
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు
ఎంపీ మిధున్ రెడ్డితో సహా 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా వున్న 12 మందికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో సిట్ అధికారులు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. దాంతో ఈ కేసులో 12 మంది నిందితులకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ, ఏసీబీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో 12 మంది నిందితులను వివిధ జైళ్లకు పోలీసులు తరలించారు.ఈ కేసులో వైసీపీ ఎంపీ పి. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మిగిలిన 9 మంది నిందితులను విజయవాడ జైలుకు,అలాగే మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు తరలించారు.
మరోవైపు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. నిందితులు అందరికీ ఛార్జ్ షీట్ కాపీలు అందజేశారా? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.కోర్టుకు దాఖలు చేసిన డాక్యుమెంట్లకు సరైన క్రమ సంఖ్యలు లేవని, వాటిని సరిచేసి మళ్లీ అందించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
300 మందిలో ఒక్కరు కూడా నాకు తెలియదు-కసిరెడ్డి
ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజ్ కసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మద్యం కుంభకోణంలో సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ తనకు తెలియదన్నారు. ఈ 300 మందిలో ఒక ఐదుగురిని విచారించి,వారికి తాను తెలుసేమో మీరే అడగండని తెలిపారు. ఈ కేసులో చాలా మంది పేర్లు తాను తొలిసారిగా వింటున్నానని రాజ్ కసిరెడ్డి తెలిపారు.తనపై నమోదైన కేసును ఆయన తప్పుపట్టారు.కస్టోడియల్ విచారణ అని సిట్ తనను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర ఏమీ లేదన్నారు. తన తప్పు ఎక్కడా లేక పోయినా ఆధారాలు సృష్టించారని రాజ్ కసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఒక్క లిక్కర్ కేసులో తప్పించి ఇప్పటి వరకు తాను ఏ కేసులోనూ అరెస్ట్ కాలేదన్నారు.ఇప్పటి వరకు తనపై ఒక్క కేసు కూడా లేదన్న సంగతి గుర్తించాలన్నారు.హైదరాబాద్, శంషాబాద్‌లోని విల్లాలో లభ్యమైన కోట్ల రూపాయలు తనవైతే,వాటిపై తన వేలి ముద్రలు ఉంటాయని వివరించారు. అయినా అంత సొమ్ము ఒకే వ్యక్తి వద్ద ఉంటుందా? అంటూ ప్రశ్నించారు.ఇలావుంటే మద్యం కుంభకోణంలో కీలక ఆధారాలు లభ్యం కావడంతో రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.
Next Story