విభజన చట్టం ఇచ్చిన రాయలసీమకు హక్కులను గౌరవించండి ...
x

విభజన చట్టం ఇచ్చిన రాయలసీమకు హక్కులను గౌరవించండి ...

రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్


రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్ ఒడంబడిక జరిగి సరిగ్గా 87 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఒప్పంద పత్రంలోని కీలక అంశాలైన కృష్ణా, తుంగభద్ర నదీ జలాలలో ప్రథమ ప్రాధాన్యత, పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని, హైకోర్టులాంటి హామీలను నేటికీ ఏర్పాటు చేయకపోవడం పట్ల రాయలసీమ సాగునీటి రంగంతో పాటు అన్ని రంగాలలో వెనుకబడటమే గాకుండా పాలనా వికేంద్రీకరణలో కూడా రాయలసీమ ప్రాంతం వివక్షతకు గురవుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షతకు వ్యతిరేకంగానే ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనదనీ, రాయలసీమకు తెలుగు రాష్ట్రంలో పాలన, అభివృద్ధి, వికేంద్రీకరణలో ప్రాధాన్యత హామీ శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా కల్పించడం వలననే తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు సహకారం అందించారని ఆయన గుర్తు చేసారు.

రాయలసీమకు హక్కులను కల్పిస్తూ "శ్రీ బాగ్ ఒడంబడిక" నవంబర్ 16, 1937 న రూపొందించిన సందర్భంగా లాయర్ కృష్ణారెడ్డి అధ్యక్ష్యతన శనివారం నంద్యాల పట్టణంలోని భగీరథ సమావేశ మందిరంలో రాయలసీమ హక్కుల దినోత్సవాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్వహించింది.

ఈ సందర్భంగా వై.యన్.రెడ్డి మాట్లాడుతూ...

భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్డం కూడా రాయలసీమకు హక్కులను కల్పించినప్పటికీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ హక్కుల అమలు దిశగా అడుగులు వేయడంలో విఫలమయ్యాయనీ, తద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక వెనుకకు నెట్డివేయబడిందని విమర్శించారు.

ప్రభుత్వాలు ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను చేపడుతామని అంటూనే రాయలసీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులలో తీవ్ర వివక్షతను చూపడం వలన కృష్ణా, తుంగభద్ర నదీ జలాలలో హక్కులు ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు.

స్వర్గ లోకంలో ఉన్న గంగను భూలోకానికి తేవడంలో భగీరథుడు విజయం సాధించారనీ, బొజ్జా దశరథరామిరెడ్డి కూడా మన నీటి హక్కుల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారనీ ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మనము కూడా ఒక్కో భగీరథుడిలాగా తయారై మన నీటిని మనం సాధించుకోవాలని ఈ భగీరథ సమావేశ మందిరం నుంచి రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందని అన్నారు.

ఆంద్రాబ్యాంక్ విశ్రాంత ఎజియమ్ శివనాగిరెడ్డి మాట్లాడుతూ..

రాయలసీమ సాంప్రదాయక వనరులైన చెరువుల నిర్మాణం, నిర్వహణ పట్ల పాలకుల నిర్లక్ష్యం వలన రాయలసీమ జల సంరక్షణలో విఫలమయిందనీ, రాయలసీమ సాగునీటి రంగానికి మొక్కుబడిగా అరకొర నిధులు కేటాయిస్తూ గోదావరి - పెన్నా నదుల అనుసంధానం చేపడుతామంటూ రాయలసీమను ఆశల పల్లకీలలో ఊరేగిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ సాగునీటి రంగాన్ని చక్కదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 శాతం భూభాగం వున్న రాయలసీమకు రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో 42 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..

రాయలసీమ సమగ్రాభివృద్ది కొరకై రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా దశరథరామిరెడ్డి నాయకత్వంలోని గత పన్నెండు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందనీ, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ బాగ్ ఒడంబడికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతు నాయకులు ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, బెక్కం రామసుబ్బారెడ్డి, M.C. కొండారెడ్డి తదితరులు మాట్లాడుతూ..

రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టు గురించి మాట్లాడని పాలకులు పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో ఏర్పాటు అయిన హ్యూమన్ రైట్స్ కమీషన్, లోకాయుక్త, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్, కొప్పర్తిలో ఏర్పాటు అయిన శిక్షణ కేంద్రాన్ని అమరావతికి తరలించడానికి చట్టాలు రూపొందించే ప్రక్రియను చేపట్టడం గర్హనీయమని ఆందోళన వ్యక్తం చేసారు.

తెలుగు ప్రజల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి తెలుగు రాష్ట్రం ఏర్పడిన చారిత్రక అంశాన్ని గుర్తు ఉంచుకొని అయినా, ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించే పాలకుల చర్యలకు ఇకనైనా ముగింపు పలికి, రాయలసీమ‌ హక్కులను గౌరవించి అమలు చేయాలని రాయలసీమ హక్కుల దినోత్సవం నాడు ప్రభుత్వాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి,

పాణ్యం మండలం రైతు నాయకులు మురళీ ధర్ రెడ్డి,రామ ప్రసాదరెడ్డి, రామసుబ్బారెడ్డి, వెలుగోడు రైతు సంఘం నాయకులు నస్రుల్లా ఖాన్, నంద్యాల మండల రైతు నాయకులు మాజీ సర్పంచ్ రామ గోపాల్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, మహమ్మద్ పర్వేజ్, భాస్కర్ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, క్రిష్ణా రెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు పులి కొండన్న, గోస్పాడు మండల రైతు నాయకులు చిన్న రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి, బండిఆత్మకూరు మండల రైతు నాయకులు శివరామిరెడ్డి,సంజీవరెడ్డి, గాయకుడు గౌడ్, షణ్ముఖరావు, మహానంది మండల రైతు నాయకులు సాకేశ్వరరెడ్డి, సదాశివరెడ్డి, వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

Read More
Next Story