
రాయచోటి లేవనెత్తిన ప్రశ్నలెన్నో...
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తనకు అనువుగా జిల్లాలను మార్చుకుంటుందా.. ఇది సరైనదేనా?
“జిల్లా కేంద్రం అంటే మా ఊరి ఊపిరి. అది పోతే రాయచోటి మళ్లీ వెనక్కి వెళ్లినట్టే” అంటున్నారు రాయచోటి బస్టాండ్ సమీపంలో టిఫిన్ సెంటర్ నడిపే శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా కేంద్రం అంశం చుట్టూ జరుగుతున్న చర్చలు ఈ పట్టణంలో మళ్లీ అనిశ్చితిని పెంచాయి.
రాయచోటి మాత్రమే కాదు, జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది.
ఇటీవల కర్నూలు జిల్లాలో ఆదోని మండలాన్ని ‘ఆదోని–వన్’, ‘ఆదోని–టూ’గా విభజించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా, స్థానిక ప్రజలు తీవ్రంగా స్పందించారు. కొత్త మండల కేంద్రంగా పెద్దహరివాణంను ప్రకటించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టిన గ్రామస్థులు, నిరసనగా “మా ఊళ్లోకి రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు” అంటూ బోర్డులు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ప్రజలతో సంప్రదింపులు లేకుండా, కేవలం పరిపాలనా సౌలభ్యం పేరుతో తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రాంతీయ ఆగ్రహంగా మారుతున్నాయో ఆదోని ఉదంతం స్పష్టం చేస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లా కేంద్రం కొనసాగుతుందా? మారుతుందా? అన్న ప్రశ్నకు అధికారిక సమాధానం వచ్చినా రాయచోటిలో భావోద్వేగాలు మిన్నంటుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేవలం పరిపాలనా సంస్కరణ కాదు. అది ప్రాంతీయ గౌరవం, చారిత్రక గుర్తింపు, రాజకీయ ఆధిపతమనే అంశాల సమ్మేళనం. జిల్లాల సంఖ్య పెరగడం, జిల్లా కేంద్రాలు మారడం అనేది ప్రభుత్వ ఉత్తర్వుతో పూర్తయ్యే ప్రక్రియగా కనిపించినా, దాని ప్రభావం మాత్రం గ్రామస్థాయి రాజకీయాల వరకూ వెళ్తుంది.
జిల్లా కేంద్రం అంటే ఏమిటి?
జిల్లా కేంద్రం అంటే కేవలం కలెక్టరేట్ భవనం కాదు. అధికార వ్యవస్థల కేంద్రం. ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల మూలం. రియల్ ఎస్టేట్ విలువల నిర్ణయ కేంద్రం. రాజకీయ ప్రాధాన్యతకు ముద్ర.
ఒక ప్రాంతానికి జిల్లా కేంద్రం రావడం అంటే ఆ ప్రాంతానికి రాజకీయంగా ‘మూల్యం’ పెరిగినట్టే. అదే పోతే, ఆ ప్రాంతం విలువ తగ్గిపోతుందనే భావన బలపడుతుంది.
ఈస్టిండియా కంపెనీ రాజ్యమేలుతున్న కాలంలో మొదలైన జిల్లాల ఏర్పాటు గత 150 ఏళ్లకు పైగా సాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచే జిల్లాల పునర్వ్యవస్థీకరణ వివాదాస్పదం అవుతూనే వస్తోంది. బ్రిటీష్ వారి హయాంలో ఉన్న తొలి జిల్లా ఒంగోలు. ఆ తర్వాత అది అంతర్థానమైంది. మళ్లీ ఆ జిల్లా ప్రకాశం పేరిట ఏర్పాటు కావడానికి ఎన్నో దశాబ్దాలు పట్టింది. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా కోసం ఉద్యమాలు సాగాయి. ఇప్పుడు సరికొత్తగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు–మార్కాపురం వివాదం చెలరేగింది. కర్నూలు–అనంతపురం మధ్య చారిత్రక అసమానతలు ఉండనే ఉన్నాయి.
