మతం, రాజకీయాలు.. జస్ట్ ఆస్కింగ్ : ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్
ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ మతం, రాజకీయాలపై ట్వీట్టర్‌లో మరో సారి సంచలన కామెంట్స్ చేశారు.
మతం, రాజకీయాలను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ బుధవారం కొన్ని సూక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సమకాలీన అంశాలపై ప్రకాష్‌రాజ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. అయితే గాంధీ జయంతిని పురస్కరించుకొని మరో సారి మతం, రాజకీయాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై మొదలైన ప్రకాష్ రాజ్ పోస్టు పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా తాజాగా మతం, రాజకీయాలను ఉద్దేశించి ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఈ రోజు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కూడా. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతులను పురస్కరించుకొని వారి సూక్తులు, సందేశాలను నెటిజన్లతో ప్రకాష్‌రాజ్ పంచుకున్నారు. ‘ఒక వేళ నువ్వు మైనారిలో భాగమైనప్పటికీ.. నిజం ఎప్పటికీ నిజమే’. అనే మహాత్మా గాంధీ సూక్తిని, ‘దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకున్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి లగడం లేదు. ఇదే మనకు, పాకిస్తాన్‌కున్న వ్యత్యాసం’. అనే లాల్ బహుదూర్ శాస్త్రి సందేశాలను ఆయన ట్వీటర్‌లో పంచుకున్నారు.
అందరికీ గాంధీ జయంతి, లాల్ బహుదూర్‌శాస్త్రి జయంతిల శుభాకాంక్షలు చెప్పారు. ఇకనైనా ఈ వాస్తవాలను బలంగా అర్థం చేసుకోవాలి. అని ప్రకాష్‌రాజ్ తన పోస్టులో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ప్రకాష్‌రాజ్ ఇప్పటికే పలు మార్లు జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్టులు పెట్టారు. జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. విచారించి దోషులపై చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు అనవసర భయాలను కల్పించి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెడుతున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మత పరమైన ఉద్రిక్తతలు చాలు(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు, జస్ట్ ఆస్కింగ్) అంటూ పెట్టిన పోస్టు తొలుత వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సున్నిత అంశాలపై ప్రకాష్‌రాజ్ తెలుసుకొని మాట్లాడాలని సమాధానం చెప్పారు.