Ramappa Temple danger|ప్రమాదంలో రామప్ప దేవాలయం భవిష్యత్తు
x

Ramappa Temple danger|ప్రమాదంలో రామప్ప దేవాలయం భవిష్యత్తు

వరంగల్ జిల్లా(Warangal District)లోని చారిత్రక వారసత్వ సంపద, యునెస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయం(Ramappa Temple) ప్రమాదపు అంచున ఉందని.


బుధవారం తెలంగాణాలో సంభవించిన భూకంపం వల్ల ఒక విషయంలో క్లారిటి వచ్చేసింది. అదేమిటంటే వరంగల్ జిల్లా(Warangal District)లోని చారిత్రక వారసత్వ సంపద, యునెస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయం(Ramappa Temple) ప్రమాదపు అంచున ఉందని. బుధవారం ఉదయం 7.27 గంటలకు తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా మేడారంలో కేంద్రీకృతమైన భూకంపం(Earth quake) ప్రభావం వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాలతో పాటు ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాదు(Hyderabad)లోని చాలా ప్రాంతాల్లో కనబడింది. భూమి కంపించింది కేవలం 5 సెకన్లు మాత్రమే అయినా దాని ప్రభావం మాత్రం ఎక్కువగానే కనబడింది. చాలా ప్రాంతాల్లో ఇళ్ళ గోడలకు పగుళ్ళు ఏర్పడ్డాయి, రోడ్లు చీలిపోయాయి, రోడ్ల చీలిక వల్ల ఆ రోడ్డుపైన ఉన్న వాహనాలన్నీ గుంతల్లో పడిపోయాయి.

కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా కేవలం 5 సెకన్ల భూప్రకంపనలకు మాత్రమే. మేడారంలో కేంద్రీకృతమైన భూకంపంవల్ల 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదులోని బంజారాహిల్స్(Banjara Hills), జూబ్లీహిల్స్(Jubilee Hills), హయత్ నగర్ లాంటి అనేక ప్రాంతాల్లోని ఇళ్ళు, అపార్టమెంట్లు చిగురుటాకులాగ వణికిపోయాయి. ఇదంతా చూసిన తర్వాత శాస్త్రజ్ఞలు తేల్చింది ఏమిటంటే కాళేశ్వరం(Kaleswaram Project) లాంటి ప్రాజెక్టులు, సింగరేణి(Singareni) ఆధ్వర్యంలో జరుగుతున్న బొగ్గు తవ్వకాలు, వేలాది అడుగుల్లోతులోకి బోర్లు విచ్చలవిడిగా వేసేస్తుండటం వల్లనే భూమిపొరలు బాగా బదులైపోయి భూకంపాలకు కారణమయ్యాయని. వందలు, వేల అడుగుల్లోతులోకి భూమిని తవ్వేస్తుండటంతో భూమిపొరలు వదులైపోయి, భూమి పొరల్లో చీలికలు వచ్చేసి, భూమిపొరల్లో పటుత్వం పోవటంతో భూకంపాలు వస్తాయని శాస్త్రజ్ఞులు చెప్పారు.

వరంగల్ జిల్లాలోని రామప్పదేవాలయం పరిరక్షణ కోసం కాకతీయ హెరిటేజ్ ట్రస్టు(Kakatiya Heritage Trust), పాలంపేట డెవలప్మెంట్ అథారిటి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ మండేలా పాండురంగారావు కృషి ఫలితంగానే రామప్పదేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. దాదాపు 800 సంవత్సరాల చారిత్రక వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయం సింగరేణి ఆధ్వర్యంలోని బొగ్గు గనుల తవ్వకాల కారణంగా దెబ్బతినే ప్రమాదంలో పడింది. బొగ్గుగనుల తవ్వకాల వల్లే రామప్పదేవాలయం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అనుకుంటుంటే ఇపుడు భూకంపాల వల్ల కూడా రామప్ప దేవాలయం భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉందని తేలింది.

