KTR arrest|కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం ?
x

KTR arrest|కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం ?

ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) అవినీతిలో అరెస్టు చేయకుండా కేటీఆర్(KTR) కోరుకున్న రక్షణను హైకోర్టు కుదరదని చెప్పింది.


ఏ విషయంలో అయితే కేటీఆర్ రక్షణ కోరుకుంటున్నారో ఆ విషయంలో హైకోర్టు పెద్ద షాకిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) అవినీతిలో అరెస్టు చేయకుండా కేటీఆర్(KTR) కోరుకున్న రక్షణను హైకోర్టు కుదరదని చెప్పింది. సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యే విషయంలో సోమవారం కేటీఆర్ ఎంతపెద్ద రాద్దాంతం చేశారో అందరూ చూసిందే. విచారణకు హాజరుకాకూడదన్న ఉద్దేశ్యంతోనే కేటీఆర్ మంగళవారం హైకోర్టు తీర్పు ఉందన్న విషయాన్ని సాకుగా చూపించారు. అంటే కేటీఆర్ ఉద్దేశ్యం ఏమిటంటే తనపైన ఏసీబీ నమోదుచేసిన కేసును హైకోర్టు కొట్టేస్తుందని. కేసు కొట్టేసిన తర్వాత విచారణ, అరెస్టు అన్న ప్రశ్నే ఉత్పన్నంకాదని కేటీఆర్ అనుకున్నారు. అయితే హైకోర్టు(Telangana Highcourt) కేటీఆర్ వేసిన పిటీషన్నే కొట్టేసింది. తాజా తీర్పుతో కేసువిచారణలో భాగంగా అవసరం అనుకుంటే ఏసీబీ కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం దొరికింది. ఈ విషయంలోనే ఇపుడు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

కేటీఆర్ దాఖలుచేసిన పిటీషన్ను హైకోర్టు కొట్టేసిన నేపధ్యంలో ఇపుడు ఏసీబీ ఏమిచేస్తుంది ? అన్న టెన్షన్ పార్టీ నేతల్లో పెరిగిపోతోంది. ఇప్పటికే 6వ తేదీన విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్న కేటీఆర్ ను మళ్ళీ 9వ తేదీన విచారణకు రమ్మని ఏసీబీ మరో నోటీసు జారీచేసింది. ఎలాగూ 9వ తేదీన విచారణకు రమ్మని చెప్పింది కాబట్టి ఈలోగానే ఏసీబీ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసులో కోట్లాదిరూపాయల అవినీతి జరిగిందన్న ఏసీబీ లాయర్ల వాదనను హైకోర్టు అంగీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ అనుమతిలేకుండానే హెచ్ఎండీఏ రు. 41 కోట్లను బ్రిటన్ సంస్ధ ఎఫ్ఈవోకి చెల్లించటాన్ని హైకోర్టు కూడా తీవ్రమైన నేరంగా పరిగణించినట్లు ఏసీబీ లాయర్ చెప్పారు. తన ఆదేశాల ప్రకారమే ఎఫ్ఈవో కంపెనీకి అధికారులు డబ్బులు చెల్లించారని గతంలో కేటీఆర్ చేసిన ప్రకటనను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుందని ఏసీబీ లాయర్ చెప్పారు.

ప్రజాధనాన్ని పరిరక్షిస్తానని హామీ ఇచ్చి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ స్వయంగా అవినీతికి పాల్పడ్డారని హైకోర్టు నమ్మినట్లుగా ఏసీబీ లాయర్ చెప్పారు. అవినీతిజరిగిందని, అక్రమాలుజరిగాయనేందుకు ఆధారాలు చూపించిన ఏసీబీ(Telangana ACB) వాదనతో హైకోర్టు ఏకీభవించిందని లాయర్ చెప్పారు. హెచ్ఎండీఏ ఖాతానుండి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు విదేశాలకు ఎలా వెళ్ళాయనే విషయాన్ని ఏసీబీ ఆధారాలతో సహా కోర్టులో నిరూపించినట్లు లాయర్ గుర్తుచేశారు.

కేటీఆర్ ఏమిచేస్తారు ?

హైకోర్టు తాజాతీర్పుతో కేటీఆర్ ఏమి చేయబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. కోర్టు తీర్పుతో కల్వకుంట్ల కవిత, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు కేటీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. వీళ్ళందరు కూడా ఏ నిముషంలో అయినా కేటీఆర్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుంటుందనే అనుమానిస్తున్నారు. అందుకనే వెంటనే విస్తృత ధర్మాసనంలో రివ్యూ పిటీషన్ వేయటమా ? లేకపోతే సుప్రింకోర్టులో పిటీషన్ వేయాలా ? అన్న విషయమై చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీకీలకనేతలంతా అందరూ కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు. ఈ విషయం ఇలాగుండగా గ్రీన్ కో కంపెనీ ఆపీసుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి సంబంధించిన ఫైళ్ళను అధికారులు పరిశీలిస్తున్నారు.

గ్రీన్ కో కంపెనీ(GreenKo) మీద ఎందుకు దాడులు చేశారంటే ఈ కంపెనీయే బీఆర్ఎస్ కు రు. 41 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ పేరుతో కేటీఆర్ అక్రమంగా 45 కోట్లను ఎఫ్ఈవో కంపెనీకి చెల్లించగా అక్కడినుండి ఆ డబ్బు గ్రీన్ కో కంపెనీకి చెల్లించిందని ప్రభుత్వం ఆరోపించింది. గ్రీన్ కో కంపెనీ నుండి మళ్ళీ ఆ డబ్బంతా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. అందుకనే బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)ను చెల్లించిన గ్రీన్ కో కంపెనీ మీద ఏసీబీ అధికారులు దాడులు చేసింది.

Read More
Next Story