
రైతులకు రేపట్నుంచే పట్టాదారు పాస్ పుస్తకాలు!
నూతన సంవత్సరం సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ తన తొలి సంతకం చేశారు.
రాష్ట్రంలోని భూ యజమానులు, రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ తన తొలి సంతకం చేశారు.
ప్రైవేట్ భూములకు పూర్తి విముక్తి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేట్ పట్టా భూములను నిషిద్ధ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు స్పష్టం చేశారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే, అధికారులు వేచి చూడకుండా సుమోటోగా (నేరుగా) స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.
సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల భూములపై స్పష్టత
దేశం కోసం సేవలందించిన మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధుల భూముల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్న పక్షంలో వారి భూములను తక్షణమే 22ఏ జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
మిగిలిన 4 రకాలపై త్వరలో నిర్ణయం
మొత్తం తొమ్మిది రకాల భూములకు సంబంధించి మార్పులు చేయాలని ప్రభుత్వం భావించగా, ప్రస్తుతానికి 5 రకాలను క్లియర్ చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలోనే 'మంత్రుల బృందం' (GoM) చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. రైతులు, భూ యజమానుల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభించనున్నాయని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Next Story

