతుందని వెల్లడించారు. ఏ ప్రాతిపదికన డప్పు కళాకారుల పెన్షన్లు తొలగించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అడ్రస్ మారితే పెన్షన్‌లను కనికరం లేకుండా తొలగించేస్తున్నారని, పెన్షన్‌ల తొలగింపులో మానవీయ కోణంతో ఆలోచనలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం చెప్పారు. 2024 జూన్ నాటికి 65లక్షల 18,496 సామాజిక పెన్షన్లు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతం 63లక్షల 59వేల 907 సామాజిక పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 14,965 పెన్షన్లు తొలగించామన్నారు.
Next Story