జగన్ భుజంపై వాలిన జనసేన రాజోలు ‘చిలక’
ఎన్నికల నామినేషన్ ముంగిట రాజులులో జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ కీలక నేత పార్టీ వీడి వైసీపీ గూటికి చేరారు.
ఈరోజు ఆంధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత పార్టీని వీడారు. ప్రస్తుతం ఆంధ్రలో వలస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు చాలా మంది పార్టీకి టాటా చెప్పి టికెట్ ఇచ్చే పార్టీలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజోలు నుంచి జనసేన టికెట్ ఆశించిన బొంతు రాజేశ్వరరావుకు నిరాశే ఎదురైంది. దీంతో భంగపాటుకు గురైనా ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీ అభ్యర్థులకు బీఫారమ్‌లు అందజేశారు. ఇందులో భాగంగా రాజోలుకు అభ్యర్థికి సంబంధించిన బీఫారమ్‌ను పవన్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్‌కు అందించారు. దీంతో తనకు టికెట్ లేదని నిశ్చయించుకున్న బొంతు రాజేశ్వరరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే తన కేడర్‌తో సమావేశమై జనసేనకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే ఆయన జనసేనకు రాజీనామా చేశారు.
సొంత గూటికి బొంతు
జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బొంతు రాజేశ్వరరావు.. తిరిగి తన సొంత గూడు వైసీపీకి వెళ్లారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తానని, నమ్మి వెంట నడిస్తే పవన్ తనకు తీరని అన్యాయం చేశారని ఆయన అన్నారు. ‘‘పవన్ కల్యాణ్ నమ్మించి మోసం చేశారు. పార్టీకి తానెంతో సేవ చేసే టికెట్ విషయానికి వచ్చే సరికి నాకు అన్యాయం చేశారు’’అని ఆయన తెలిపారు. ఆయనతో పాటు అమలాపురం జనసేన ఇన్‌ఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇన్‌ఛార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇన్‌ఛార్జ్ శేషు కుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారు.
రాజోలుతో జనసేనకు వీడని అనుబంధం
రాజోలు నియోజకవర్గంతో జనసేన పార్టీకి విడదీయరాని అనుబంధం ఉంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జనసేనకు ఎదురుగాలులే వీచినా రాజోలులో మాత్రం జనసేన అభ్యర్థికి పట్టం కట్టారు. కానీ ఆ అభ్యర్థి గెలిచిన కొన్నాళ్లకే వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో జనసేన చేతి నుంచి గెలిచిన ఒక్క సీటుకు కూడా జారిపోయింది. దాంతో ఈసారి రాజోలు నియోజకవర్గంపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 ఎన్నికల్లో మరోసారి రాజోలులో భారీ మెజార్టీ సాధించి గెలవాలని పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే అంశాన్ని ఆయన బీఫారమ్‌లు ఇచ్చిన కార్యక్రమంలో కూడా గుర్తు చేశారు. అటువంటి నేతలకు చెక్ పెట్టే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బొంతుకు టికెట్ అందుకే దక్కలేదా!
2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు రాజోలు. అక్కడ జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద రావు.. 50,053 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు 49,239 ఓట్లు సాధించినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాపాక వరప్రసాద రావు.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. బొంతు రాజేశ్వరరావు.. గాజు గ్లాసు పట్టుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయాలని బొంతు రాజేశ్వరరావు ఆశించారు. కానీ రాజోలు సీటును ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోకూడదని భావిస్తున్న జనసేన.. ఒకవేళ గెలిస్తే పార్టీ మారరు అన్న నమ్మకం ఉన్న వ్యక్తికే టికెట్ ఇవ్వాలని భావించిందని, ఆ లిస్ట్‌లో బొంతు రాజేశ్వరావు పేరు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తోడుగా ఒకవేళ బొంతు రాజేశ్వరరావుకు టికెట్ ఇచ్చినా గెలిచిన తర్వాత ఆయన జెండా మార్చేయవచ్చన్న అనుమానాలు పార్టీ కేడర్ నుంచి అధికం కావడంతోనే ఆయనకు జనసేన మొండిచేయి చూపిందని వాదనలు వినిపిస్తున్నాయి.