ఇవన్నీ ఒక విషయాన్ని చెబుతాయి. అదే జిల్లా కేంద్రం రాజకీయ గుర్తింపా లేక కొత్త జిల్లాలు పాత గాయాలు రేపడమా? అని ప్రశ్నించారు మార్కాపురం కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నాసరయ్య. ఇటీవలి కాలంలో జిల్లాల సంఖ్య పెరిగినప్పుడు పరిపాలన ప్రజలకు దగ్గరైంది అని ప్రభుత్వం చెప్పిన దాంట్లో వాస్తవం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రాన్ని కోల్పోయాయి, అటువంటప్పుడు వాళ్లు బాధ పడడం సహజమే కదా అన్నారు ఆయన.
కొన్ని పట్టణాలు అనూహ్యంగా ఎదిగాయి. మరికొన్ని ప్రాంతాలు రాజకీయంగా పక్కకు పోయాయి. దీంతో ‘మా ప్రాంతానికి అన్యాయం జరిగింది’ అన్న భావన బలపడుతుంది.
ప్రాంతీయ భావోద్వేగాలు ఎందుకు?
జిల్లా కేంద్రం అంశం ప్రజల్లో భావోద్వేగంగా మారడానికి కారణాలు- కొన్ని పట్టణాలు దశాబ్దాలుగా జిల్లా కేంద్రాలుగా ఉన్నాయి. అవి కోల్పోతే అది కేవలం భౌగోళిక మార్పు కాదు, చరిత్రను తీసేసినట్టు భావిస్తారు. జిల్లా కార్యాలయాలు వెళ్లిపోతే లాయర్లు, చిన్న వ్యాపారులు, లాడ్జీలు, రవాణా రంగం దెబ్బతింటుందనే ఆందోళన ఉంటుంది.
స్థానిక నాయకులు తమ ప్రాంతానికి జిల్లా కేంద్రం తెచ్చినట్టు చెప్పుకోవడం ఒక రాజకీయ విజయంగా భావిస్తారు. అదే కోల్పోతే అది ఓటమిలా మారుతుంది.
ప్రభుత్వ వాదన ఎలా ఉంటుందంటే..
ప్రభుత్వాలు సాధారణంగా చెప్పేది- జిల్లాలు చిన్నవైతే పాలన వేగవంతం అవుతుందని, ప్రజలకు సేవలు దగ్గరగా అందుతాయని, అభివృద్ధి సమానంగా జరుగుతుందని.
సిద్ధాంతంగా ఇది సరైన వాదనే. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే పునర్వ్యవస్థీకరణలో పారదర్శకత, సమతుల్యత లేకపోతే అది రాజకీయ అనుమానాలకు దారి తీస్తుంది.
జిల్లాల విభజనలో రాజకీయ కోణం కీలకం. అధికార పార్టీకి అనుకూల ప్రాంతాలకు ప్రాధాన్యత వస్తుంది. అసంతృప్త వర్గాలను సమతుల్యం చేయడంలో తడబాటు చోటుచేసుకుంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల ఎంపిక పాలన కంటే రాజకీయ వ్యూహంలా కనిపించే సందర్భాలు ఉన్నాయి.
ఈ సమస్యకు పరిష్కారం రాజకీయ నినాదాల్లో కాదు, సంస్థాగత ప్రక్రియల్లో ఉంది అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డి.నరసింహారెడ్డి అన్నారు.
"స్వతంత్ర కమిషన్ ద్వారా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలి. జనాభా, భౌగోళిక విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై పబ్లిక్ హియరింగ్ జరగాలి. ఒకసారి తీసుకున్న నిర్ణయాలను తరచూ మార్చకుండా స్థిరత్వం ఉండాలి" అన్నారు నరసింహారెడ్డి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే మ్యాప్ మార్చడం కాదు. అది ప్రజల గుర్తింపుని, గౌరవాన్ని, భవిష్యత్తు ఆశలను తాకే నిర్ణయమని చెప్పారు.
అందుకే జిల్లాల రాజకీయంలో అసలు ప్రశ్న- పాలన కోసం విభజన చేస్తున్నామా? లేక రాజకీయ సమీకరణ కోసం మ్యాప్‌లను మార్చుతున్నామా? అనేది కీలకం.
Next Story