ఎలాగంటే మేడారంలో కేంద్రీకృతమైన భూకంపం వల్ల 260 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాదులోని చాలా ప్రాంతాలు వణికిపోయాయి. మరి మేడారంకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న రామప్పదేవాలయం పరిస్ధితి ఏమిటి ? మేడారంకు రామప్పదేవాలయం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటే సింగరేణి తవ్వకాలు జరపాలని ప్రయత్నిస్తున్న వెంకటాపురంలోని పాలంపేట బొగ్గుగనుల మధ్యదూరం 35 కిటోమీటర్లు మాత్రమే. బొగ్గు గనుల ప్రాంతానికి రామప్పదేవాలయంకు మధ్యదూరం కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే. భూమిలోపల పొరలు పటుత్వం కోల్పోవటం, కదలికల వల్ల మళ్ళీ భూకంపాలు వస్తాయని శాస్త్రజ్ఞలు చెప్పారు. అంటే బుధవారం 5 సెకన్ల భూప్రకంపనలకే తెలంగాణాలోని చాలా ప్రాంతాలు వణికిపోతే 5 సెకన్లకు మించి ప్రకంపనలు సంభవిస్తే అప్పుడు పరిస్ధితి ఏమిటి ? రిక్టర్ స్కేల్(Rector scale) పైన భూకంపం తీవ్రత 5.3 గా నమోదైంది. అదే 5.3కు మించి ప్రకంపనలు సంభవిస్తే అప్పుడు రామప్పదేవాలయం పరిస్ధితి ఏమవుతుందని పొఫెసర్ పాండురంగారావు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘బుధవారం సంభవించిన భూకంపం వల్ల రామప్పదేవాలయం ప్రాంతంలోని భూమిలోపల కూడా మార్పులు జరిగే అవకాశం ఉంద’ని పాండురంగారావు ఆందోళన వ్యక్తంచేశారు.

‘మరోసారి పెద్దస్ధాయిలో భూకంపం సంభవిస్తే బొగ్గుగని ప్రభావం కచ్చితంగా రామప్పదేవాలయంపైన పడుతుంద’ని ‘తెలంగాణా ఫెడరల్’ తో చెప్పారు. ‘రామప్పదేవాలయం పునాదులు శాండ్ బాక్స్ టెక్నాల(Sandbox Technology)జీలో వేసినట్లు గుర్తుచేశారు. ఆ పునాదులు కూడా కేవలం భూమిలోపల 15 అడుగులు మాత్రమే ఉందన్నారు. 15 అడుగుల శాండ్ బాక్స్ టెక్నాలజీ పునాదుల కారణంగానే రామప్పదేవాలయం 800 ఏళ్ళుగా చెక్కుచెదరకుండా ఉందని పాండురంగారావు గుర్తుచేశారు. భూకంపాలవల్ల రామప్పదేవాలయం, పునాదులు దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని అయితే అసలు సమస్యంతా సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల వల్లే అని చెప్పారు.

పాలంపేటలో సింగరేణి ఓపెన్ క్యాస్ట్ బొగ్గుగనుల్లో తవ్వకాలను యాజమాన్యం ప్రారంభించేందుకు లేదన్నారు. ఇక్కడ గనుక తవ్వకాలు మొదలైతే బొగ్గుకోసం యాజమాన్యం భూమిలోపల వందాలది అడుగులు తవ్వేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అప్పుడు స్వల్ప భూ ప్రకంపనల కారణంగా కూడా బొగ్గుగనులు దెబ్బతినటమే కాకుండా బొగ్గు తవ్వకాల కారణంగా రామప్పదేవాలయం కూడా దెబ్బతినేస్తుందని ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికి రామప్పదేవాలయంకు తక్షణ సమస్య లేకపోయినా మరోసారి ఇంతకన్నా పెద్దస్ధాయిలో భూకంపాలు వస్తే దేవాలయ భవిష్యత్తు ఏమవుతుందో అని ప్రొఫెసర్ పాండురంగారావు ఆందోళన వ్యక్తంచేశారు.

Read More
Next Story