రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
x

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 73మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40–60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని అందవల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.

దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. భారీవర్షాలు, బలమైన గాలుల నేపధ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎగువ ప్రాంతాల్లోను, ఆంధ్రప్రదేశ్‌లోను కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికు చేరనప్పటికీ, వివిధ ప్రాజెక్టులలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు/లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్‌ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టేందుకు వెళ్లడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు.
గోదావరి నదికి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోందని, సోమవారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 37.7 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్‌ ఫ్లో 4.35 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి ఇన్, ఔట్‌ ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 73మిమీ, మన్యం జిల్లా గుళ్లసీతారామపురంలో 66మిమీ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 60.2మిమీ, అల్లూరి జిల్లా కొత్తూరులో 59.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
Read More
Next Story