సాగునీటి విడుదల కోసం గళమెత్తిన అన్నదాతలు
x
సాగునీటి విడుదల కోరుతూ రాయలసీమ రైతుల ధర్నా

సాగునీటి విడుదల కోసం గళమెత్తిన అన్నదాతలు

రాయలసీమ పట్ల ప్రభుత్వ వివక్షతను ఎండగట్టిన ప్రజాసంఘాలు. కర్నూలు జలవనరుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా


ప్రకృతి కనికరించి తుంగభద్ర డ్యాంకు, శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ నెలలోనే వరదలు వచ్చినా తుంగభద్ర డ్యామ్ నుండి LLC, HLC ఆయకట్టుకు , శ్రీశైలం రిజర్వాయర్ వెనక జలాల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు విడుదల చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ పట్ల వివక్షతతో పాలకులు వ్యవహరించడం విడనాడాలనీ, తక్షణమే రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జలవనరుల శాఖ ఛీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద బుధవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో రాయలసీమ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి.

ఈ సంవత్సరం మే నెలలోనే వర్షాలు రావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాది ఎకరాలలో రైతులు పంటలు సాగు చేయడం జరిగిందనీ.. అయితే తీవ్ర వర్షాభావాల వల్ల వేసిన పైర్లు ఎండిపోతున్నాయి.ఈ నేపథ్యంలో HLC, LLC లకు, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడమని ప్రభుత్వానికి లేఖ పంపినా నేటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ నేడు ధర్నా నిర్వహిస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రకటించారు.
తుంగభద్ర డ్యాం గేట్లను తక్షణమే మార్చాలని గత సంవత్సరమే సాగునీటి రంగ నిపుణులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తుంగభద్ర డ్యామ్ లో 80 టీఎంసీలకు అదనంగా వచ్చే నీటినంతా నదిలోకి విడుదల చేయవలసిన పరిస్థితి నేడు ఏర్పడిందని తెలిపారు. అయితే తుంగభద్ర డ్యామ్ లోకి వచ్చిన నీటిని నదిలోకి విడుదల చేయడానికి సిద్ధమైన పాలకులు ఎల్ఎల్సీ ఆయికట్టు హెచ్.ఎల్.సి ఆయకట్టుకు నీరు విడుదల పట్ల నిర్లక్ష్యం చూపడాన్ని ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రజాస్వామ్య హక్కుల వేదిక నాయకులు బస్తిపాడు రామకృష్ణారెడ్డి తీవ్రంగా నిరసించారు.
అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్లో 22వ తేదీ నాటికే 854 అడుగుల్లో 90 టీఎంసీల నీరు చేరినప్పటికీ పోతిరెడ్డిపాడు నుండి తెలుగుగంగ, ఎస్ఆర్బిసికి, కేసి కెనాల్ కు నీటిని విడుదల విడుదల చేయకుండా, వేసిన పంటలు ఎండుతుంటే వాటిని కాపాడకుండా ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు బెక్కం రామసుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలం రిజర్వాయర్ లో వరద ఉన్న 30 రోజుల్లో నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించకపోతే కృష్ణా జలాలంతా సముద్రం పాలవుతున్న విషయం అందరికీ తెలిసిందే అయినా, పాలకులు కృష్ణా జలాలు సముద్రంపాలు చేయడానికైనా ఇష్టపడుతున్నరు గానీ రాయలసీమకు నీరు ఇవ్వడానికి ఇష్టపడడం లేదంటే పాలకులు రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తున్నారో అవగతమవుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య కర్నూలు జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఘాటుగా విమర్శించారు.
రాయలసీమలో త్రాగడానికి, వేసిన పంటలు ఎండిపోతున్నప్పటికీ పై రెండు ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయకుండా నీటినంతా శ్రీశైలం నుండి కరెంటు ఉత్పత్తి చేయడానికి వినియోగించండి అని చీఫ్ సెక్రటరీ చెప్పడాన్ని ధర్నాలో పాల్గొన్న ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
సాగునీటి విడుదల విషయంలోనే కాకుండా రాయలసీమ ప్రాజెక్టుల మరమ్మత్తులకు కూడా ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని యువ నాయకులు అసదుల్లా తీవ్రంగా విమర్శించారు. తుంగభద్ర గేట్ల మరమ్మత్తులకు నిధులు ఇవ్వని ప్రభుత్వ చర్యల వల్ల తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆయకట్టు భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందని హంద్రీ నది పరిరక్షణ నాయకులు శేషగిరి తీవ్రంగా విమర్శించారు.
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, లక్షలాది ప్రజల దాహార్తని తీర్చే గోరుకల్లు రిజర్వాయర్ రివిట్మెంట్ కుంగిపోయి ప్రమాదం అంచున వుందనీ...వెంటనే నిధులు మంజూరు చేసి గోరుకల్లు రిజర్వాయర్ ను కాపాడమని రైతులు వేడుకుంటున్నా నేటి వరకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చ పెడుతూ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని గడివేముల మండల రైతు నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాగునీటి కోసం ఉద్యమించి రైతులకు అండగా వుండవలసిన ప్రతిపక్షం అస్సలు ఇది సమస్యే కాదన్నట్లుగా భావిస్తూ జమిలి ఎన్నికల కోసం ఎదురు చూస్తోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు మెహబూబ్ బాషా, శ్రీహరి తీవ్రంగా విమర్శించారు.జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు మియా ఉద్యమ గీతంతో పాలకులకు చురకలు అంటించారు.

జలవనుల శాఖ సూపరింట్ ఇంజినీర్ వినతిపత్రం

రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదల తక్షణమే చేపట్టాలని, రాయలసీమ ప్రాజెక్టుల నీటి హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనేక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సవివరంగా వ్రాసిన ఉత్తరాన్ని జలవనుల శాఖ సూపరింట్ ఇంజినీర్ బాలచంద్రారెడ్డి కి ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు అందజేశారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి సానుకూల నిర్ణయాన్ని అత్యంత త్వరగా ప్రకటిస్తామని సూపరింట్ ఇంజినీర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, కెసి కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు డేవిడ్, కాశీవిశ్వనాథ యాదవ్, సుంకన్న, యోహాన్, నాగన్న, రమణారెడ్డి, రాఘవేంద్ర గౌడ్, వెంకటరెడ్డి, పట్నం రాముడు, భాస్కర్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, నిట్టూరి సుధాకర్ రావు , పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Read More
Next Story