
ఏపీ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్‌పై వయసు పరిమితి ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ (CCL)పై పిల్లల 18 సంవత్సరాల వయసు పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ జీవో నం.70 జారీ చేసింది.
చైల్డ్ కేర్ లీవ్ విషయంలో ఏపీ ప్రభుత్వం చొరవ చూపి జీవో 70 ద్వారా ఉద్యోగులకు ఎంతో మేలు చేసింది. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది మహిళా ఉద్యోగులు తమ సర్వీసు కాలం మొత్తంలో ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లకు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ జేఏసీ మహిళా విభాగం నాయకులు పారే లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మిలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు ప్రకటించారు. భారతదేశంలో ఈ విధమైన వయసు నిబంధనను ఎత్తివేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని వారు అభినందించారు.
విజయవాడ వెస్ట్ తహశీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి అనందాన్ని పంచుకున్నారు.
జీవో లో ఏముంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులు, ఒంటరి పురుష ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ (CCL) సౌకర్యాన్ని మరింత ఉపశమనకరంగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఉన్నత వయోపరిమితిని పూర్తిగా తొలగించడం ద్వారా ఈ సౌకర్యాన్ని సర్వీసు కాలం మొత్తంలో ఎప్పుడైనా అందుబాటులోకి తెచ్చింది.
ఫైనాన్స్ (హెచ్‌ఆర్-IV-ఎఫ్‌ఆర్ & ఎల్‌ఆర్) డిపార్ట్‌మెంట్ జారీ చేసిన జీవో ఎంఎస్ నం. 70, తేదీ 15.12.2025 ప్రకారం గతంలో ఉన్న పిల్లల ఉన్నత వయోపరిమితిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇకపై మహిళా ఉద్యోగులు తమ సర్వీసు కాలం మొత్తంలో రిటైర్‌మెంట్ సమయంలో కూడా చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు. ఇది పిల్లల పెంపకం, పాఠశాల లేదా కాలేజీ పరీక్షలు, అనారోగ్యం వంటి అవసరాలకు ఉపయోగపడుతుంది.
అదనంగా ఒంటరి పురుష ఉద్యోగులు (అవివాహితులు / విధవరులు / విడాకులు తీసుకున్నవారు) కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ నిర్ణయం గత జీవోల్లో పేర్కొన్న ఇతర అర్హత పరిస్థితులకు లోబడి అమలవుతుంది.
ప్రభుత్వం గతంలో జీవో ఎంఎస్ నం.132 (2016), నం.33 (2022), నం.199 (2022), నం.36 (సర్వీస్ వెల్ఫేర్, 2024)ల ద్వారా చైల్డ్ కేర్ లీవ్‌ను క్రమంగా మెరుగు పరచడం గమనార్హం. ఈ తాజా ఉత్తర్వులతో వేలాది మంది మహిళా ఉద్యోగులకు గొప్ప ఉపశమనం లభించనుంది.

