డబుల్ స్మార్ట్ సినిమా రివ్యూ
x

"డబుల్ స్మార్ట్" సినిమా రివ్యూ

ఈ మధ్యకాలంలో వచ్చిన సీక్వెల్స్ ఏవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అదే కోవలో పూరి జగన్నాథ్ 2019 లో తీసిన " ఇస్మార్ట్ శంకర్" కు సీక్వెల్ గా తీసిన "డబుల్ ఇస్మార్ట్" సినిమా..


ఈ మధ్యకాలంలో వచ్చిన సీక్వెల్స్ ఏవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అదే కోవలో పూరి జగన్నాథ్ 2019 లో తీసిన " ఇస్మార్ట్ శంకర్" కు సీక్వెల్ గా తీసిన "డబుల్ ఇస్మార్ట్" సినిమా, శుక్రవారం కాకుండా ఈ గురువారం (15.8.24) విడుదలయ్యింది. ఇందులో కూడా రామ్ పోతినేని హీరో. ఇంతకుముందు రామ్ పోతినేని సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇది అతనికి చాలా ముఖ్యమైన సినిమా. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

గందరగోళంగా ఉన్న కథ, కథనం

కథ గురించి చెప్పాలంటే, సీక్వెల్ కాబట్టి దాని కొనసాగింపుగానే కథ ఉంటుంది. ఈసారి హీరో శంకర్ కు మరోసారి టెక్నాలజికల్‌గా బిగ్ బుల్(హిందీ నటుడు సంజయ్ దత్) అనబడే ఒక మాఫియా డాన్ బ్రెయిన్ ని కాపీ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఒక డాక్టర్. దాంతో శంకర్‌కు రెండు బ్రెయిన్స్ ఉంటాయి. అంటే రెండు రకాలుగా ఆలోచించగలుగుతాడు. ఈ బిగ్ బుల్‌కి ఒక దుర్మార్గమైన లక్ష్యం ఉంటుంది. దాన్ని కొనసాగించాలి అనుకుంటే అతని కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తుంది. దాంతో ఒక డాక్టర్ సలహా మేరకు తన బ్రెయిన్ ని కాపీ చేసి శంకర్ బ్రెయిన్ లోకి కట్ పేస్ట్ చేయిస్తాడు. ఇక కథలో చివరికి ఏం జరిగింది. బిగ్ బుల్ తన లక్ష్యాన్ని సాధించ గలిగాడా లేదా అన్నది మిగతా కథ.

సాధారణంగా ప్రతి సీక్వెల్ కు ఉన్న సమస్య ఈ సినిమా కి కూడా ఉంది. అదే మొదటి దానితో రెండవ దాన్ని పోల్చడం. ఆ లెక్కన చూస్తే మొదటి సినిమాలోని పూరి జగన్నాథ్ కి చాలా క్లారిటీ ఉండింది. కానీ ఈ సినిమాలో పూర్తిగా క్లారిటీ లేదు. సినిమా మొత్తం గందరగోళంగా కొనసాగింది. అక్కడక్కడ కొన్ని చమక్కులు, మెరుపులు ఉన్నప్పటికీ సినిమా మొత్తంగా ప్రేక్షకుల మెదడుకు పరీక్ష పెట్టి ఇబ్బంది పెడుతుంది. అంత క్లారిటీ లేని జగన్నాథ్ చివర్లో కొంత క్లారిటీతో సినిమా నడిపేయాలని అనిపించినప్పటికీ, చాలా ఆలస్యం అయిపోయింది. దాంతో ఈ క్లారిటీ లేని సీక్వెలు దాదాపుగా అన్ని రకాల వర్గాల ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.

సినిమా ఒక ముత్యాల దండ అనుకుంటే, అక్కడక్కడ కొన్ని ముత్యాలు బాగా లేనప్పటికీ మొత్తంగా దండ బాగుంటే విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు అది వర్తిస్తుంది. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే మొత్తంగా దండ బాగలేదు. అక్కడక్కడ కొన్ని ముత్యాలు ఉన్నాయి. అలాంటివి కొన్ని చూద్దాం.

