
అయ్యవార్ల పరీక్షలోనూ లీకేజీల మోత.. పరీక్ష రద్దు
ప్రొఫెసర్ల మధ్య పంచాయితీ కొంపముంచినట్టు చెబుతున్నారు. పాత పద్ధతుల్ని మార్చడం ఇష్టం లేని వారు కొందరు ఈ పనికి సహకరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో బీఈడీ పరీక్షా పేపర్ లీకేజీ నిజమేనని తేలింది. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో మార్చి 7న జరిగిన మొదటి సెమిస్టర్ ‘ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్’ పరీక్ష జరిగింది. దీని ప్రశ్నాపత్రం అరగంట ముందుగానే సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. దీన్ని తొలుత అధికారులు ఖండించినా చివరకు నిజమేనని తేలింది. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఆ పరీక్షను రద్దు చేయడంతో పాటు ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 6న పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు పరీక్షా ప్రశ్నాపత్రం కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. రెండో రోజు పరీక్షను మాత్రం రద్దు చేసింది.
పెద కాకాని పోలీసులకు ఫిర్యాదు..
బీఈడీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగాధర్ తెలిపారు. ఇందులో ఓ వ్యక్తి ఫోన్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని గుర్తించమన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
పేపర్ ఎలా బయటకువచ్చిందంటే...
ప్రొఫెసర్ల మధ్య పంచాయితీ కొంపముంచినట్టు చెబుతున్నారు. పాత పద్ధతుల్ని మార్చడం ఇష్టం లేని వారు కొందరు ఈ పనికి సహకరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పీజీ పరీక్షల సమన్వయకర్తగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న సుబ్బారావు పాత పద్ధతులను మార్చారు. గతంలో ఒకరోజు ముందుగానే సీల్ బండిల్‌తో పరీక్ష కేంద్రానికి లేదా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు ప్రశ్నపత్రాలు తరలించేవారు. ప్రత్యేక పరిశీలకుల సమక్షంలో బండిల్‌ను తెరిచి ఇన్విజిలేటర్లకు, ఆ తర్వాత విద్యార్థులకు అందించేవారు. ఈ విధానంలో మార్పుల పేరుతో ఆచార్య సుబ్బారావు సీడీ విధానాన్ని తీసుకొచ్చారు. పాస్‌వర్డ్ ఓపెన్ చేసి ప్రింట్లు తీసే క్రమంలో బయటకు వచ్చినట్లు అధ్యాపకులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా తెనాలి డివిజన్, రేపల్లె ప్రాంతాల్లోని బీఈడీ కళాశాలల నుంచే ఈ పేపర్ లీకైనట్లు సమాచారం. దీనిని కొంత మంది అధ్యాపకులు వేరే రాష్ట్రాల పిల్లలకు పంపితే వాళ్లు ఇక్కడికి పంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి ఇదే తరహాలో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని కొంత మంది ఏఎన్‌యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, దీంతో ఈ రోజు మళ్లీ ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.
Next Story