సిట్‌ అధికారుల అదుపులో రాజ్‌ కసిరెడ్డి పీఏ
x

సిట్‌ అధికారుల అదుపులో రాజ్‌ కసిరెడ్డి పీఏ

దిలీప్‌ వద్ద మద్యం కుంభకోణంకు సంబంధించి కీలక సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో మరో వ్యక్తిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న రాజ్‌ కసిరెడ్డి ఏపీ పైలా దిలీప్‌ను గురువారం సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ వద్ద లిక్కర్‌ స్కామ్‌ గురించి కీలక సమాచారం ఉందని సిట్‌ అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ స్కామ్‌ తెరపైకి వచ్చిన నాటి నుంచి రాజ్‌ కసిరెడ్డి పీఏ పోలీసులకు చిక్కకుండా, పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో దుబాయ్‌కి పారిపోయేందుకు దిలీప్‌ ప్రయత్నించారు. చెన్నై ఎయిర్‌ పోర్టు నుంచి దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దిలీప్‌ను చెన్నై ఎయిర్‌ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న దిలీప్‌పై ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా అతని కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. చెన్నై ఎయిర్‌ పోర్టులో దిలీప్‌ ఉన్నట్లు గుర్తించిన సిట్‌ అధికారులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రికి దిలీప్‌ను విజయవాడకు తీసుకొని రానున్నారు.
మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తిగా భావించిన రాజ్‌ కసిరెడ్డిని సిట్‌ అధికారులు ఇప్పటికే విజయవాడ జైలుకు పంపారు. రాజ్‌ కసిరెడ్డిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో వేసిన పిటీషన్‌పై అంగీకరిస్తూ.. అనుమతులిచ్చింది. వారం రోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించనున్నారు. శుక్రవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజ్‌ కసిరెడ్డిని విచారించనున్నారు. అయితే రాజ్‌ కసిరెడ్డిని పది రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు అంగీకరించని కోర్టు వారం రోజులకుఅనుమతులు ఇచ్చింది.
Read More
Next Story