కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. రాజ్ భవన్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని సీఎం సూచించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు అథార్టీ ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథార్టీ అంగీకరించింది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులు అథార్టీ ఆమోదించింది.
అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా అథార్టీలో నిర్ణయించారు. హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు అథార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో నిర్మించే హోటళ్ల వద్ద పార్కింగ్ నిబంధనల్లోనూ స్వల్ప మార్పులు చేసేందుకు అథార్టీ అంగీకరించింది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అథార్టీ నిర్ణయించింది. దీంతో పాటు మరికొన్ని సాంకేతిక అంశాలకు, పరిపాలనా అంశాలకు అథార్టీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా సీఎం కొన్ని సూచనలు చేశారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని... పార్కింగ్ సమస్య లేకుండా ప్రణాళికలు చేయాలని సూచించారు. అమరావతి రాజధానిలో రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేసే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. కామన్ పార్కింగ్ ప్రాంతాలు ఉండేలా ప్రణాళికలు చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్లు, తెనాలి మున్సిపాలిటీ, రాజధాని ప్రాంతంతో ఇంటిగ్రేట్ చేయాలని... బ్లూ గ్రీన్ అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఆర్డీఏ అథార్టీ సమావేశానికి మంత్రి నారాయణ, సీఎస్ కె.విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, మౌలికసదుపాయాల కల్పన శాఖ ఉన్నతాధికారులు హజరయ్యారు.