
టెలిఫోన్ ట్యాపింగ్ నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు
ట్యాపింగ్ కేసులో కీలక నిందుతులు టీ ప్రభాకరరావు, శ్రవణ్ రావుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసింది
నత్తనకడగా సాగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో కీలకమైన పరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే ట్యాపింగ్ కేసులో కీలక నిందుతులు టీ ప్రభాకరరావు, శ్రవణ్ రావుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసింది. నిందితులు ఇద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసిన విషయాన్ని ఇంటర్ పోల్ ఉన్నతాధికారులు ఢిల్లీలోని సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. ఆసమాచారాన్ని సీబీఐ ఉన్నతాధికారులు హైదరాబాదులోని సీఐడీ ఉన్నతాధికారులకు చేరవేశారు. రెడ్ కార్నర్ నోటీసులు(Rec Corner Notices) జారీచేయటంతో ఇద్దరినీ అమెరికా(America) నుండి ఇండియాకు రప్పించేందుకు మార్గం సుగమం అయ్యింది.
కేసీఆర్)KCR) పదేళ్ళ పాలనలో వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్(Telephone Tapping) చేయించిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి(Revanth)తో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ పై చాలా ఆరోపణలు చేశారు. అయితే అప్పట్లో వీళ్ళ ఆరోపణలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రేవంత్ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది. దాంతో తీగలాగితే డొంకంతా కదిలినట్లు ట్యాపింగ్ అంశంలో కీలకపాత్ర పోషించిన చాలామంది పోలీసు అధికారులు అరెస్టయ్యారు. విచారణలో వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. ట్యాపింగ్ మొత్తానికి కేసీఆర్ హయాంలో అపరిమితమైన అధికారాలు చెలాయించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకరరావు, ఒక మీడియా యజమాని శ్రవణ్ రావు కీలకంగా పోలీసు అధికారులు బయటపెట్టారు.
ఎప్పుడైతే తమ గుట్టురట్టయ్యిందని తెలుసుకున్నారో ప్రభాకరరావు, శ్రవణ్ రావులు అమెరికాకు పారిపోయారు. దాదాపు ఏడాదినుండి వీళ్ళిద్దరు అమెరికాలోనే ఉంటున్నారు. అయితే శ్రవణ్ మాత్రం మధ్యలో దుబాయ్(Dubai) లాంటి దేశాల్లో కొంతకాలం తలదాచుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరినీ అరెస్టుచేసి విచారణ చేస్తే కాని ట్యాపింగ్ అసలు సూత్రదారి ఎవరో బయటపడదు. ప్రభాకరరావే తమకు ఆదేశాలిచ్చి ట్యాపింగ్ చేయించినట్లుగా అరెస్టయిన పోలీసు అధికారులు చెప్పారు. అయితే వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయాలని ప్రభాకరరావును ఆదేశించింది ఎవరు ? ఈ విషయమై ఇప్పటికే కొందరు మంత్రులు మాట్లాడుతు ట్యాపింగ్ సూత్రదారి కేసీఆరే అని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. వెంటనే కేసీఆర్ పై కేసుపెట్టి అరెస్టుచేయాలని డిమాండ్ కూడా చేశారు.
అయితే తగిన ఆధారాలు లేకుండా కేసీఆర్ పైన కేసుపెట్టినా, అరెస్టుచేసినా నిలబడదు. అందుకనే సీఐడీ కూడా ప్రభాకరరావును ఇండియాకు రప్పించాలని చాల ప్రయత్నాలుచేసింది. దాదాపు ఏడాదిగా సీఐడీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) చేస్తున్న ప్రయత్నాలు ఇపుడిపుడే ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగమే ప్రభాకరరావు, శ్రవణ్ కు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారి. రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయటం అంటే ప్రొవిజనల్ అరెస్టుచేసే అవకాశం ఉన్నట్లే లెక్క. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్(Inter Pol) అధికారులకు నిందితులు ఇద్దరిపైన ఉన్న కేసులు, అరెస్టుచేసి విచారించాల్సిన అవసరాన్ని సీఐడీ నొక్కిచెప్పింది. కాబట్టి సీబీఐ ద్వారా సీఐడీ రిక్వెస్టు చేస్తే ఇంటర్ పోల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇంటర్ పోల్ సమాచారం అందిస్తుంది. అప్పుడు సీబీఐ లేదా సీఐడీ అధికారులు అమెరికాకు వెళ్ళి న్యాయస్ధానంలో పిటీషన్ దాఖలు చేయాలి.
ఇంటర్ పోల్ ఆధీనంలో ఉన్న నిందితులు ఇద్దరినీ తమకు అప్పగిస్తే ఇండియాకు తీసుకుని రావటానికి అమెరికాలోని న్యాయస్ధానం అనుమతి తీసుకోవాలి. కోర్టు గనుక అనుమతిస్తే వెంటనే ఇద్దరినీ అమెరికా నుండి ఇండియాకు తీసుకురావటం సాధ్యమవుతుంది. ఇద్దరిని హైదరాబాదు(Hyderabad)కు తీసుకురాగానే ఇక్కడ మళ్ళీ అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టు అనుమతితో పోలీసులు విచారణ మొదలుపెడతారు. ఇదంతా జరగటానికి ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పలేరు కాని నిందితులను ఇండియాకు రప్పించేందుకు మార్గం అయితే సుగమం అయ్యిందనే అనుకోవాలి.