ఈమధ్య మీరెప్పుడైనా రాజమండ్రి (ప్రస్తుత రాజమహేంద్రవరం) వెళ్లారా? ఆటు వెళ్తే కనుక మీరు కచ్చితంగా సెంట్రల్ జైలు దాకా వెళ్లిరండి. దాని ఎదురుగా ఉన్న ఆ కెఫే పై ఓ లుక్ వేయండి. రాజమండ్రి అనడంతోనే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది సెంట్రల్ జైలు. ఆమధ్య చంద్రబాబు కూడా ఆ జైల్లోనే గడపడంతో ఆ జైలు బాగా ఫేమస్ అయింది. తెలియని వాళ్లకు కూడా తెలిసివచ్చేలా చేసింది. నిజానికి ఆ జైలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టించిందే. అటువంటి చోట ఇప్పుడో కెఫే (హోటల్) వెలిసింది. సువిశాల ప్రాంగణం, లెక్కకు మిక్కిలి ఆహార పదార్థాలు ఈ కేప్ సొంతం. ప్రైవేటు వ్యక్తులతో పాటు సెంట్రల్ జైలు ఖైదీల సంయుక్త భాగస్వామ్యంతో నడుపుతున్న ఈ హోటల్ ఇప్పుడో ఓ ఊపు ఊపుతుంది. పెద్ద ఆట్రాక్షన్ సెంటర్ గా మారింది. దీంతో అటు జైలుకు ఇటు ఖైదీలకు ఆదాయం తెచ్చిపెడుతోంది. కొత్తగా కట్టిన రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట సువిశాలమైన ప్రాంగణం ఉంది. గ్రాండ్ ట్రంక్ రోడ్డు కూడా కావడంతో ఎప్పుడూ ఆ రోడ్డు రద్దీగానే ఉంటుంది. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ఎలాగైనా వినియోగం లోకి తేవాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా టెండర్లు పిలిచారు. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. కొత్త ఫుడ్ అవుట్‌లెట్ ఏర్పాటైంది.
విపరీతమైన స్పందన...
ప్రస్తుత మార్కెట్ సర్వ ప్రకారం బాగా గిరాకీ ఉన్న వాటిలో ఫుడ్ ఒకటి. మంచి తిండి దొరుకుతుందన్న టాక్ వస్తే జనం ఎంతదూరమైన వెళతారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆంటీ మెస్సే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ విధంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్ కెఫే కి గిరాకీ ఏర్పడింది. సెంట్రల జైలు ఖైదీలు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఆగస్ట్ 15న అధికారికంగా ప్రారంభమైన ఈ కేఫ్ ఆఫర్లకు జనం ఎగబడుతున్నారంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్ హోటల్ స్థాయిలో ఇక్కడ ఆహార పదార్థాలు ఉంటున్నాయని అక్కడ టిఫిన్ చేసిన ఓ సాధారణ ఉద్యోగి రత్నరాజు చెప్పారు.
ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయంటే...
జైల్లో ఉన్న తమ వారిని చూసేందుకు వచ్చే జనంతో పాటు నగర ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆహార పదార్థాలను టేస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్వీట్ కార్న్, టమోటా సూప్ లు, చిల్లీపన్నీర్, పన్నీర్ 65, వెజ్ మంచూరియా, వెజ్ చిల్లీ వంటి స్టార్లర్స్, అపోలో ఫిష్, ఫిష్ ప్రై, ప్రాన్ 65 వంటి సీ ఫుడ్స్, బటర్ రోటీ, గార్లిక్ నాన్, బటర్ నాన్ వంటి రోటీలు, వెజ్, నాన్ వెజ్ కర్రీస్, ఫ్రైడ్ రైస్, మటన్, చికెన్ బిర్యానీలు, జ్యూసులు, కూల్ డ్రింక్స్ వంటివెన్నో దొరుకుతున్నాయి. బయటి మార్కెట్ తో పాటే సమానంగా రేట్లు ఉన్నాయి. మటన్ బిర్యానీ 220 రూపాయలుగా ఉంది. అందువల్ల ధరల గురించి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ క్వాలిటీ ప్రధానం. శుచి, శుభ్రతతో పాటు విశాల ప్రాంగణంలో కూర్చుని తినడానికి వీలుగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆర్డర్లపై కూడా సరఫరా చేస్తున్నారు.
జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ చెప్పిన దాని ప్రకారం ఈ కేప్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు అధికారికంగా ప్రారంభమైంది. ప్రైవేటు వ్యక్తులతో పాటు జైలు ఖైదీలు ఈ కేప్ ను నిర్వహిస్తున్నారు. 1,048 చదరపు గజాల స్థలంలో ఈ కేప్ ఉంది. మెయిన్ రోడ్డులో కేఫ్ కావడంతో మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఏడాదికి లక్ష రూపాయల అద్దె వస్తోంది. ప్రతి రెండేళ్లకు దీన్ని ఐదు శాతం చొప్పున పెంచుతారు. కేఫ్ ప్రారంభ దశలో ఉన్నందున ఐదుగురు ఖైదీలను ఇక్కడ పనికి పెట్టారు. వీరికి ఒక్కొక్కరికి రోజుకు రూ.200 వేతనం లభిస్తోంది.
ఈ హోటల్ మంచి కూడలిలో ఉండడంతో జనం రాకపోకలు పెరిగాయి. జనం నుంచి మంచి మద్దతు లభించింది. తొందర్లో జ్యూస్ పాయింట్ ను వేరుగా ఏర్పాటు చేయనున్నట్టు జైలు సూపరింటెండెంట్ రాహుల్ చెబుతున్నారు. మంచి గిరాకీ
జైలు ఖైదీలు స్వయంగా తయారు చేస్తున్న ఆహార పదార్థాలకు మంచి గిరాకీ ఉండడం విశేషం. ఖైదీలనడంతోనే చిన్న చూపు చూడకుండా ప్రజలు కూడా మంచిగా ఆదరిస్తున్నారని పేరు రాయడానికి ఇష్టపడని ఓ ఖైదీ చెప్పారు. ఖైదీ పరివర్తన చెంది మంచి మనిషిగా మారిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చే వారికి ఈ కేఫ్ ఓ మార్గదర్శిగా ఉంటుందన్నారు. ఖైదీలు తయారు చేసే ఈ ఆహార ఉత్పత్తులు వారి సేవలకు, అంకిత భావానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ హోటల్ మెనూలోని చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శాఖాహార భోజనానికి స్పందన బాగుంది.
ఖైదీల సంస్కరణలో భాగంగా జైళ్ల శాఖ ఇప్పటికే రాజమండ్రిలో రెండు పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది. వీటిని ఖైదీలే నిర్వహిస్తారు. ఆర్దిక లావాదేవీల మొదలు మేనేజ్మెంట్ వరకు అన్నీ వాళ్లే చూస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఈ కెఫే ను ప్రారంభించింది. మున్ముందు ఇటువంటివి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నది జైళ్ల శాఖ ఆలోచన.