నిబద్ధతకు, నిజాయితీకి నిలువుటద్దం ‘రామోజీ’
జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటి రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో రామోజీ గ్రూపు సంస్థలను పటిష్ట పరిచి 25వేల మందికి ప్రత్యక్షంగా, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించి నిబద్ధతకు, నిజాయితీకి నిలువుటద్దంగా కృషి చేసిన మహనీయులు రామోజీరావు అని జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటి రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. రామోజీరావు 88వ జయంతి సందర్భంగా ఆయన సేవలను లక్ష్మణరెడ్డి కొనియాడారు. 1990 వ దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో, మద్య వ్యతిరేక ఉద్యమంలో రామోజీరావు గారితో కలిసి పనిచేసిన అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. 1991–2001 మధ్య అక్షరాస్యత 17 శాతం పెరగడంలో, సంపూర్ణ మద్య నిషేధం అమలై 16 నెలల పాటు కొనసాగడంలోను రామోజీరావు కృషి అమోఘమన్నారు. 1982లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రామోజీ కృషి మరువలేమన్నారు.
1984లో కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఆపదలు వచ్చిన పలు సందర్భాలలో ధాతృత్వాన్ని ప్రదర్శించి రూ. 100 కోట్ల కు పైగా విరాళాలు అందించిన మానవతావాది అన్నారు. స్వయం కృషితో అత్యున్నత శిఖరాలకు ఎదగగలమని నిరూపించిన ధీశాలి అని అన్నారు. 88 ఏళ్ల వయసులో సైతం నిర్భయంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం వికసించడానికి ధైర్య సహసాలతో పోరాడిన రామోజీ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరువలేమన్నారు. రామోజీరావు ఆసుపత్రికి చేరే ముందు రోజు వారితో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తెలిపి అభినందనలు తెలిపారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా రామోజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తెలుగు జాతి ఉనికి, తెలుగు భాషాభివృద్ధి తోనే సాధ్యమౌతుందని నమ్మి కృషి చేశారన్నారు. అవినీతి రహిత రాజకీయాలను విశ్వసించి ఆరు దశాబ్దాల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసి కోట్లాది ప్రజల మన్నలను పొందినారన్నారని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.