’రాయలసీమ‘ ఆత్మగౌరవానికి ప్రతీక
x

’రాయలసీమ‘ ఆత్మగౌరవానికి ప్రతీక

రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


’రాయలసీమ‘ ఆత్మగౌరవానికి ప్రతీక అని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవాన్ని మంగళవారం నాడు సమితి ప్రధాన కార్యాలయం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. సమితి ఉపాధ్యక్షులు వైయన్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. నాటి నైజాం నవాబ్ తన రాజ్యానికి సైనిక సహాయం పొందడానికి రాయలసీమను బ్రిటిష్ వారికి వదలివెసిన తర్వాత ఈ ప్రాంతాన్ని “సీడెడ్ జిల్లాలు”గా పిలిచేవారు. ఆ పదంపై అసంతృప్తితో ప్రజలు “దత్త మండలం” అని పిలవడం ప్రారంభించారు. నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో భాగంగా నవంబర్ 18, 1928 న జరిగిన దత్తమండల సమావేశంలో చిలుకూరి నారాయణరావు గారు “దత్త మండలం”ను “రాయలసీమ”గా పేరు మార్చాలని తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రాంత నాయకులు మద్దతు తెలిపారు.

అప్పటి నుంచి “రాయలసీమ” అనే పేరు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈ నేపథ్యంలో నవంబర్ 18న ప్రతి సంవత్సరం సాధన సమితి ఆత్మగౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సమితి నాయకులు మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు రాజ్యాంగం, రాష్ట్ర విభజన చట్టం, శ్రీబాగ్ ఒప్పందం ద్వారా లభించిన హక్కులు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. పాలకులు నిరంతరం ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని, ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోనే రాయలసీమకు న్యాయం సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. రాయలసీమ హక్కుల సాధన కోసం ప్రాంత ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని, ప్రభుత్వం హక్కులను తక్షణం అమలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆంధ్రాబ్యాంక్ ఎజియం శివనాగిరెడ్డి, గాయకుడు ఇ.సి.నారాయణ, మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, న్యాయవాది అసదుల్లా, మనోజ్ కుమార్ రెడ్డి, జానోజాగో మహబూబ్ భాష, కొమ్మా శ్రీహరి, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story