ఫ్యామిలీ కార్డులో క్యూఆర్ కోడ్ కీలకం
ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం ఈ కార్డులో కీలకం అయినది ఏమిటంటే క్యూఆర్ కోడ్. ఇపుడు ప్రపంచం మొత్తం డిజిటల్ మయమైపోతున్నది కదా.
తెలంగాణాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమల్లోకి రాబోతున్నట్లు అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి కసరత్తు దాదాపు పూర్తయిపోయింది. అందుకనే ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టును టేకప్ చేసింది. ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం ఈ కార్డులో కీలకం అయినది ఏమిటంటే క్యూఆర్ కోడ్. ఇపుడు ప్రపంచం మొత్తం డిజిటల్ మయమైపోతున్నది కదా. ఇందులో భాగంగా తెలంగాణాలోని కుటుంబాల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్ధను రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే కుటుంబంలోని సభ్యుల వివరాలు, ఆరోగ్య సమస్యలు, అందుకుంటున్న సంక్షేమపథకాలు, రేషన్ వివరాలు ఇలా సమస్తం ఒకే కార్డులో నిక్షిప్తమై ఉంటాయి.
కార్డు ఎలాగుంటే బాగుంటుందనే విషయంలో అధికారుల బృందం నాలుగురోజులు రాజస్ధాన్, కర్నాటక, హరియానా, మహారాష్ట్రలో పర్యటించింది. పై రాష్ట్రాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పనిచేస్తున్న విధానం, కుటుంబాల ఫీడ్ బ్యాక్, కార్డుల్లో నిక్షిప్తంచేయాల్సిన సమాచారం ఏమిటనే వివరాలన్నింటిపైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి ఇదే విషయాన్ని రేవంత్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది. ఇప్పటికి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పన, కార్డుడిజైన్, నిక్షిప్తంచేయాల్సిన వివరాలు తదితరాలపై ఉన్నతాధికారులతో రేవంత్ ఆరుసార్లు సమావేశమయ్యారు. దీంతోనే కార్డులపై రేవంత్ ఏస్ధాయిలో ఆసక్తిగా, పట్టుదలగా ఉన్నారో అర్ధమవుతోంది.
ఇపుడు ఆరోగ్యానికి ఒకటి, రేషన్ కు మరోటి, పథకం పథకానికి ఒక్కో కార్డు ఉంది. ఇలాంటి కార్డులన్నింటినీ ఒకటిగా చేసి అందులోని వివరాలను, లబ్దిదారుల వివరాలన్నింటినీ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లోకి ఎక్కించాలన్నది రేవంత్ ఆలోచన. అందుకనే ఆ కార్డుకు ‘వన్ స్టేట్ వన్ కార్డ్’ అని అంటున్నది. ఈ కార్డులోనే ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరుహామీల వివరాలు, లబ్దిదారుల వివరాలు కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లోనే నిక్షిప్తం అవబోతున్నాయి. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారుల సంఖ్య 89 లక్షలున్నారు. మొదట ఈ 89 లక్షల కార్డుదారుల్లోని కుటుంబ సభ్యుల వివరాలను డిజిటలైజ్ చేశారు. అలాగే కొత్తగా ఇవ్వబోయే రేషన్ కార్డుల లబ్దిదారుల సంఖ్య, వివరాలు, మహాలక్ష్మి పథకంలో రు. 500కే గ్యాస్ సిలిండర్లు అందుకుంటున్న లబ్దిదారుల వివరాలు, రాజీవ్ ఆరోగ్య శ్రీ లబ్దిదారులు, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుకుంటున్న లబ్దిదారుల వివరాలు, పెన్షన్ అందుకుంటున్న లబ్దిదారుల వివరాలన్నింటినీ డిజిల్ కార్డుల్లోకి ఎక్కిస్తుంది ప్రభుత్వం.
రేషన్ షాపుకు వెళ్ళి డిజిటల్ కార్డును స్కాన్ చేయగానే కుటుంబంలోని సభ్యుల వివరాలు, కుటుంబం అందుకుంటున్న రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. అలాగే ఏ ఆఫీసుకు వెళ్ళి అక్కడ ఫ్యామిలీ డిజిటల్ కార్డును స్కాన్ చేయగానే మొత్తం వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. కాబట్టి కుటుంబంలోని సభ్యులంతా తలా ఒక ఆధార్ కార్డును దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇపుడు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న తల్లీ, కుతుర్లు ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డులను దగ్గర పెట్టుకోవాలి. రేపు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చేస్తే ఒక్క కార్డు దగ్గరపెట్టుకుని తల్లీ, కూతుళ్ళు ప్రయాణం చేయవచ్చు. కండక్టర్ వచ్చి కార్డును స్కాన్ చేయగానే అందరి వివరాలూ అందులో కనబడతాయి. కార్డును కుంటుంబంలోని ఇంట్లో ఆడవాళ్ళ పేర్లమీదే(యజమాని తరహాలో) ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అయితే కుటుంబంలో నలుగురుంటే నలుగురికీ తలా ఒక కుటుంబం ఇస్తారా ? లేకపోతే కుటుంబానికి అంతా కలిపి ఒకటే కార్డిస్తారా అన్నదే తేలలేదు.