ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో క్వాంటమ్ టెక్నాలజీ
x
క్వాంటమ్ పై ముఖ్యమంత్రి పలు సంస్థలతో ఒప్పందాలు (ఫైల్ ఫొటో)

ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో క్వాంటమ్ టెక్నాలజీ

ఆన్ లైన్ శిక్షణ తీసుకునేందుకు వెయ్యి మందిని ఎంపిక చేసిన ఏపీ ప్రభుత్వం.


ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీపై అధ్యాపకులకు ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం ఈనెల 18 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ శిక్షణలో 1,000 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. వీరు వివిధ విభాగాల నుంచి వస్తున్నారు. ఏపీలోని వివిధ కాలేజీల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్, ఎకనామిక్స్, కామర్స్, అగ్రికల్చర్, మెడికల్ సైన్సెస్, ఫిషరీస్, హార్టికల్చర్, ఫార్మాస్యూటికల్స్ నుంచి వీరిని ఎంపిక చేశారు.

శిక్షణ తీసుకున్న తర్వాత అధ్యాపకులు ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీని బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ శిక్షణ ద్వారా అధ్యాపకులు విద్యార్థులను, స్టార్టప్‌లను ప్రోత్సహించి భారతదేశాన్ని క్వాంటమ్ రంగంలో ముందుంచేలా చేస్తారు.

ప్రపంచ స్థాయి నిపుణులతో శిక్షణ

ఈ శిక్షణను జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటీ), సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ), ఐబీఎం, టీసీఎస్, ఐఐటీ మద్రాస్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మీటీ)లు కలిసి నిర్వహిస్తున్నాయి. శిక్షణను ఇచ్చేవారు ప్రపంచ స్థాయి నిపుణులు. ఐబీఎం, టీసీఎస్, ఐఐటీ మద్రాస్, ఇతర సంస్థల నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు డాక్టర్ ఎల్ వెంకట సుబ్రమణ్యం (ఐబీఎం), డాక్టర్ సీవీ శ్రీధర్ (టీసీఎస్), ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ (ఐఐటీ మద్రాస్) మొదలైనవారు ఉంటారు.


జైపూర్ నుంచి ఆన్‌లైన్ క్లాసులు

ఆన్‌లైన్ క్లాసులు ఎంఎన్‌ఐటీ జైపూర్ నుంచి నిర్వహిస్తారు. డాక్టర్ పిల్లి ఇమ్మాన్యుయల్ శుభాకర్ (ఎంఎన్‌ఐటీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ 20 రోజులు, 40 గంటల కార్యక్రమంలో లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి అంశాలలో బోధన ఉంటుంది.

ఏపీని క్వాంటమ్ వ్యాలీగా మార్చే దిశగా...

ఈ శిక్షణ ఆంధ్రప్రదేశ్‌ను 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ'గా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ప్రభుత్వం చెబుతోంది. 2026 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద 156-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇది రాష్ట్రాన్ని క్వాంటమ్ టెక్నాలజీలో ముందంజలో నిలిపి, ఉద్యోగాలు, ఆవిష్కరణలు సృష్టిస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

అత్యాధునిక క్వాంటమ్‌ సిస్టమ్‌ 2

సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్‌ సిస్టమ్‌ 2 పరిష్కరిస్తుంది. ఐబీఎం అభివృద్ధి చేసిన ఈ నెక్ట్స్ జనరేషన్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌.. అటు సంప్రదాయ కంప్యూటర్ల డేటాను, ఇటు క్వాంటమ్‌ సిస్టం డేటాను ఒకేసారి విశ్లేషించగలదు. దీనిలో ఉన్న క్యూబిట్‌ హెరాన్‌ ప్రాసెసర్‌ను ఐబీఎం క్వాంటమ్‌ హెరాన్‌ అంటారు. 156 క్యూబిట్‌ (సంప్రదాయ కంప్యూటర్‌లో బైనరీ బిట్‌ వలే క్వాంటమ్‌ కంప్యూటర్‌లో క్యూబిట్‌) క్వాంటమ్‌ ప్రాసెసర్‌ను సంక్లిష్టత కలిగిన సమస్యలను పరిష్కరించేందుకు ఐబీఎం రూపొందించింది. దీంతో ఈగిల్‌ లాంటి ప్రాసెసర్లలోని ఎర్రర్‌ రేట్‌ తగ్గడంతో పాటు విశ్లేషణ వేగం పెరిగింది. ఇది ప్రతి సెకండ్‌కు 1.50 లక్షల సర్క్యూట్‌ లేయర్‌ ఆపరేషన్స్‌ దాటి వేగాన్ని అందుకోగలదు. ఐబీఎం ఇప్పటి వరకు తయారు చేసిన వేగవంతమైన క్వాంటమ్‌ ప్రాసెసర్‌ ఇదే. దీనినే దేశంలో మొదటిసారి అమరావతిలో ఐబీఎం స్థాపించబోతోంది.

Read More
Next Story