ఇంజనీర్ సుబ్బరాయుడుకి  జోహార్
x
M సుబ్బరాయుడు

ఇంజనీర్ సుబ్బరాయుడుకి జోహార్

కరవుపీడిత రాయలసీమ సాగునీటి కోసం పరితపించిన మేధావి


కరవుపీడిత రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం కోసం పరితపించిన విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం.సుబ్బరాయుడుగారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనప్పటికీ ఆయన మనసంతా రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులు, తుంగభద్ర నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి వేదవతి ఎత్తిపోతల, గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణం చేయాలన్న అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేది. వేదవతి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి ప్రభుత్వానికి పంపారు. గుండ్రేవుల రిజర్వాయరు డిజైన్ పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి పంపాలని, ఆరోగ్యం సహకారించడంలేదని మానసికంగా ఎంతో ఆవేదన చెందేవారు.

సుబ్బరాయుడు(గళ్ల లుంగి) తో రచయిత లక్ష్మినారాయణ (మధ్యలో)

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కె.సి.కెనాల్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టుల పరిధిలో ఇంజనీర్ గా వివిధ బాధ్యతలను నిర్మాణం మరియు నిర్వహణ రంగాలలో శ్రీ సుబ్బరాయుడుగారు అంకితభావంతో నిర్వహించారు. రిటైర్ అయిన తరువాత కూడా రాయలసీమ ప్రాజెక్టుల సాధనే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని నిర్విరామంగా కృషి చేసిన ధన్యజీవి సుబ్బరాయుడుగారు. సిద్ధేశ్వరం వేర్ కమ్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు వ్రాశారు. రాయలసీమను రక్షించడానికి ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి? అంటూ కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్రాసిన ఒక ఉత్తరంలో ప్రశ్నించారు.

గడచిన ఏడాదిగా తరచూ ఫోన్ చేసి తుంగభద్ర, కృష్ణా మరియు గోదావరి నదీ జలాలు ~ వాటి వినియోగం ~ ట్రిబ్యునల్స్ తీర్పులు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, తదితర అంశాలపై గంట, గంటన్నర సేపు మాట్లాడేవారు. వారితో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపించేది. మా మధ్య సంభాషణ నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. నదీ జలాలు ~ సాగునీటి ప్రాజెక్టుల కోసం నేను ఉడతకు ఉడతాభక్తిగా చేస్తున్న కృషిని ఎంతో కొనియాడుతూ, అభినందించేవారు. వారు ఒక ఊత పదంగా నన్ను అన్నా అంటూ సంభాషణ మధ్యలో సంబోధిస్తూ, ఎంతో ఆప్యాయతగా మాట్లాడేవారు. సుబ్బరాయుడుగారు చాలా సంస్కారవంతులు. తన వృత్తి పట్ల అంకితభావం, కరవు పీడిత రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం పరితపించిన సుబ్బరాయుడుగారి మరణం ప్రత్యేకంగా రాయలసీమ సమాజానికి పూడ్చలేని నష్టం.

ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సందర్భంలో ఆగస్టు 6న విశ్రాంత ఐపీఎస్ ఉన్నతాధికారి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు, శ్రీయుతులు అక్కినేని భవానీ ప్రసాద్, నల్లమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, బొజ్జా దశరథరామిరెడ్డి, కె.రామాంజనేయులు, కృష్ణమూర్తినాయుడులతో కలిసి కర్నూలులో సుబ్బరాయుడుగారి ఇంటికి వెళ్ళి కలిశాం. ఆయన ఎంతో సంతోషపడ్డారు. జలవనరులు, సాగునీటి ప్రాజెక్టులపై ఉత్సాహంగా వారి అభిప్రాయాలను నిర్మొహమాటంగా మాతో పంచుకున్నారు.

నేను ఎంతగానో అభిమానించే, నన్ను అమితంగా అభిమానించిన ఇంజనీర్ సుబ్బరాయుడుగారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

-టి.లక్ష్మీనారాయణ

Read More
Next Story