
రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి
రాజ్ కసిరెడ్డే విడుదల చేసిన ఆడియోలో ఆయన స్వయంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆలియాస్ రాజ్ కసిరెడ్డి. మంగళవారం తాను సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కసిరెడ్డే స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య సమయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతానని వెల్లడించారు. ఆ మేరకు రాజ్ కసిరెడ్డి సోమవారం మరో వీడియోను విడుదల చేశారు. ఇది వరకు ఒక వీడియోను రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి లీగల్‌గా ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడించారు.
వైసీపీ హయాంలో మద్యం తయారీ, విక్రయాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేకున్నాయనే ఆరోపణలతో మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌రెడ్డిలను సిట్ విచారించింది.
అయితే సిట్ విచారణకు రాకుండా కోర్టు నుంచి ఆదేశాల కోసం రాజ్ కసిరెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిపిన కోర్టు రాజ్ కసిరెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. దీంతో పాటుగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజ్ కసిరెడ్డి తరఫు న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసు తెరపైకి వచ్చిన నాటి నుంచి రాజ్ కసిరెడ్డి ఒక పక్క కోర్టుల చుట్టూ తిరుగుతుండగా, మరో వైపు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు మూడు సార్లు సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే కోర్టులో తనకు రక్షణ దొరుకుంతని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని రాజ్ కసిరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే కోర్టు నుంచి తనకు ఊరట లభించక పోవడం, మరో వైపు సిట్ విచారణకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సిట్ విచారణకు హాజరు కావలని రాజ్ కసిరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇటీవల సిట్ విచారణ అనంతరం, విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి స్పందించారు. ఒక ఆడియోను విడుదల చేశారు. విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజ్ మని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, త్వరలో విజయసాయిరెడ్డి గురించి అన్ని విషయాలను మీడియా ముందు బట్టబయలు చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి పట్ల సిట్ అధికారులు ఎలా వ్యవహరిస్తారు? మీడియా ముందు ఏమి మాట్లాడుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Next Story