రతన్‌ టాటా క్యూట్‌ లవ్‌ స్టోరీ.. వార్‌ వారిద్దరినీ విడదీసింది!
x

రతన్‌ టాటా క్యూట్‌ లవ్‌ స్టోరీ.. వార్‌ వారిద్దరినీ విడదీసింది!

ప్రపంచ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తాను కన్ను మూసే వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆలోచించిన రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలించలేదు.


ప్రపంచంలో ప్రతి ప్రేమ సుఖాంతం కాదు. అలా అని విషాదాంతమూ కాదు. పరిస్థితులు అలా క్రియేట్‌ అవుతాయి. అవి సపోర్టు చేస్తే ప్రేమ సఫలమవుతుంది. లేదంటే విఫలమవుతుంది. సరిగ్గా రతన్‌ టాటా విషయంలో కూడా ఇదే జరిగింది. తన గ్రాడ్యుయేషన్‌ను అమెరికాలో చేసిన టాటా అక్కడే ఉద్యోగంలో చేరారు. రెండేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఒక అమెరికా అమ్మాయిని ఇష్ట పడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత లేదు. వారి బంధువుల నుంచి కూడా అభ్యంతరాలు లేవు. ఇదే సమయంలో రతన్‌ టాటా కుటుంబ సభ్యులు సానుకూలంగానే ఉన్నారు. ఎలాంటి షరతులూ పెట్ట లేదు. ఇద్దరు మనస్పూర్తిగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పైగా ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి.

సరిగ్గా అదే సమయంలో టాటా జీవితంలో దురదృష్టం ప్రవేశించింది. తనను ప్రాణం కంటే మిన్నగా పెంచి పెద్ద చేసిన నానమ్మ ఆరోగ్యం క్షీణించిందని, చావుబతుకుల మధ్య ఉందని టాటాకు కబురొచ్చింది. ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రియురాలి కంటే ప్రాణం పెట్టి పెంచిన నానమ్మ వైపే మొగ్గు చూపారు. నానమ్మను చూడాలనిపించింది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు. అంతకు ముందు జరిగిన విషయం అంతా ప్రేయసితో వివరంగా చెప్పారు. తర్వాతనే ఇండియాకు చేరుకున్నారు. నానమ్మ ఆరోగ్యం కుదుట పడగానే నేను తిరిగి నీ వద్దకు వస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. అనారోగ్య కారణాలతో నానమ్మ తనువు చాలించింది. ప్రాణం పెట్టి పెద్ద చేసిన నానమ్మ లేక పోవడంతో ఎంతో కుంగి పోయారు రతన్‌ టాటా. దీంతో పాటుగా వారి కుటుంబంలో రకరకాల సమస్యలు వచ్చిపడ్డాయి. అయినా తన ప్రియురాలు వస్తుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇండియాకు వస్తే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

సరిగ్గ అదే సమయంలో మరో దురదృష్టం ఆయనను వెంటాడింది. ఇండియా చైనా యుద్ధం మొదలైంది. రతన్‌ టాటా ఇండియా నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను ప్రేమించిన అమెరికా అమ్మాయికి ఇండియాలోని పరిస్థితులను వివరంగా చెప్పగలిగారు. అయినా అమెరికా నుంచి ఇండియాకు తన ప్రేయసిని పంపేందుకు ఆమె తల్లిదండ్రులు భయపడ్డారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చి, భీకరంగా మారడంతో ప్రాణాలకే ప్రమాదమని భావించిన అమెరికా అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించలేక పోయారు. ఇంట్లో ఉత్పన్నమైన పరిస్థితులు, ఇండియా, చైనా యుద్ధం వెరసి టాటాను ఎటూ కదలకుండా చేశాయి. వారి ప్రేమ ఫలించక పోవడానికి, ప్రేమికులిద్దరూ విడిపోవడానికి కారణాలయ్యాయి.

అలా సుమారు ఏడేళ్లు గడిచాయి. తనకు వివాహమే వద్దనుకున్న రతన్‌ టాటా అలాగే ఉండిపోయారు. ఈ విషయాలను తానే స్వయంగా కొన్ని సందర్భాల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పడం విశేషం. అసలు విషయం ఏమిటంటే రతన్‌ టాటా ప్రేమించిన అమెరికా అమ్మాయి పేరు ప్రపంచానికి తెలియక పోవడం. ఆయన కూడా ఆమె పేరును చెప్పలేదు. అమెరికాలో ఎక్కడ ఉంటారు, వారి వివరాలను చెప్పేందుకు ఇష్టపడ లేదు. వారి ప్రేమ కథ అలా ముగిసింది.

ఆయన మనసులో ఏముందో కానీ చనిపోయేంత వరకు వివాహానికి దూరంగానే ఉండి పోయారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం నలు మూలలకు విస్తరింప చేసి, అపర కుభేరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రతన్‌ టాటా లవ్‌ ఓ ఫెయిల్యూర్‌ స్టోరీగా ముగిసింది. తాను మరణించినా, ఆయన లవ్‌ స్టోరీ ఇప్పుడు ప్రపంచాన్ని మాట్లాడింప చేస్తోంది.

Read More
Next Story