అచ్యుతాపురం రియాక్టర్ బ్లాస్ట్ పలువురు మృతి , సిఎం దిగ్భ్రాంతి
x

అచ్యుతాపురం రియాక్టర్ బ్లాస్ట్ పలువురు మృతి , సిఎం దిగ్భ్రాంతి

అనకాపల్లి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం ఫార్మా స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో ఉన్న ఎస్సైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది.


అనకాపల్లి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం ఫార్మా స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో ఉన్న ఎస్సైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, యాభై మందికి పైగా గాయపడ్డారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మధ్యాహ్నం రియాక్టర్ పేలే సమయానికి యూనిట్ లో ౩౦౦ కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.

చంద్రబాబు దిగ్భ్రాంతి...

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని అచ్యుతాపురం లోని ఫార్మా సెజ్ లో నేటి మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఘటనలో ఏడుగురు మరణించారని, మరో 50 మందికి పైగా గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగిందన్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో చోటు చేసుకున్న ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరం, భోజన విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కార్మికులంతా కాస్త సేదదీరుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

"ప్రమాదం జరిగిన వెంటనే ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ నుంచి సమాచారం తెలుసుకున్నాను. అధికారులతో ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకొని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్ధిక, వైద్య సహాయాలు అందించాలని సూచించాను. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వారికి తగినంత పరిహారం అందేలా ఎన్.డి.ఏ. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను" అని సీఎం పేర్కొన్నారు.

ఘటనపై పవన్ కళ్యాణ్ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఎన్డీయే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

భోజన విరామంలో ఘటన...

అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఏడుగురు మృతి చెందగా, మొదటి అంతస్తు శ్లాబు కింద పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్ట్ లోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.

గాయపడిన కార్మికులను వెంటనే ఎన్టీఆర్ ఆస్పత్రికి, సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తరువాత, ఏపీ హోంశాఖ మంత్రి అనిత.. జిల్లా కలెక్టర్, ఎస్పీని సంఘటనా స్థలాన్ని సందర్శించి, గాయపడిన కార్మికులకు సాధ్యమైనంత ఉత్తమమైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story