RRR|జగన్ కేసు కదిలిన రోజే RRR కి ఏపీలో పదవి వచ్చిందా?
అనుకోకుండా జరిగిందే కావొచ్చు గాని ఢిల్లీలో జగన్ బెయిల్ రద్దు కేసు విచారణకు వచ్చిన రోజే టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కి ఉప శాసనసభాపతి పోస్టు వచ్చింది.
అనుకోకుండా జరిగిందేమో గాని దేశరాజధాని ఢిల్లీలో జగన్ బెయిల్ రద్దు కేసు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చిన రోజే ఏపీ రాజధాని అమరావతిలో పారిశ్రామికవేత్త, ఓనాటి వైసీపీ నాయకుడు, నేటి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణం రాజు ఎలియాస్ RRR కి ఉప శాసనసభాపతి పోస్టు దక్కే సంకేతాలు వెలువడ్డాయి. బహుశా ఆయన పేరును ప్రకటించడం ఒక్కటే మిగిలింది. మిగతాపనంతా దాదాపు పూర్తయింది. ఆయన స్థాయికి అది తక్కువా ఎక్కువా అనే దాన్ని పక్కన పెడితే రాబోయే ఐదేళ్లు ఆయన ఏపీ శాసనసభకు డెప్యూటీ స్పీకర్ గా రికార్డుల్లోకి ఎక్కుతారు.
వైసీపీ గుర్తు ఫ్యాన్ పై పార్లమెంటు సభ్యునిగా గెలిచి జగన్ పై కత్తెత్తి ఐదేళ్ల పాటు నిర్విరామంగా అటు ఎంపీగా ఇటు జగన్ బద్ధవ్యతిరేకిగా కొనసాగిన రఘురామ కృష్ణం రాజు నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి. ఒకవేళ ఎవ్వరూ తనని ఆవేళ మీడియాలో చర్చలకో, మాటామంతికో పిలవకపోతే తానే సొంతంగా ఓ వీడియో చేసి వదిలేవారు. శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వైసీపీ వాళ్లు ఆయన్ను ఓడించడానికి విశ్వప్రయత్నం చేసినా కుదరలేదు. అటువంటి RRR ఉపసభాపతి కానున్నారు.
రఘురామ రాజు పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 12న ఖరారు చేశారు. నవంబర్ 13,14 తేదీలలో నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆయన్ను ఉపసభాపతి స్థానంలో కూర్చోబెడతారు.
2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే సొంతపార్టీపైన్నే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వైసీపీ మరో నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి రఘురామ రాజుకి మనస్పర్థలు రావడం, వాటిని తీర్చడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొగ్గు చూపకపోవడం వల్లే వైఎస్సార్ సీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసినట్టు చెబుతుంటారు. చివరికి అది ఎంత దూరం పోయిందంటే రఘురామ రాజును ఓ కేసులో అరెస్ట్ చేయించి సీఐడీ పోలీసులతో కొట్టించేంత వరకు వెళ్లింది. దీనిపై కోర్టులో కేసు కూడా నమోదైంది.
రఘురామరాజు రచ్చబండ పేరుతో కొంతకాలం రోజుకో వీడియో పెట్టేవారు. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలంటూ ఏవేవో విషయాలను ఆయన బయటపెట్టేవారు. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్నది ఆయన చేసిన ఆరోపణ.
జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడంతో వైసీపీ శ్రేణులు ఆయన్ను రాజకీయంగానే కాకుండా తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా వెంటాడాయి. తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు కూడా ఆయన దూరం కావాల్సివచ్చింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితం కావాల్సివచ్చింది.
జగన్ ను ఓడించడమే లక్ష్యమని ప్రతిన బూనిన వారిలో ట్రిపుల్ ఆర్ ఒకరు. వైసీపీ ఓడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు.
సొంతపార్టీలో వైరి పక్షంగా ఉన్నప్పుడే రఘురామకృష్ణం రాజు వైసీపీ నేత జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో చేస్తున్నారు. ఈ కేసు నవంబర్ 12న విచారణకు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ సంజయ్ కుమార్ (JUSTICE SANJAY KUMAR) ‘నాట్ బిఫోర్ మి’ అనడంతో విచారణ వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. డిసెంబర్ 2వ తేదీన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ఈ కేసును ప్రస్తావించవద్దని చెప్పినా పొరపాటున ఈరోజు లిస్ట్ అయినట్లు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్ ప్రకటించారు. జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు జగన్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైనా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనమే విచారణ జరుపుతుందని సీజేఐ సంజీవ్ ఖన్నా తెలిపారు.
Next Story