యునెస్కో వారసత్వ జాబితాలో ఎర్రమట్టి దిబ్బలు!
x
విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు

యునెస్కో వారసత్వ జాబితాలో ఎర్రమట్టి దిబ్బలు!

విశాఖ తీరప్రాంతంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఎర్రమట్టి దిబ్బలకు అరుదైన యునెస్కో సహజ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది.

ఎర్రమట్టి దిబ్బలు.. విశాఖపట్నం సాగరతీరంలో భీమిలికి సమీపంలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే అత్యంత అరుదైన కొండలు. దక్షిణాసియాలో ఇలాంటివి మరో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి తమిళనాడులోని పేరి వద్ద, రెండోది శ్రీలంకలోనూ కనిపిస్తాయి. అయితే పేరి వద్ద ఉన్నవి జనావాసానికి దూరంగా ఉండడం వల్ల అంతగా ఆదరణకు నోచుకోలేదు. శ్రీలంకలో ఉన్న వాటికి మాత్రం పర్యాటకులు వెళ్తుంటారు. సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. ఇక విశాఖ నుంచి భీమిలి వెళ్లే మార్గంలో వైజాగ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఎర్రమట్టి దిబ్బలు సముద్రానికి ఆనుకునే ఉన్నాయి. ఈ ఎర్రమట్టి దిబ్బలు 1500 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంటాయి.


విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు

ఒకపక్క సముద్రం, మరోపక్క ఎర్రమట్టి దిబ్బల మధ్య నుంచి రోడ్డు వెళ్తుంది. రోడ్డు దిగి ఈ దిబ్బల్లోకి వెళ్తే మరో ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. ఇసుక, ఎర్రటి మట్టి కలిసిన చిన్న చిన్న కొండలను తలపించేలా ఉంటాయి. నేలంతా ఇసుక పరచినట్టు అగుపిస్తుంది. జీడిమామిడి, సరుగుడు, ఇతర చెట్లతో ఈ ఎర్రటి కొండలు నడుమ పచ్చగా కనువిందు చేస్తుంటాయి. ఈ దిబ్బల మధ్య సందులు, పాయలూ ఉంటాయి. అందులోకి వెళ్తే ఎటు వెళ్లామో? ఎటు వైపు నుంచి వచ్చామో తెలియనంత అయోమయానికి గురవుతారు. ఈ ఎర్రమట్టి దిబ్బల్లోకి ప్రవేశించిన వారికి సముద్రం నుంచి వీచే చల్లగాలులు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఎర్రమట్టి దిబ్బల అందాలను చూడడానికి సాగరం ముందుకు దూసుకు రాకుండా మధ్యలో భీమిలి రోడ్డు నిర్మించారా? అనిపిస్తుంది. అందుకే వైజాగ్‌ పర్యటనకు వచ్చిన వారు ఈ ఎర్రమట్టి దిబ్బలను సందర్శించకుండా వెళ్లలేరు. అలా వెళ్తే తమ పర్యటన అసంపూర్తిగా ముగిసినట్టు ఫీలవుతారు. ఏటా లక్షల సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తుంటారు. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో వీటిని కూడా చేర్చారు. విశాఖకు ప్రకృతి ప్రసాదించిన వరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలది ఓ ప్రత్యేక స్థానం.


ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసంపై పరిశీలనకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ (ఫైల్‌)

ఎర్రమట్టి దిబ్బలు 18,500 ఏళ్ల క్రితం నాటివి..

ఎర్రమట్టి దిబ్బలు 18,500 ఏళ్ల క్రితం విశాఖ సాగరతీరంలో ఏర్పడినట్టు చరిత్ర చెబుతోంది. 1886లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన డాక్టర్‌ విలియం కింగ్‌ మొట్టమొదటి సారిగా గుర్తించి నమోదు చేశారు. పురాతన సముద్ర మట్ట మార్పులు, వాతావరణ మార్పులు, కోత తదితర పరిణామాల ఫలితంగా ఇవి ఏర్పడ్డాయని నిపుణులు తమ పరిశోధనల్లో తేల్చారు. ఈ ప్రదేశం పురాతన శిలాయుగం, మధ్య శిలాయుగం, నియోలిథిక్‌ యుగాల ఆధారాలతో పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఎర్రమట్టి దిబ్బలు ఇసుక, సిల్ట్, బంకమట్టి మిశ్రమంతో మెరిసిపోతూ ఉంటాయి. వేల సంవత్సరాల పాటు ఇనుము సహజ ఆక్సీకరణ ఫలితంగా వాటికి ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఏర్పడిందని పరిశోధకులు గుర్తించారు.

ఎర్రమట్టి దిబ్బల్లో లేఅవుట్‌ వేసిన హౌసింగ్‌ సొసైటీ

యునెస్కో సహజ వారసత్వ సంపద జాబితాలో..
ఇప్పటికే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ఈ ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా అధికారికంగా ప్రకటించింది. తాజాగా యునెస్కో ప్రపంచ సహజ వారసత్వ సంపదగా (నేచురల్‌ హెరిటేజ్‌ సైట్‌) టెంటేటివ్‌ లిస్టులో చేర్చింది. ఈ సహజ వారసత్వ సంపదను కాపాడి మహత్తర గౌరవం సా«ధన కోసం భారత ప్రభుత్వ ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ, ఆయన సతీమణి రాణిశర్మ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తిమ్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు కొన్నాళ్లుగా కృషి చేస్తున్నారు.

బొలిశెట్టి సత్యనారాయణ

అత్యంత అరుదైన ఖ్యాతి ఇది : బొలిశెట్టి..
‘ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రమట్టి దిబ్బలతో పాటు, తిరుపతి శేషాచలం అడవుల్లోని శిలాతోరణాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఇటీవల చేర్చింది. ఈ గుర్తింపులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మతో పాటు మరికొందరు ఏయూ ప్రొఫెసర్లు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారి కృషి కూడా ఉంది. ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో నుంచి అత్యంత అరుదైన ఖ్యాతిగా భావిస్తున్నాం. దీని కోసమే ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు వింటున్నాం. యునెస్కో టెంటేటివ్‌ లిస్టులో చేర్చడమంటే.. ఏడాది పాటు దానిని పరరిక్షస్తే.. ఆ తర్వాత యునెస్కో ఆ గుర్తింపును శాశ్వతంగా కొనసాగిస్తుంది. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసానికి ప్రయత్నాలు జరిగాయి. గతంలో ఈ ఎర్రమట్టి దిబ్బల్లో కొంత భాగాన్ని హౌసింగ్‌ సొసైటీకి కేటాయించారు. అక్కడ∙ఇళ్లు కట్టుకోవడం కోసం కొంత స్థలాన్ని ధ్వంసం చేశారు. సొసైటీ సభ్యులు సొమ్ము చెల్లించినందున ప్రభుత్వం వీరికి మరోచోట ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించాలి. ఇకపై అది నిషేధిత ప్రాంతమవుతుంది. ఎవరూ ఆక్రమించడానికి గాని, ధ్వంసం చేయడానికి కాని వీల్లేదు’ అని జల బిరాదరి జాతీయ కన్వీనర్, పర్యావరణవేత్త, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story