ఉద్యమంతోనే గ్రంథాలయాల పునర్వికాసం!
x
వేదికపై ఏపీ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ప్రతినిధులు

ఉద్యమంతోనే గ్రంథాలయాల పునర్వికాసం!

గ్రంథాలయాల దుస్థితిపై శనివారం విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక మేధా మథనం పేరిట చర్చా గోష్ఠి నిర్వహించింది.

దేశంలో హిందీ తర్వాత స్థానంలో ఉన్న తెలుగులో పుస్తకాల ప్రచురణ తగ్గిపోతోందని, ముద్రణా సంస్థలు కూడా మూతపడుతున్నాయని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్, యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక మేధా మథనం’ పేరిట విశాఖ పౌర గ్రంథాలయంలో చర్చా గోష్ఠిని నిర్వహించింది. దీనికి అధ్యక్షత వహించిన చలం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగులో పుస్తక ముద్రణలు తగ్గిపోయాయన్నారు.‘‘కేరళలో గ్రంథాలయాల నిర్వహణ మెరుగ్గా ఉంది. కానీ మన రాష్ట్రంలో వెనకబాటు బాగా ఉంది. ఇందుకు ప్రభుత్వ లోపమొక్కటే కాదు.. మన వైఫల్యమూ ఉంది. గ్రంథాలయాల పునర్వికాసానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకు ప్రజలను సమాయత్తం చేయాలి. గ్రంథాలయాల అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం. ప్రజల నుంచి గ్రంథాలయ సెస్‌ వసూలు చేస్తున్నా లైబ్రరీలకు ఆ నిధులు విడుదల చేయడం లేదు. గ్రంథాలయాలు ప్రభుత్వ ఆదరణ లేక దీనావస్థలో ఉండడం వల్ల విజ్జులు వాటిని చూస్తూ ఊరుకుంటే తెలుగు జాతి జ్ఞాన దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది’ అని చలం పేర్కొన్నారు.


చర్చా వేదికలో పాల్గొన్న ప్రతినిధులు

గ్రంథాలయాల వెనకబాటు సమాజానికి నష్టం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్‌ వల్లూరి శివప్రసాద్‌ మాట్లాడుతూ ‘గ్రంథాలయాలు స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. ఆ సమయంలో ప్రజలను చైతన్య పర్చడానికే గ్రంథాలయ ఉద్యమం ఉద్భవించింది. గ్రంథాలయాల వెనకబాటుతో సమాజానికి నష్టమే. నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిర్లక్ష్యం గ్రంథాలయాల దుస్థితికి కారణం. గ్రంథాలయాల జీర్ణావస్థపై తాత్కాలికంగా కాక నిత్య పోరాటం చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు, మాజీ వీసీ రొక్కం సుదర్శన్‌ మాట్లాడుతూ ‘రానురాను గ్రంథాలయాల్లో పుస్తక పఠనం తగ్గిపోతోంది. పుస్తక ప్రచురణలతో పాటు నాణ్యత కూడా దిగజారుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. ఆర్థిక వనరులు లేక గ్రంథాలయాల పురోగతి ఆగిపోయింది. పుస్తకాలు కొనే శక్తి లేని వారికి లైబ్రరీలు ఎంతో ఉపయోగకరం. గ్రంథాలయాలకు జీవీఎంసీ రూ.117 కోట్ల బకాయి ఉంది. 2024–25 సంవత్సరానికి రూ.25 కోట్లు చెల్లించాలి. కే ంద్ర, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌పై ఒత్తిడి తెస్తే గ్రంథాలయాలకు ప్రత్యేక గ్రాంట్‌ విడుదలకు వీలుంటుంది. వీటికి ప్రభుత్వం ఇస్తున్న అరకొర నిధులు కూడా సకాలంలో సద్వినియోగం కాని దుస్థితి ఉంది’ అని వివరించారు.
విశాఖ నుంచే ఉద్యమం మొదలు కావాలి..
మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు స్టేట్‌ లైబ్రరీ లేకుండా పోయిందన్నారు. లైబ్రరీలను చంపేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ‘ప్రభుత్వానికి లైబ్రరీ సెస్‌ చెల్లించే ప్రజలకు వాటిని పొందే హక్కుంది. గ్రంథాలయాల పునర్వికాసం కోరుతూ వార్డుల్లో తోపుడు బళ్లపై యాత్ర చేపట్టాలి. లైబ్రరీలపై ఉద్యమం విశాఖ నుంచే మొదలు కావాలి’ అని పిలుపునిచ్చారు. రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి మాట్లాడుతూ ‘గ్రంథాలయాలకు ప్రభుత్వ సపోర్టు లేకపోవడం, మన ప్రజాప్రతినిధుల్లో పలువురు విద్యావంతులు కాకపోవడం, లైబ్రరీల పునర్వికాసానికి ఉద్యమించాల్సి రావడం దురదృష్టకరం. ప్రతి కార్పొరేట్‌ కాలేజీలోనూ విధిగా లైబ్రరీ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిపై ప్రతి మూడు నెలలకోసారి జిల్లా స్థాయి అధికారులు సమీక్ష చేయాలి. గ్రంధాలయాల పూర్వ వైభవం కోసం విశాఖలో బీచ్‌ వాక్‌ చేపట్టాలి’ అని కోరారు.
రూ.కోట్ల నిధులెక్కడికి వెళ్తున్నాయి?
దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ ఫౌండర్‌ వీసీ ప్రొఫెసర్‌ వై.సత్యనారాయణ మాట్లాడుతూ ‘ప్రభుత్వం గ్రంథాలయాలపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతుందో అర్థం కావడం లేదు. గ్రంథాలయాలు కనుమరుగు కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సాంకేతికత ఎంతగా పురోగతి సాధిస్తున్నా.. లైబ్రరీల్లో పుస్తకాలు చదువుతున్న వారున్నారు. కోట్లాది రూపాయల లైబ్రరీ సెస్‌ నిధులు ఎక్కడికెళ్తున్నాయి?’ అని ప్రశ్నించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పూర్వ వీసీ లజపతిరాయ్‌ మాట్లాడుతూ ‘పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలవాటు చేయాలి’ అని కోరారు. ఇంకా ఈ చర్చా గోష్ఠిలో ప్రొఫెసర్‌ ధనరాజ్, సాహితీవ్తేలు మేడా మస్తాన్‌రెడ్డి, నల్లి ధర్మారావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, విశాఖ సంస్కృతి సంపాదకుడు శిరేల సన్యాసిరావు, సమాజ హిత వారపత్రిక ఎడిటర్‌ కేవీఎస్‌ నరసింహం, పౌర గ్రంథాలయ సేవాసమితి అధ్యక్షుడు బీఎల్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story