ర్యాలీని రాజకీయం చేయొద్దమ్మా రజనీ
x

ర్యాలీని రాజకీయం చేయొద్దమ్మా రజనీ

ముస్లిం వర్గాల ర్యాలీ నుంచి వెళ్లిపోవాలని వారు కోరడంతో ఆమె వెనుదిరిగారు.


మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విడదల రజనికి తన సొంత నియోజక వర్గం చిలకలూరిపేటలోనే చేదు అనుభవం ఎదురైంది. అంత మంది ఒకే సారి వద్దు మీరు వెళ్లి పోండి అని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కు తెలియక ఎంత హడావుగా వచ్చిందో.. అంతే స్పీడుగా తన కార్యకర్తలతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

అసలు ఏమి జరిగిందంటే..
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ వర్గాలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రతిపక్షాలు, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ చట్టం రాజ్యాంగానికి విరుద్దంగా ఉందని దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో కూడా వ్యాజ్యం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలో ముస్లి వర్గాలు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఆ మేరకు వారు ర్యాలీ చేస్తూ దాంతో తమ నిరసనలు తెలియజేయాలని భావించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. చిలకలూరిపేట కళామందిర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో అందరూ సమైక్యంగా కలిసి ముందుకు సాగుతున్న సమయంలో చౌత్రా సెంటర్‌కు ర్యాలీ రాగానే మాజీ మంత్రి విడదల రజని దానికిలో ఎంట్రీ ఇచ్చారు. ముస్లిం సోదరలకు మద్దతు తెలుపుతూ, వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుదామనే ఉద్దేశంతో ర్యాలీలోకి ప్రవేశించారు.
అయితే తొలుత కాసేపు కామ్‌గా ఉన్న ముస్లిం సోదరులు ర్యాలీలో ఆమెను కూడా కొనసాగేలా చేశారు. తర్వాత ఆమె వైసీపీకి చెందిన నేత కావడం, పార్టీలకు అతీతంగా ముస్లిం వర్గాలు ర్యాలీలు చేస్తుండటంతో ఇది రాజకీయ పరమైన అంశానికి దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ర్యాలీలో నడుస్తోన్న మాజీ మంత్రి విడదల రజనికి చెప్పారు. పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ ర్యాలీలో మీ రాకతో ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. దయచేసి ర్యాలీ నుంచి వెళ్లి పోవాల్సిందిగా కోరారు. పోలీసులు కూడా ర్యాలీ నుంచి వెళ్లిపోవలసిందిగా ఆమెను కోరారు. దీనిపైన ఆమె స్పందించారు. దేవ వాపితంగా వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నారని, ఆ ఉద్దేశంతోనే తాను కూడా పాల్గొనేందుకు వచ్చానని చెప్పారు. అయినా ముస్లిం వర్గాలు పట్టుబట్టడంతో చేసేదేమీ లేక తన కార్యకర్తలతో కలిసి ర్యాలీ నుంచి వెనుదిరిగి ఆమె అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More
Next Story