కొంతవరకు మెప్పించిన రామ్ పోతినేని

ఈ సినిమాకి ఒకరకంగా రామే బలం, బలహీనత కూడాను. ఇప్పుడున్న యువ హీరోలు అందరిలో రామ్ ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఇందులో కూడా కొంత వరకు ఉన్నాడు. కొన్ని సన్నివేశాల్లో చక్కని నటనను ప్రదర్శించాడు. కామెడీ కూడా కొంతవరకు ట్రై చేశాడు, సక్సెస్ కూడా అయ్యాడు. ఇతర నటి నటుల్లో హిందీ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాకి అవసరం లేదు. సంజయ్ దత్ మంచి నటుడే, కానీ ఈ సినిమాకి సరిపోడు. ఒక అంతర్జాతీయ స్థాయి కనెక్షన్స్ ఉన్న డాన్ గా తేలిపోయాడు అనడం కంటే ఆ పాత్రను అలా తయారు కావడానికి కారణం దర్శకుడు పూరి నే అని చెప్పవచ్చు. ఈ పాత్రను సరిగ్గా రాసుకోలేకపోయాడు. ఇంకా ఇతర పాత్రల్లో కావ్య థాపర్ ను సినిమా లో ఎందుకు తీసుకున్నారో అందరికీ అర్థం అయిపోతుంది. . గ్లామర్ తోపాటు బోల్డ్ సీన్స్ లో కూడా యువ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది. పోచమ్మ పాత్రలో నటి, యాంకర్ ఝాన్సీ కొంతమేరకు ఓకే

మైనస్ అయిన అలీ కామెడీ

పూరి ప్రతి సినిమాలో ఆలీ ఉంటాడు. ఇందులో కూడా పోక అనే పాత్రలో కొంత కామెడీ ని ప్రదర్శించడానికి ట్రై చేశాడు, అది వెకిలిగా తయారైంది. కొంతవరకే సక్సెస్ అయింది. ఇది మైనస్ కూడా అయింది. కథతో ఏం మాత్రం సంబంధంలేని కామెడీ ట్రాక్ వల్ల కథ సైడ్ ట్రాక్ లోకి వెళ్ళింది. .

స్వయంగా కన్ఫ్యూజ్ అయిన దర్శకుడు

దర్శకుడు పూరి జగన్నాథ్ మొదటి చిత్రాన్ని కొంత క్లారిటీతో తీసి సక్సెస్ అయ్యాడు. ఐదేళ్ల తర్వాత తీసిన సీక్వెల్లో మాత్రం కన్ఫ్యూజ్ అయ్యాడు. చిత్రం ఏమంటే శంకర్ పాత్ర కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటుంది. పూరి కూడా అప్పుడప్పుడు కాకుండా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాడు. అదే చిత్రాన్ని దెబ్బతీసింది. పూరీకి తనమీద తనకు ఎక్కువ కాన్ఫిడెన్స్. ఏం తీసిన చూస్తారని అనుకుంటాడు. అది అన్ని సార్లు జరగదు. స్క్రీన్ ప్లే పూర్తిగా కన్ఫ్యూజింగ్‌గా ఉంది. చిత్రం నిడివి కూడా ఎక్కువే. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ, సంగీతం కొంతవరకు పర్వాలేదనిపించాయి. సాగదీయబడిన క్లైమాక్స్ పూర్తి చలవే. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ముత్యాల దండలో బాగా లేని ముత్యాలే ఎక్కువ. బాగున్న వాటిని వెతికి మరీ గుర్తించాలి.

దర్శకుడే కారణం

సాధారణంగా సీక్వెల్స్ ప్రేక్షకుల విమర్శనాత్మక స్కానింగ్ కు గురవుతాయి. ఇందులో ప్రేక్షకులకు అంత కష్టం లేదు. ఈజీ గానే ఈ సినిమా గురించి అర్థం చేసుకుంటారు. ఈ సినిమా బాగుండకపోవడానికి కారణం కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే. అతనే ఈ పరిస్థితికి కర్త కర్మ క్రియ. విశేషమేమిటంటే ఈ సినిమాకి మాటలు కూడా పూరి జగన్నాథే రాశాడు. అవి కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ సినిమా యువ పేక్షకులను ఆకట్టుకునే అంశాలు కొన్ని ఉండడం వల్ల వారాంతంలో ఈ సినిమాను కొంతమంది చూసే అవకాశం ఉంది. మిగతా ప్రేక్షకు వర్గాలను ఇది ఆకట్టుకునే అవకాశాలు లేవు. . మొత్తంగా చెప్పాలంటే పూరి సీక్వెల్ సినిమా డబుల్ స్మార్ట్ కాకుండా " డల్ స్మార్ట్" అయిందని చెప్పవచ్చు

నటీనటులు: రామ్,కావ్య థాపర్,సంజయ్ దత్,సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్పాండే,ఉత్తేజ్,టెంపర్ వంశీ, గుర్బానీ, వీజే బని

కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్

మాటలు: పూరి జగన్నాథ్

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె.నాయుడు, జియాని జియానెలి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. ఆర్

నిర్మాత: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్

నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్

విడుదల: 15 ఆగస్టు 2024

Read More
Next Story